శ్రీ కృష్ణావతారం 5
శ్రీ కృష్ణావతారం 5 దేవకి కృష్ణుని కనుట పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్రసవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలుతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు.శ్రేష్ఠులైన గంధర్వులు (నారద, చిత్రసేనాదులు) దివ్యగానాలు చేసారు; రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేసారు; సిద్ధులు అనే దేవతలు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు; చారణులు అనే దేవతలకు భయం తీరి ఆనందించారు; దేవతలు ఉత్సవంగా భేరీలు మోగించారు;అలాంటి సమయంలో:దేవ...