శ్రీ కృష్ణావతారం 2
శ్రీ కృష్ణావతారం 2
వసుదేవదేవకీల ప్రయాణం
శూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుఱ్ఱాల పగ్గాలుపట్టి రథం తోలసాగాడు. అది చూసి దేవకీవసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలూ మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకొని. . . .సకల పరికరాలతో కూడిన పద్దెనిమిదివందల రథాలను; బంగారు గొలుసులతో అలంకరించిన నాలుగువందల ఎత్తైన ఏనుగులను; పదివేల గుఱ్ఱాలనూ; రెండువందలమంది విలాసవతులైన పరిచారికలను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీవసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో. . .కంసుడు గుఱ్ఱాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది. “సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు. కానీ, ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమగర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా!”
కంసుని అడ్డగించుట
ఇలా ఆకాశవాణి పలుకడంతో భోజవంశాన్ని పాడుచేయడానికి పుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతుండగా భయంకరంగా కత్తిదూసి తొట్రుపాటుతో చెల్లెలి కొప్పు పట్టుకుని రథం మీంచి క్రిందికి లాగాడు. తోడపుట్టినది అని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతున్న కంసుడికి వసుదేవుడు అడ్డుపడ్డాడు. ఆ కంసుడు అసలే పాపపుబుద్ధి కలవాడు. పైగా మద మెక్కి మైమరచి ఉన్నాడు. ఆగ్రహావేశంతో అగ్నిజ్వాల లాగా మండిపడుతున్నాడు. వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లని మాటల చేత అతనిని కొంత శాంతింప చేస్తూ ఇలా అన్నాడు. “బావా! కంసా! నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా. నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి; ఆడపడుచు అని గౌరవించాలి; మధురమైన మాటలతో ఆదరించాలి; అంతేకానీ, అయ్యో ఇదేమిటి ఏవో గాలిమాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా! దయచేసి వెనక్కు వచ్చేయి. ఓర్పుతెచ్చుకో. ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించ వద్దు. నాయనా! నామాట విను నిన్ను వేడుకుంటున్నాను.
అంతే కాకుండా.
వసుదేవుని ధర్మబోధ
ఈ నీ చెల్లెలు వట్టి అమాయకురాలు; అబల; నీ క్షేమాన్నేఎప్పుడూ ఆశిస్తుంది; ఏ పాపమూ ఎరుగనిది. ఇటువంటి ఈమెను ఆక్కడా ఇక్కడా వినబడే మాటలు పట్టుకుని చంపబోవడం న్యాయమేనా? కోపం మహాపాపం సుమా. పవిత్రమైన భోజవంశంలో పుట్టిన వాడివి; పుణ్యమూర్తివి; భోజవంశీయులు అందరికీ నాయకుడవు. ఇలాంటి నువ్వు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో! ఇది నీప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు. జన్మము ఎత్తినవారికి ఆ శరీరం తోపాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్ళకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచభూతాలలో కలసిపోవడమే. ఆకుపురుగును చూడు శరీరం ముందు భాగం ఎత్తి మరోచోట పెట్టి వెనుకభాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్నశరీరం విడిచిపెడతాడు. మనకు మెలుకవగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి విన్నవి ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్లు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంటవస్తాయి. తన పూర్వకర్మలు అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ, ఇంద్రియాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం ఎక్కడకీ పోవు.
చంద్రబింబం సూర్యబింబం మొదలైనవి నీటికుండలు మొదలైనవాటిలో ప్రతిబింబిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి. అలాగే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరాలలో ఆసక్తి చెంది సంచలిస్తూ ఉంటాడు. మంచి అయినా, చెడు అయినా ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మదేవుడు అంతటివాడికి అయినా తన కర్మలే తన అనుభవానికి కర్తలు. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు?
కాబట్టి, ఇతరులను బాధించడం మంచిపని కాదు. తన సౌఖ్యం కోసం అనుకుంటూ ఇతరులను బాధిస్తే ఊరకే పోతుందా? దానికి ఫలితం తరువాత అయినా పొందక తప్పదు కదా!” ఓ కంసమహారాజా! నువ్వు దయామయుడవు. ఈ దేవకి ఏదో వరసకి చెప్పడానికి నీకు చెల్లెలు కాని నీకు కూతురు వంటిది. చాలా మంచిది. గౌరవించదగ్గ ప్రవర్తన కలది. భయస్తురాలు. కొత్త పెళ్ళికూతురు. మంచి లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. దీనురాలు. భయంతో లోలోన వణికిపోతూ ఉంది. ఇదిగో నీకు మ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా! ఇలా వసుదేవుడు ఎంతో అనునయంగా కంసుడి మనస్సు కరిగించాలని మాట్లాడాడు. అయినా కంసుడికి జాలి పుట్ట లేదు. అతడు కోపపు చూపులతో కన్నుల నుండి నిప్పులు రాలుతూండగా, దేవకిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతణ్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు.
“మనుషులకు బేలతనం పనికి రాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదల రాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకూ ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి.” “మనుషులకు బేలతనం పనికి రాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదల రాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకూ ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి.” అని వసుదేవుడు ఇలా గట్టిగా నిశ్చయించుకొని . . .“ఆపదపాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తాను అనడం ప్రస్తుతానికి తగిన పని. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ప్రాణాలతో నిలచి ఉంటే, రేపటికి మరోమార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వస్తేరానీ. అందాకా వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి ఉండదా. అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడచి ఎగసిపడి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనే కారణాలు దూరదూరంగా పోతూ ఉంటాయి. ఇంతతెలిసీ ఇంకా తొట్రుపడడం ఎందుకు?పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి, భార్యను విడిపించడం తెలివైనపని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడక పోతుందా? ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినపడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి. త్వరగా నా భార్యను విడిపించడం మంచిది” అని ఆలోచించాడు వసుదేవుడు. మర్యాదతో కూడిన మంచిమాటలతో క్రూరుడైన కంసుని గౌరవించి పొగిడాడు. మనస్సులో మంటగా ఉన్నా వసుదేవుడు పైకి నవ్వుతున్న ముఖంతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు.
“ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను. వారిని నువ్వు చంపుదువుగాని.” వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తలూపుతూ సంతోషించాడు. భయపడుతున్న చెల్లెలి కొప్పును విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ వసుదేవుడు, అతని భార్య దేవకీదేవి తమ మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. కంసుడి చేత ఎడతెగని బాధలుపడుతూ దేవకీదేవి అందరు దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒకరు చొప్పున ఎనిమిదిమంది కొడుకులను ఒక కూతురును కన్నది. అలా ఉండగా. . .దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసుడికి ఇచ్చేసాడు. ఇచ్చినమాట తప్పకుండా తాత్సారం చేయకుండా బెంగ పడకుండా కన్నకొడుకును శత్రువునకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప భూమిమీద ఇంకెవ రున్నారు? పరీక్షన్మహారాజా! సత్యము నందు నిశ్చలంగా నిలపడిన బుద్ధిమంతుడికి కష్టమైన పని అంటూ ఏదీ ఉండదు. జ్ఞాని అయినవాడికి ఇష్టమైనది అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అజ్ఞానికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు. పరమేశ్వరుని భక్తుడికి ఇతరులకు ఇవ్వరానిది అంటూ ఏమీ ఉండదు. ఇలా సత్యం తప్పకుండా కొడుకును తీసుకువచ్చి ఒప్పగించిన వసుదేవుని మాటనిలకడకు మెచ్చుకుని కంసుడు ఇలా అన్నాడు. “బావా! వసుదేవా! నీ కొడుకును తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.”దుష్ట స్వభావం గల తన బావ కంసుడి మాటలు విని, కొడుకును ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాడు కానీ, పుట్టినప్పుడు ఆనకములు, దుందుభులు మ్రోగిన ఆ వసుదేవుడు, ఎప్పుడు ఏమౌతుందో అనే సందేహంతో ఉలికిపడుతూనే ఉన్నాడు. ఇంతలో . . . .
కామెంట్లు