శ్రీ కృష్ణావతారం 4

శ్రీ కృష్ణావతారం 4

బ్రహ్మాదుల స్తుతి

మధురలో పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమ శివుడు అనుచరులు, దేవతలు, నారదాది మునులు వెంటరాగా దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈవిధంగా స్తోత్రం చేసారు. “మహానుభావా! నీవు సత్యమే వ్రతంగా కలవాడవు; నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం; జరిగినది జరుగుతున్నది జరుగబోయేది అయిన కాలములలో నీవు ఉంటూ ఉంటావు; భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలూ నీయందే జన్మిస్తున్నాయి; అ ఐదు భూతాలలోనూ నీవే నిండి ఉన్నావు; పంచభూతాలూ ప్రళయంలో అణిగి పోయిన తర్వాత కూడా నీవు ఉంటూ ఉంటావు; సృష్టిలో ఉన్న సత్యమనేదే నీవాక్కు; అన్నిటిని సమానంగా చూడడం అనేది నీవే నిర్వహిస్తూంటావు; అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము; మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది; ఆమాయచేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించినవారు నీయందు భేదభావం వహించి ఉంటారు; కాని జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో అలోచించి ఈ సమస్తమైన రూపములు నీవే అంటారు. అంతే కాకుండా జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటుంది.
1) దానికి ప్రకృతి పాదు. 
2) సుఖదుఃఖాలనేవి రెండూ ఫలాలు. 
3) సత్త్వరజస్తమస్సు అనే గుణాలు మూడూ దానికి వేళ్ళు.
 4) ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ అనే నాలుగు పురుషార్ధాలూ రసాలు. 
5) దానికి శబ్దం, స్పర్శం, రూపం, రుచి, వాసన అనే ఐదూ ఇంద్రియాలు గ్రహించే విధానాలు. 
6) కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే ఆరూ స్వభావాలూ 
7) ఆరు ఊర్ములు ఆకలి, దప్పిక, శోకమూ, మోహమూ, ముసలితనమూ, మరణమూ అనేవి. 
8) రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే ఏడు ధాతువులూ ఆ వృక్షానికి గల ఏడు పొరలు అయి ఉంటాయి. ఇంత తెలిసి తొట్రుపాటు పడడమెందుకు.
 9) పంచభూతాలు, బుధ్ది, మనస్సు, అహంకారం అనే ఎనిమిది ఆ వృక్షానికి కొమ్మలు. 
10) కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మల మూత్రాద్వారాలు అనే తొమ్మిదీ ఆ వృక్షానికి గల తొమ్మిది రంధ్రాలు. 
11) ప్రాణమూ, అపానమూ, వ్యానమూ, ఉదానమూ, సమానమూ అనే పంచప్రాణాలూ నాగమూ, కూర్మమూ, కృకరమూ, దేవదత్తము, ధనంజయం అనే ఐదు ఉపప్రాణాలు మొత్తం పది ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం. 
12) జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆవృక్షంపై నివసిస్తుంటాయి.


 ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికీ మళ్లీ లయం చేయడానికీ ప్రభువా! నీవు ఒక్కడివే. పరమ జ్ఞానులు తమ మనస్సును ఏవైపునకూ పోనీయకుండా నీయందే నిలుపుతారు. అందువలన వారు నీపాదమనే తెప్ప ఆధారంతో భయంకరమైన సంసార మహాసముద్రాన్ని దాటతారు. అది కూడా ఆవుదూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు. నీవు నిత్యమూ ఎన్ని శరీరాలలో అయినా అవతరిస్తావు. అలా అసంఖ్యాకమైన అవతారాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలుగజేస్తూ ఉంటావు. ఆయా శరీరాలతో నీవు మంచివారికి అందరికి శుభములు చేకూరుస్తూ; దుష్టులకు శిక్షలు విధిస్తూ ఉంటావు.
హరీ! కొందరు జ్ఞానులము అనుకుంటూ దుష్టులై పనికిమాలిన తెలివి తేటలతో నీ నామసంకీర్తన చేయరు. నీ నామసంకీర్తనం నిజంగా జ్ఞానులైన వారిని రక్షిస్తుంది అని తెలిసినా నీ నామం మననం చేయకుండా పోయి పోయి అధోగతుల పాలవుతారు. 
నిజంగా గొప్పవారైనవారు తమ సొంతం అంటూ ఏమీలేకుండా నీ వారుగా ఉంటారు. నీ యందే తమ భావాలను నిలిపి ఉంచడం వలన భయం అనేది వారికి ఉండదు. నీ యందు హృదయాలు నిలిపి ఉంచడం వలన విఘ్నాలేవీ వారిని చేరవు. నీవు ఎక్కడ ఉంటావో ఆదివ్యలోకంలోనే వారు నివసిస్తారు. బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాల ప్రజలూ నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్త్వమయమైనది, పరిశుద్ధమైనదీ, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నీవు పొందుతుంటావు.
పద్మదళములవంటి కన్నులుగల శ్రీమన్నారాయణా! సత్త్వగుణమే నీ శరీరంగా రూపుదిద్దుకుంది. కాకపోతే విజ్ఞానంతో నిండి వుండి, నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్యము? గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడిగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలాకాకుండా నీ సత్త్వరూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలము సాక్షివిగా ఉంటావు. వాక్కుకు మనసుకు అతీతంగా ఉంటుంది నీమార్గం. గుణములకు కర్మలకు అతీతమైన నీరూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ భావనచేస్తూ వింటూ స్మరిస్తూ స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకుని భక్తుడై ఉండిపోతాడు.
పురుషోత్తమా! ఈశ్వరా! నీవు జన్మించడంవలన ఈ భూమి భారము తగ్గిపోతుంది. నీ పాదపద్మములు అండగా ఉండగా నీ దయవల్ల భూమి ఆకాశము ఎక్కడ ఉన్నాయో చూడగల్గుతాము. పుట్టుక ఎరుగని నారాయణా! నీకు పుట్టుట అంటూ వేరే లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడ గాని పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జన్మ మరణం మొదలైన స్థితులన్ని మాయకారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కానీ, నిన్ను మాత్రం ఆ మాయాదేవి ప్రక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైన క్రియలు వేటిలోనూ చిక్కకుండా ఏకైక మూర్తివిగా నిండిపోతావు. కనుకనే ఈ జగత్తులు సమస్తానికీ నీవు ఈశ్వరుడవు. మహా మత్స్యావతార మెత్తి, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, హయగ్రీవావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం మున్నగు అనే కావతారాలు యెత్తి దయాదాక్షిణ్యాది గుణాలతో, ఉదారుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము; ఈ భూమి భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము.
 ముకుందా! కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది. లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులోనుండి వెంటనే బయటకి రావయ్యా!”  బ్రహ్మాదిదేవతలు అలా విష్ణువును ప్రార్థించి దేవకిదేవిని చూసి ఇలా అన్నారు. “తల్లీ! దేవకీదేవీ! నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు కంసుడి వలన ఏమాత్రం భయంలేదు. మామాట నమ్ము. ఈనాటి నుండి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులు అందరూ సంతోషంతో పొంగిపోతున్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి.” ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, దేవకీదేవిని దీవించి, దేవతలు అందరూ శివుడిని, బ్రహ్మదేవుడిని ముందు ఉంచుకొని బయలుదేరి వెళ్ళిపోయారు.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.