శ్రీ కృష్ణావతారం 3

శ్రీ కృష్ణావతారం 3

 మథురకు నారదుడు వచ్చుట

ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేసాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాతృలు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....



 దేవకీవసుదేవుల చెరసాల

ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు.విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడూ, మహాశనుడూ, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టికుడు అరిష్టుడు ద్వివిదుడు పూతన మొదలైన రాక్షసులను కలుపుకున్నవాడై యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయినవాళ్ళు అవమానంతో తమ ఇండ్లు వదలి పదవులు వదలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం కంసుని సేవిస్తూ మధురలో ఉండిపోయారు. దేవకీదేవి కొడుకులు ఆరుగురిని వెంటవెంటనే కంసుడు వధించాడు. మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు అయిన ఆదిశేషుడనే పేర ప్రసిద్ధుడు దేవకీదేవి గర్భాన ఏడవదిగా ప్రవేశించింది. ఆసమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. 

 యోగమాయనాఙ్ఞాపించుట

ఆసమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. “భద్రా! మాయాదేవీ! నీవు గోపాలకులు గోపికలు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలు అందరూ కంసునిచేత బంధీలు అయి జైలులో ఉన్నారు. కానీ, రోహిణి మాత్రం నందుని గోకులంలో తలదాచుకుంది. ఆమె చక్కని గుణగుణాలు కలది. దేవకి కడుపులో ఉన్న శేషుడు అనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను నా అంశతో దేవకికి జన్మిస్తాను. ఆతరువాత నీవు నందుని ఇంట యశోదాదేవికి బిడ్డగా పుట్టగలవు.
మాయాదేవీ! కల్యాణమయీ! నీవు అన్నిరకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవనీ, మానవులు నిన్ను భక్తితో పూజిస్తుంటారు. నీకు కానుకలు, బలులు ఇస్తారు.దేశంలో వివిధ ప్రాంతలలో ఉన్న మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పద్నాలుగు పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా” అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞాపించాడు. ఆ యోగ నిద్రాదేవి “మహప్రసాద” మని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది. 
యోగనిద్రాదేవి, కాంతులు చిమ్ముతున్న దేవకీదేవి కడుపులో ఉన్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులు బాధపడ్డారు.

 రోహిణి బలభద్రుని కనుట

యోగనిద్రాదేవి, కాంతులు చిమ్ముతున్న దేవకీదేవి కడుపులో ఉన్న గర్భాన్ని నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులు బాధపడ్డారు. కొన్ని నెలలకు. .రోహిణిగర్భాన చాలా గొప్పవాడు అయిన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టినవాడు కనుక సంకర్షణుడు అనీ, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అనీ, అందరిని ఆనందింపచేసేవాడు కనుక రాముడు అనీ అతనికి పేర్లు వచ్చాయి. పిమ్మట. . .శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించడంతో అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకూ జీవులకూకూడా అది చూసి ఆనందం కలిగింది. అలా తనలో విష్ణుతేజం ప్రవేశించిన వసుదేవుడు, ఆ తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశపెట్టాడు. ఆ విష్ణుతేజస్సు సృష్టి అంతా నిండి ఉండేది. అన్నిటికి ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలది. లోకాలు అన్నిటికి క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణువుని యొక్క తేజస్సు అది. ఆ తేజస్సు చక్కగా తనలో ప్రవేశించడంతో, దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పుదిక్కు అనే స్తీ చంద్రోదయానికి ముందు చంద్రునికాంతితో నిండిపోయినట్లు, దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది.” అలా శుకముని చెప్పగా విన్న పరీక్షుత్తు కుతూహలంతో “ఆ తరువాత ఏమి జరిగింది.” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగాడు. ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయసూర్యునిలాగ వృద్ధిపొందాడు. అలా భగవదవతారాన్ని దేవకీదేవి గర్భంలో దాచుకున్న ఆ సమయంలో . .దేవకీదేవికి గర్భవతులైన స్తీలకు ఉండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖము తెల్లపడుతుండగా, దుర్మార్గుల ముఖాలు వెలవెలపోడం మొదలయింది. ఆమె చనుమొనలు నల్లపడుతుండగా, శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడడం ప్రారంభమైంది. ఆమె పొత్తికడుపుపై నూగారు మెరుస్తుండగా, దుష్టుల ఇండ్లలో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా, శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానివేసింది. ఆమెకు బద్ధకము కలుగుతూంటే, శత్రువులకు తెలియని అలసట మొదలైంది. శత్రువులు మట్టికరచే స్థితి వస్తూ ఉన్నట్లు, ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువ అయింది. ఇలా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధిచెందసాగాడు. ఇంకనూ. . .పంచభూతాత్మకుడు అయిన విష్ణుమూర్తి దేవకి గర్భంలో పెరుగుతూ ఉండటంతో. పంచభూతాలలో జలములు ఆ గర్భస్థ బాలుడిని చూడడానికి వెళ్ళాయా అన్నట్లు, ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి; అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు, ఆమె శరీరం కాంతితో మెరిసింది; ఆ గర్భస్తుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లు, ఆమెకు నిట్టూర్పులు ఎక్కువ అయ్యాయి; భూమి ఆ కడుపులోని పిల్లాడిని పూజించడానికి వెళ్ళిందా అన్నట్లు, దేవకీదేవికి మన్నుపై ప్రీతి ఎక్కువైంది; గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి అకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు, కనుపించని ఆమె నడుము విశాలమైంది. అటుపిమ్మట . . . .దేవకీదేవి గర్బాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం చేత; ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగిసిపోతూ ఉంటే, శత్రువుల భార్యల మంగళ సూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి; తన శరీరకాంతి హెచ్చుతూ ఉండగా, పగవారి భార్యల శరీర కాంతులు మాసిపోసాగాయి; ఆమెకు ఆభరణాలు బరువు అనిపిస్తుండగా, శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి; ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్నకొద్దీ శత్రువుల భార్యలు ముత్తైదువలుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి.
ఈవిధంగా లోకాలన్నింటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో ఇలా మోస్తూ. .అజ్ఞాని నోట సరస్వతి వలె, కుండ లోపల పెట్టిన దీపకణికలాగ దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉంది. అలా నిర్బంధంలో అణగిమణిగి ఉండిపొయింది. అంతకంతకూ అతిశయిస్తున్న ఆమె ముఖంలోని కాంతిని శరీరపు మెరుపునూ అందాన్ని చూసి కంసుడు నిశ్చేష్టుడు అవుతున్నాడు. అస్తమానూ భయపడుతూ తనలోతను ఇలా అనుకోసాగాడు.
“ఈమె గర్భం చూస్తూ ఉంటే, నా గుండె బరువెక్కుతోంది. మనస్సు కలవరపడుతోంది. ఇంతకు ముందు ఏ గర్భాన్ని చూసినా ఇలా అవ్వ లేదు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉండవచ్చు.
ఇప్పుడు నేనేమి మంత్రాంగం ఆలోచించాలి? ఏమి తంత్రం చేయాలి? రోజురోజుకీ ఈమె గర్భం కాంతిమంతం అవుతూ ఉంది? ఇటు చూస్తే ఈమె ఆడకూతురు గర్భవతి చెల్లెలూ కదా ఎట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపానంటే, నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోవా? “వావివరుసలు చూడని క్రూరుడు బ్రతికి ఉన్నా చచ్చిన వాడే” అని నిందిస్తారు లోకులు అలాంటి వాడు నరకానికి పోతాడు. దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా?” ఇలా అని ఆలోచించి నిశ్చయించుకుని, క్రౌర్యం మాని, ధైర్యం తెచ్చుకొనిస గాంభీర్యం పైపైన పులుముకుని, శూరునిలా ప్రవర్తించాడు. “చెల్లెలిని చంపడం మహా పాపం” అని గట్టిగా భావించాడు. ఆతర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగ శాంతస్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు. అయినా లోలోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు. “తప్పించుకోలే నంతటి గొప్ప శత్రుత్వం పుట్టుకు వచ్చింది. ఇంకెలాగ? ఈమెకు విష్ణువు ఎప్పుడు పుడతాడో? ఏమిటో? పుట్టగానే పురిటింట్లోనే వాడిని పట్టుకుని చంపేస్తాను.” అంటూ దేవకి ప్రసవించే సమయంకోసం ఎదురుచూడసాగాడు. విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా, కంసుడు విష్ణువు తప్ప ఇతర విషయాలు సమస్తం మరచిపోయాడు.
తిరుగుతున్నా, భోజనంచేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా, ఎప్పుడూ విష్ణువునే స్మరించసాగాడు. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగాడు. 
ఇంకా కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే. .చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణువు మాటేనని వింటూ ఉన్నాడు. కనులకి ఏది కనిపించినా అది విష్ణుదేవుడి రూపమేనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డిపరక తగిలినా విష్ణుని చేయి తగిలిందేమోనని ఉలుక్కిపడుతూ ఉన్నాడు. ముక్కుకు ఏవాసన సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమోనని భ్రమపడి విష్ణువు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా అవి విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.