SRIMADRAMAYANA (Sundarakanda )by Chaganti Koteswara Rao Garu S5

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- 5 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

వికృత రూపములు కలిగిన రాక్షసస్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి " సీతా ! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసుబ్రహ్మగారి కుమారుడు. బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరములను పొందాడు. అలాంటి రావణుడితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వం? పోనీలే మెల్లగా మనస్సు మార్చుకుంటావని ఇంతకాలము చూసాము ఎంత చెప్పాలి నీకు " అని గద్దించారు.

సీతమ్మ " ఐశ్వర్యము ఉంటే భర్తగా చూడడము, రాజ్యం ఉంటే భర్తగా చూడడము, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడము నాకు తెలియదు. ఆయన దీనుడు, రాజ్యహీనుడు కావచ్చు కాని నా భర్త నాకు గురువు, సమస్తము. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, శచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చ్యవనమహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో నేను అలా రాముడిని అనువర్తిస్తాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినెయ్యండి. నేను మాత్రము రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమకాలితో కూడా ముట్టుకోను. మీరు నాకు ఇటువంటి మాటలు చెప్పకూడదు నేను వినకూడదు " అన్నది.

హరిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతున్నది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను " అన్నది.
ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ " నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను కాని హరిజట బయటపడింది కాబట్టి చెపుతున్నాను ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో అలా నేనుకూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ఈమెని దండించమని ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా! కాబట్టి ఈమె పీక పిసికి చంపి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది " అన్నది.

మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అంటూ వాటాలు వేసుకున్నారు.

అజముఖి అనే స్త్రీ " ఈమెని అందరము సరిసమానముగా వాటాలు వేసుకుందాము. తొందరగా కల్లు తీసుకురండి. ఈమెని తింటూ, కల్లు తాగుతూ, నికుంబిలా నాట్యం చేద్దాము" అన్నది.
సీతమ్మ ఏడుస్తూ " ఇక్కడ మరణిద్దామన్నాకూడా నాకు స్వేఛ్చ లేదు " అని అనుకొని, ఆ రాక్షస స్త్రీలని చూసి భయపడుతూ కూర్చున్న చోటనుంచి లేచి శింశుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చున్నది.

త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి " ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి, మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశములో వచ్చారు. వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉన్నది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. వాళ్ళు వృషభములు పూన్చిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. వాళ్ళందరూ పుష్పక విమానములో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.
పాలసముద్రము మధ్యలో ఒక కొండ ఉన్నది ఆ కొండ మీద హేమసింహాసనము ఉన్నది. ఆ సింహాసనము మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమతొడ మీద సీతమ్మ కూర్చుని ఉన్నది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకము చేశారు. నాకు ఆ సమయములో రాముడు రెండు చేతులతో కనపడలేదు. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోనుంచి వస్తున్నాయో, ఎవరివల్ల నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపముగా, నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు.

ఇక్కడ లంకాపట్టణములో రావణాసురుడు గాడిదలు పూన్చిన రథం ఎక్కి, ఎర్రటి వస్త్రములు ధరించి, నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంతదూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు. తరువాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపుకొట్టే మురికి గుంటలో పడిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ, ఎర్రటి వస్త్రములు ధరించి, బోడి గుండుతో ఉన్న ఒక స్త్రీ పాశము వేసి రావణుడిని బయటకి లాగి పశువుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ, నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైనవారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణదిక్కుకి వెళ్ళిపోయారు.

ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. నలుగురు మంత్రులచేత సేవింపబడుతున్నాడు. ఎక్కడినుంచో ఒక మహావానరము వచ్చి లంకా పట్టణములోని ఇళ్ళన్నిటినీ అగ్నికి బలిచేసింది. ఎక్కడ చూసినా ' ఓ తల్లి! ఓ అక్క! ఓ తండ్రి! ఓ చెల్లి! ' అనే కేకలు వినపడ్డాయి. లంకంతా బూడిదయిపోయింది.

నేను అటువంటి కలని చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభము ఉన్నది. అదుగో నిష్కారణముగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతున్నది. ఎడమ భుజం, ఎడమ తొడ అదురుతున్నది. కట్టుకున్న పట్టుపుట్టం తనంతట కొంచెం కిందకి జారింది. ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తున్నది. పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కాని ప్రస్ఫుటముగా శుభశకునములు ఆవిడ శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరు బ్రతకాలి ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలనుకుంటే మీ మీదకి రామబాణములు పడకుండా ఉండాలంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతము చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది " అని చెప్పింది.

త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు.

 సీతమ్మ " నన్ను పదినెలల నుండి ఇంత బాధ పెట్టారు. నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు అందుకనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ రెండు నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడము కన్నా ఇప్పుడే మరణించడము ఉత్తమం అనుకొని  కాలమే మృగ స్వరూపములో వచ్చి నన్ను మోహపెట్టింది నేను అల్పభాగ్యం ఉన్నదానిని. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను అన్నీ పోయాయి. రాముడి తరవాత పుట్టిన వాడిని వదిలాను. లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరము అయ్యాడు. రామా! రావణుడు పదినెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభపెట్టాలని చూశాడు. నేను లొంగలేదు నా భర్తే నాకు దైవం అని నమ్మాను. భూమిమీద పడుకున్నాను. ఉపవాసాలు చేశాను. ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహము కలుగుతుందని అనుకున్నాను. నువ్వు రాలేదు నన్ను కరుణించలేదు. నా పాతివ్రత్యం విఫలమయ్యింది. కృతఘ్నుడైన వ్యక్తికి ఉపకారము చేస్తే ఆ ఉపకారము ఎలా మరువబడుతుందో అలా నేను చేసిన ఉపాసన నేను పాటించిన పాతివ్రత్యం అన్నీ కూడా నిష్ప్రయోజనము అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చేవాళ్ళు లేరు. విషం త్రాగి చనిపోదామంటే విషం ఇచ్చే వాళ్ళు లేర 'ని అనుకుని తన కేశపాశములని(జుట్టుని) చెట్టు కొమ్మకి తాడులా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నది.
సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణములో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి. సరోవరములో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోతే తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడము  వలన ఆ కాడ కదిలి కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదులుతుంది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్నుకూడా ఆ సమయంలో అలా అందముగా అటూ ఇటూ కదిలింది.

అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు ' ఈశ్వరానుగ్రహము చేత నాకు సీతమ్మ దర్శనము అయ్యింది. రావణుడిని చూశాను సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను. త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయము రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని నా మీదకి వస్తారు. నాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.

 నేను వానర బాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధము కాదు. మనుష్య బాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపములో ఉన్న నేను మనుష్య బాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణముగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఒదార్చాలి? " అని అనుకుంటూ " సీతమ్మ ఉరి పోసుకోవడము మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామకథని చెబుతాను " అని అనుకొని హనుమంతుడు రామకథ చెప్పడము ప్రారంభించాడు.

" పూర్వకాలం కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు. ఇంద్రుడితో సమానమైనవాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడము కోసమని   సత్యవాక్యమునందు నిలపడము కోసమని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము  చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యములో ఉండగా ఒకనాడు జనస్థానములో పదునాలుగు వేలమంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయజింకని ప్రవేశ పెట్టి రామలక్ష్మణులు లేని సమయములో సీతమ్మని అపహరించాడు. సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకము చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను నూరుయోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రముతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపావృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను " అని చెప్పి ఆగిపోయాడు.

ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నముగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందములో పరమ సంతోషముగా సీతమ్మ శింశుపావృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా దగ్గర దగ్గరగా వచ్చి కాళ్ళతో కొమ్మని పట్టుకొని చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై పింగళ వర్ణముతో పచ్చటి నేత్రములతో పగడాల మూతిలాంటి మూతితో రామకథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.