శ్రీ కృష్ణావతారం 1




సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు. "పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూసి ఇలా పలికాడు. నీవు సూర్యవంశ చంద్రవంశాల విస్తారాలను తెలియ జెప్పావు. ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు. మేము విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. శ్రీమహా విష్ణువు మహాత్ముడూ, ఈ లోకాలకు ఈశ్వరుడూ. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు. అలా పుట్టి ఏవిధంగా ప్రవర్తించాడు. ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేసాడు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది. శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసారబాధలకు ఔషధం. చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది. మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంకచాలు అనేవాడు ఎవడూ ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆమాట ఎవరూ అనరు. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవసైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవసేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు. నేను మా అమ్మ గర్భంలో ఉండగా ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రంచేత బాధపడి నిశ్చేష్టుడను అయ్యాను. ఆ సమయంలో పాండవకులాన్ని నిలపెట్టడానికి శ్రీకృష్ణభగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు. పురుషోత్తముడైన విష్ణువు పురుషరూపంతోనూ కాలరూపంతోనూ లోకంలోని జీవులందరి లోపలా బయటా కూడా ఉంటాడు. అలా ఉండి జననమరణాల నుండీ సంసారబంధాల నుండీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పురుషోత్తముని చరిత్ర అంతా వివరంగా చెప్పు. బలరాముడు రోహిణీదేవి కుమారుడు అని చెప్పావు. మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భానకూడా ఎలా కలిగాడు. కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు విడిచిపెట్టి వ్రేపల్లెకు ఎలా వెళ్ళాడు. ఎవరి ఇంటిలో నివసించాడు. ఎలా ప్రవర్తించాడు. ఎందుకు ఆయన తన మేనమామ కంసుని సంహరించవలసి వచ్చింది. ఆయన భూమి మీద మానవుడిగా ఎన్ని సంవత్సరములు జీవించాడు. ఆయనకు ఎందరు భార్యలు. వారితో ఏవిధంగా మెలగేవాడు. ఇంకా ఘన కార్యములు ఏమేమి చేసాడు. ఆ మాధవుని చరిత్ర ఇంకా ఎంత ఉందో అది అంతా నాకు వివరంగా చెప్పవలసింది.” అని పరీక్షిత్తు ఇంకా ఇలా అన్నాడు.“నీ ముఖము అనే పద్మంనుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికధలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరిస్తున్నది. మరణం దగ్గర పడుతోందే అనే దుఖం అంతరించింది. ఆకలిదప్పులు దూరమైపోయాయి. మనస్సు ఆనందంతో పరవళ్ళుతొక్కుతోంది.” ఇలా అంటున్న పరీక్షిత్తు మాటలు విని వేదవ్యాసుడి కుమారుడు అయిన శ్రీశుకుడు ఇలా చెప్పసాగాడు.
“విష్ణుకధా ప్రసంగం కూడా విష్ణుకథల యందు ఆసక్తి గలవారినీ, విష్ణుమూర్తి కథలు చెప్పేవారినీ; విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగాజలం వలెనే పునీతులను చేస్తుంది.  

మహారాజా! పరీక్షిత్తు! వివరంగా చెప్తా విను. పూర్వం ఎంతో మంది దానవశ్రేష్ఠులు భూమి మీద పుట్టి, అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి అ భారం మోయలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి కన్నీరుమున్నీరుగా విలపించింది. బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు. భూదేవినీ, దేవతలనూ వెంటపెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు. పురుషసూక్తం పఠించి అద్భుతమైన సమాధిస్థితిలో ప్రవేశించాడు ఆ ధ్యానంలో ఒక విషయం ఆయనకు వినపడింది. అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు.
“దేవతలారా! మీరు అందరూ మీ మీ అంశలతో యాదవ కులంలో భూమి మీద జన్మించండి. లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవుడికి కుమారుడిగా జన్మించి భూభారం అంతా తొలగిస్తాడు. అప్సరలారా! మీరు అందరూ భూమి మీద సుందరమూర్తులై విష్ణువును పూజించడానికి పుట్టండి. విష్ణువు ప్రీతికోసం ఆదిశేషుడు హరికళతో విష్ణుని అన్నగారిగా పుడతాడు. ఈ ప్రపంచం అంతా యోగమాయ యొక్క మాయ చేత మోహం చెందుతూ ఉంటుంది. ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ ప్రకారం తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది.” ఇలా దేవతలకు చెప్పి వారిని సమాధాన పరచి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తనలోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన శూరసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధురకూ శూరసేనమునకూ సంబంధించిన దేశాలు పరిపాలించాడు.ఏ మధురానగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో, ఆ మదురానగరం పూర్వకాలంలో యాదవ ప్రభువులు అందరకీ మొదటినుండీ రాజధానిగా ఉండేది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.