SRIMADRAMAYANA (Sundarakanda )by Chaganti Koteswara Rao Garu S8

SRIMADRAMAYANA PRAVACHANAMRUTHADHARA -- BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu

S8

ఆకాశములోని మేఘాల్ని తాగుతున్నాడా ! అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తరదిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరములు ' ఆకాశము బ్రద్దలయ్యిందా ' అనుకున్నారు. వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి " తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తోంది అది హనుమదేనా? " అన్నారు.
జాంబవంతుడు " అది ఖచ్చితంగా హనుమే. హనుమకి ఒక కార్యం చెబితే అవ్వకపోవడము అన్నది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు " అన్నాడు.

హనుమని అంత దూరములో చూడగానే వానరులంతా పరుగులు తీసారు. హనుమంతుడు " చూడబడెను సీతమ్మ " అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనవారు తప్ప మిగిలిన వానరములన్నీ తమ తోకల్ని కర్రలలా నిలువుగా పెట్టి, ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనని ముట్టుకొని పారిపోతున్నారు. హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. " నిజంగా ఆ రావణుడికి ఎంత తపఃశ్శక్తి ఉన్నదో సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూడిద కాలేదు. సీతమ్మ పాతివ్రత్యము చేత రావణుడు ఎప్పుడో మరణించాడు. రాముడు నిమిత్తముగా వెళ్ళి బాణము వేసి చంపడమే " అన్నాడు.

అంగదుడు " అంతా తెలిసిపోయింది కదా! ఇంక రాముడికి చెప్పడం ఎందుకు? ఇలాగే వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము " అన్నాడు.

జాంబవంతుడు " తప్పు, అలా చెయ్యకూడదు, పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రముగా చెయ్యకూడదు. ఈ విషయాలని రాముడికి చెప్పి ఆయన ఎలా చెబితే అలా చేద్దాము " అన్నాడు.

వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు. వాళ్ళు వెళుతుండగా వాళ్ళకి మధువనం కనపడింది. ఆ మధువానాన్ని దదిముఖుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనె పట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వులనుండి తీసిన మధువు, పళ్ళనుండి తీసిన మధువు, రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉన్నది. ఆ వానరములన్నీ అంగదుడి దగ్గరికి వెళ్ళి " ఆ మధువనంలోని మధువుని త్రాగుదాము " అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తేనెపట్లు పిండేసుకుని తేనె త్రాగేసారు. అక్కడున్న పాత్రలలోని మధువు త్రాగేసారు. చెట్లకి ఉన్న పళ్ళని తినేశారు. వారందరూ విపరీతంగా తేనె త్రాగడం వలన మత్తెక్కి కొంతమంది చెట్లకింద కూర్చుని పాటలు పాడడం మొదలుపెట్టారు. పాటలు పాడుతున్నవారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యములు చేస్తున్నారు. కొంతమంది కనపడ్డవారికి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు. కొంతమంది పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు, కొంతమంది అటూ ఇటూ నడుస్తున్నారు, కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు. కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు.

ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముఖుడి సైన్యం వస్తే వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగములు చూపించారు. ఆ తరువాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు. ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దదిముఖుడు సుగ్రీవుడితో వానరబాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది (వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు). ఒకపక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడము గమనించిన లక్ష్మణుడు కంగారుగా " అసలు ఏమయ్యింది? " అన్నాడు.

" దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువానాన్ని నాశనము చేసాయి. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనము చేసుకుని ఉంటాడు " అని లక్ష్మణుడితో అని సుగ్రీవుడు " వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను " దదిముఖుడితో అన్నాడు.

దదిముఖుడు వానరములతో " సుగ్రీవుడు రమ్మంటున్నాడు " అని చెప్పగానే అందరూ ఆకాశములోకి ఎగిరిపోయి కిష్కిందకి చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్ళి " రావణుడు సీతమ్మని లంకలో శింశుపా వృక్షం క్రింద ఉంచాడు. సీతమ్మ చాలా బాధ పడుతున్నది. మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చెయ్యాలి " అన్నారు.

రాముడు " సీత నాయందు ఎలా ఉన్నది? " అని అడిగాడు.
అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరములు ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి. హనుమంతుడు దక్షిణదిక్కుకి నమస్కరించి " సీతమ్మ తపస్సుని పాటిస్తున్నది. నీయందు పరిపూర్ణమైన ప్రేమతో ఉన్నది " అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళన్ని చెప్పి చూడామణిని ఇచ్చి " సీతమ్మ కేవలము ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానని అన్నది. మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకురావాలి " అన్నాడు.
రాముడు " సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను " అని ఏడ్చి, సీత ఎలా ఉన్నదని అడిగిగాడు. హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని వివరించి " నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందినది. సుగ్రీవుడిని, మిగిలిన వానరములని కుశలమడిగింది. శోకముర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవ్వాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తున్నది " అని చెప్పాడు.

హనుమంతుడు తన వాక్ వైభవంతో సీత రాములని సంతోషపెట్టాడు.
హనుమ చెప్పిన మాటలని విన్న రాముడు ఎంతగానో సంతోషించి " హనుమ! నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. నూరుయోజనముల సముద్రమును దాటి లంకా పట్టణములోకి వెళ్ళడమనేది మానసికముగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణములో ప్రవేశించి, సీత దర్శనము చేసి, ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడమనేది సామాన్యమైన పనికాదు.

సేవకులు మూడురకములుగా ఉంటారు. ప్రభువు చెప్పిన పనికన్నా తనలో ఉన్న సమర్ధత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగిన సమర్ధత కలిగినవాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యము ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్లు మధ్యములు. తనకి చెయ్యగలిగే సమర్ధత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యనివాడు ఎవడు ఉంటాడో వాడు అధముడు. ఇవ్వాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకి చెప్పి ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని బాధని తొలగించి సుఖమును పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. ఇవ్వాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే. అందుకని నా దేహముతో నీ దేహాన్ని గాఢాలింగనము చేసుకుంటాను " అని హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగ కౌగలించుకున్నాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.