పరశురాముడు జయంతి.......
పరశురాముడు జయంతి.......
*పరశురాముడు*
పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకన్నాడు.
తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.
" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.
అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది. బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.
" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు.
సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు.
బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.
బుచీకిని కొడుకు జమదగ్ని మహాముని. అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు.
ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరధుడనే గంధర్వున్ని చూసి లిప్తకాలం మోహపడింది.
అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ వున్న కుమారుల్ని ఆదేశించాడు. వాళ్ళు ఆ పని చెయ్యలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో కణకణలాడుతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లినీ, సోదరుల్నీ పరశువుతో నరికి చంపాడు. ఆ తరువాత, శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు.
వీరాధివీరుడు కార్తవీర్యార్జునుడు హైహయ వంశీయుడు, మాహిష్మతీ పురాధీశుడు. వెయ్యి చేతులున్నాయతనికి. అగ్ని దేవుడు వెళ్ళి అడిగితే గిరులూ, నగరాలూ, అరణ్యాలూ, గ్రామాలూ, కొండల కింది కుగ్రామాలూ ఆహారంగా ఇచ్చాడాయనకు. అవన్నీ దహిస్తూ, ఒకనాడు, వశిష్టుడు లేని సమయంలో, ఆయన ఆశ్రమం వున్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు . ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు. ఇంతలో వశిష్టుడు వచ్చాడు. " ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక" అని శపించాడు.
ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి. రాజు ఆ గోవును తన కిమ్మన్నాడు. మహర్షి కాదనేసరికి బల ప్రయోగంతో కార్యవీర్యార్జునుడు ధేనువును మహీష్మతీ పురానికి తీసుకెళ్లాడు.
పరశురాముడికి సంగతి తెలిసింది. కోపోద్రిక్తుడై కార్యవీర్యార్జునుడి మీదకి దండెత్తి వెళ్ళి అతని వేయి చేతులూ ఖండించి శిరచ్చేదం చేశాడు.
అందుకు ఆగ్రహోదగ్రులైన కార్యవీర్యుడి కొడుకులు పదివేల మందీ పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి, జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు.
పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.
పరశురాముడు మాట్లాడలేదు.
గొడ్డలి చేత పట్టుకున్నాడు.
ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదలివెళ్ళాడు.
మాహీష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలొ వున్న పిండాలతో సహా క్షత్రియులందర్నీ నాశనం చేశాడు.
తరువాత అశ్వమేధయాగం చేసి భూమినంతటినీ కశ్యపమహర్షికి దక్షిణగా ఇచ్చాడు. అప్పటినుండి భూమికి 'కశ్యపి' అనే పేరు వచ్చింది.
"భూమిని నాకిచ్చేశావు. ఇంక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్రతీరానికి వెళ్ళు" అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్ధేశంతో ఆయన అలా ఆదేశించాడు.
సరేనన్నాడు పరశురాముడు.
అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది.
క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. ఆరాజ్యకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు. ఉరుములతో ఎత్తబడినందుకే దానిని 'ఉర్వి' అన్నారు.
"మహాత్మా! పరశురాముని బారినుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను" అంది భూదేవి.
కశ్యపుడు వాళ్ళందర్నీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు.
నేలతల్లి సంతోషించింది.
కామెంట్‌లు