నిమిషాంబ దేవాలయము శ్రీరంగ పట్టణము
నిమిషాంబ దేవాలయము
కర్నాటకలో బెంగుళూరు నుండీ మైసూరుకు వెళ్ళే దారిలో ’ మండ్య ’ దాటినతరువాత వచ్చే శ్రీరంగపట్టణము అనే ఊరు చాలా ప్రసిద్ధమైనది. ఒకప్పుడు మైసూరు రాజ్యానికి ఇదే రాజధాని. శ్రీరంగ పట్టణానికి అతి సమీపములో ఈ నిమిషాంబ దేవస్థానము ఉంది. శ్రీరంగ పట్టణము అనగానే గుర్తొచ్చేవి, శ్రీ రంగనాథ ఆలయము , మరియూ ఈ నిమిషాంబ దేవస్థానము.
ఈ నిమిషాంబ దేవస్థానానికి ఒక ఆసక్తికరమైన స్థల పురాణము ఉంది.
పురాణ కాలములో ’ సుమనస్కుడు ’ అనే రాజు లోక కల్యాణార్థమై , పరమేశ్వరుని ప్రచోదనము చేత, ’ పౌండరీక యాగము ’ చేయ సంకల్పించాడు. దానికి రక్షణా భారమును ’ ముక్తిక ఋషి ’ వహించాడు. అయితే ఆ యాగాన్ని పాడుచేయాలని, దానవులు ప్రణాళికవేసి ’ సుమండలుడు’ అనే రాక్షసుడిని పంపారు.
ముక్తిక ఋషి రుద్రాంశ సంభూతుడు. అయినా కూడా సుమండలునితో జరిగిన యుద్ధములో ఓటమి చూడవలసివచ్చింది.
అప్పుడు ముక్తిక ఋషి, పార్వతీదేవిని ప్రార్థించగా, ఆ దేవి నిమిషములో యజ్ఞకుండము నుండీ ఉద్భవించి దానవులను హతమార్చింది. దానికి హర్షముతో ముక్తికఋషి, పార్వతీ దేవిని ’ హే నిమిషాంబా’ అని సామ గానము చేశాడు.
తరువాత కలియుగములో, సుమారు ఒక ఆరు వందల యేళ్ళ కిందట, అప్పటి మైసూరు మహరాజు నిధనము చెందగా, అంత్య క్రియల తరువాత అతడి అస్థికలను కాశీలో కలుపుటకు తీసుకుని వెళుతూ , మార్గములో ఈ పార్వతీదేవి యజ్ఞకుండమునుండీ ఉద్భవించిన చోటు ఒక దేవాలయమును చూసి, అక్కడ విశ్రమించి, అస్థికలను ఒక చెట్టుపై పెట్టారు. మరునాడు చూస్తే , అందులో అస్థికలు మాయమై, వాటి బదులు అందులో పువ్వులు కనిపించాయి. రాజ పరివారము , పురోహితుడు భయభీతులై, ఆ సంగతిని ఎవరికీ చెప్పక, ఆ పువ్వులున్న కుండనే కాశీకి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగా , అందులో యథావిధిగా అస్థికలే ఉన్నాయి. వారు ఆశ్చర్యపోయి, అస్థి నిమజ్జనము చేసి వచ్చి జరిగినది చెప్పారు.
పార్వతీ దేవి ఉద్భవించిన ఆ చోటే ఈ ఆలయము నిర్మాణమైనది. అదే ఈ నిమిషాంబా దేవాలయము.
దానితర్వాత , మరొక మూడు వందల యేళ్లకు, అప్పటి మైసూరును పాలించే సోమవంశపు ముక్తరాజు అనే రాజు, శత్రువులతో పరాజయము తప్పించుకొనుటకు పార్వతీదేవిని ప్రార్థించగా, ఆ దేవి కలలో కనబడి, ’ ఒక అత్యంత శక్తివంతమైన ప్రదేశములో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించు. నీ కోరికలన్నీ నిమిషములో తీరుస్తాను’ అని చెప్పిందట. అంతేకాక, ’ ఆ ప్రదేశానికి చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉండవలెను. అటువంటి ఒక ద్వీపములో శ్రీచక్రాన్ని ప్రతిష్టించు’ అని సందేశముకూడా ఇచ్చిందట.
రాజాదేశము మేరకు పరివారము వారు అటువంటి ప్రదేశముకొరకూ వెదకి , చివరికి, ఈ నిమిషాంబ ఆలయపు విశేషమును తెలుసుకొని, అస్థికలను పువ్వులుగా మార్చిన ప్రదేశము కాబట్టి, ’ ఇంతకన్నా శక్తివంతము , పవిత్రము అయిన చోటు ఇక ఉండదు’ అని భావించి, రాజుకు నివేదించగా, రాజు అక్కడే భూప్రస్తారములో, కృష్ణ శిల తో శ్రీచక్రాన్ని నిర్మింపజేసి దానిని ఆదేవి ముందరే ప్రతిష్టించారు.
ఇప్పటికీ ఈ దేవాలయము భక్తులపాలిటి కల్పవృక్షము వలె, వారు కోరిన ధర్మబద్ధ మైన కోరికలను అతి శీఘ్రముగా నెరవేరుస్తున్నది.
ఈ ఆలయములో ఇంకా ముక్తికేశ గుడి, లక్ష్మీనారాయణ గుడి, ఆంజనేయ, వరసిద్ధి వినాయక, సూర్యుల గుడులు కూడా ఉన్నాయి.
సాధారణముగా యే గుడిలో చూసినా, చుట్టూ కోతులో, ఆవులో, కాకులో ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కువగా మేకలు, మేకపోతులు వస్తుంటాయి .
సుమారు ఇరవై అయిదు యేళ్ళ కిందట ఈదేవి మహాత్మ్యము, ఈ గుడి విశేషము విన్న నా శ్రీమతి, అక్కడికి వెళదాము అనగా, సరే అన్నాను గానీ వెళ్ళనే లేదు. సుమారు నలభై రోజుల కిందట మా గురువుగారి ఆదేశము మేరకు లలితా సహస్రనామ పారాయణము మొదలుపెట్టాను. గురువుగారు ఎందుకు అలా ఆదేశమిచ్చారో తెలియదు. గురువాజ్ఞగా భావించి మొదలుపెట్టాను. ఈ రోజు ఉదయము, అనుకోకుండా కొందరు ’ మహోదయ పుణ్యకాలము ’ సందర్భముగా శ్రీరంగ పట్టణానికి దగ్గర కావేరి నదిలో స్నానానికి వస్తావా అని అడగడము, నేను సరేనని వెళ్ళడము జరిగింది. అదయ్యాక, పక్కనే ఉన్న అమ్మవారి ఈ గుడిని దర్శించి సంతోషించాను. ఎప్పటినుండో వెళ్ళాలనుకున్నది ఈ మహోదయ పుణ్యకాలములో కుదిరింది కదా అని ఆనందము కలిగింది. తరువాతి మహోదయ పుణ్యకాలము ఇంకో ఇరవై యేడు యేళ్ళకు కానీ రాదట. నందోరాజా భవిష్యతి.
.
కామెంట్‌లు