వేద సంస్కృతి లో ఎంగిలి దోషం.......పాపం
ఎంగిలి
నోటిలో ఎక్కడ, ఏది తగిలినా అది
లాలాజలంకి తగిలి దానిలో బాక్టీరీయా/వైరస్ ఉంటే అంటుకుంటుంది. దానికిఎంగిలి అని పేరు పెట్టారు మన పెద్దలు.
వేద సంస్కృతి లో ఎంగిలి దోషం.......పాపం..
మన పూర్వీకులు మనకు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం.
ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.
ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే పళ్ళెంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.
ఇంతెందుకు స్వయంగా మన సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని మనం తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది. అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..
పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.
పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.
ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి పళ్ళెంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.
పూర్వం మన ఇళ్ళలో ఎవరి పళ్ళాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు.
ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి పళ్ళాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండిపళ్ళెంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా పళ్ళానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు.
ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో...
వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.
కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.
ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధా చేస్తే, వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.
కరోనా వ్యాపిస్తున్న ఈ సందర్భంలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.
ఎంగిలి దోషం అంటని మూడుపదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.
1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు.
వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.
వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం...
సర్వే జనాః సుఖినో భవంతు
కామెంట్‌లు