గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం)
వివరించే కథ :
పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది.
తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.
సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.
మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం :-
మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.
ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు.
తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.
కామెంట్‌లు