తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి వైభవం

* తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి వైభవం *

త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారం కోసం ఆవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం- నృసింహస్వామి. ప్రహ్లాదుడి విన్నపం మేరకు సద్యోజాతంగా అంటే వెంటనే ఆవిష్కారమైన అవతార పరంపరలో నరసింహావతారం విశేషమైనది. మృగమూ కాకుండా, మనిషీ కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి సాకారమయ్యాడు. హిరణ్య కశిపుడు పొందిన వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పరమాత్మ తన మూర్తిమత్వాన్ని ప్రకటించి అతణ్ని వధించాడు. హిరణ్యమంటే బంగారం. కశిపమంటే భోగలాలసత్వాన్ని పెంచే గుణం. లౌకిక పరమైన సౌఖ్యాలు, సంపదలు, అనంతమైన కోరికల విషవలయంలో చిక్కుకుని, హృదయంలో వెలిగే పరంజ్యోతిని హిరణ్య కశిపుడు దర్శించలేకపోయాడు. తన వాడి గోళ్లతో, అసురుడి హృదయాన్ని పెరికి అందులో వెలిగే జ్ఞానజ్యాతిని దర్శింపజేసి, హిరణ్య కశిపుడికి నృసింహుడు ముక్తిని ప్రసాదించాడు. చీకటి-వెలుతురు, మంచి-చెడు, రాత్రి-పగలు, మానవత్వం-దానవత్వం, నిద్ర-మెలకువ... ఇలా ద్వంద్వాత్మక ప్రవృత్తితో జగత్తు కొనసాగుతుంది. ఆ రెండు అంశాల సంధిలో అవగతమయ్యే తత్త్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ద్వంద్వాత్మక స్థితులకు అతీతంగా మసలుకుని, ఏకోన్ముఖంగా చైతన్య పూరితంగా వ్యవహరించాలి. నృసింహావతారం అందించిన సందేశమిదే!

హిరణ్యకశిపుడి వధ తరవాత తన ఉగ్రరూ పాన్ని ఉపసంహరించి, ప్రహ్లాదుడికి ప్రేమాస్పద మూర్తిగా స్వామి దర్శనాన్ని అనుగ్రహించాడంటారు. అలా నరహరి ప్రసన్నకారకమూర్తిగా తేజరిల్లిన క్షేత్రమే- యాదాద్రి. పంచనారసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవ వైభవాన్నిసంతరించుకుంది.ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ఫాల్గుణశుద్ధ ద్వాదశి వరకు 11 రోజులపాటు బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి ఘనమైన పురాణ ప్రశస్తి ఉంది.



రుష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదర్షి తపోదీక్ష ఫలితంగా నృసింహుడు అర్చనామూర్తిగా యాదగిరిపై వెలశాడంటారు. బాల్యం నుంచి యాదుడువిష్ణుభక్తుడు.ప్రహ్లాదుడినుంచి స్ఫూర్తి పొంది,తానూ నరసింహుణ్ని దర్శించాలని సంకల్పించుకున్నాడు. అందుకోసం అడవి బాట పట్టాడు. కొండజాతివారికి మార్గమధ్యంలో చిక్కాడు. వారి బారి నుంచి రక్షించమని ఆంజనేయుణ్ని, యాదుడు ప్రార్థించాడు. ఆ బాలుడి మొర విని హనుమ అతణ్ని వారి చెర నుంచి విడిపించి, దిశానిర్దేశం చేశాడు. తరులు, జలసిరులు,ఫలపుష్పాదులతోశోభిల్లేఓగిరిపైహనుమ సూచన మేరకు యాదుడు తపస్సుకు ఉపక్రమించాడు. యాదుడి దీర్ఘకాల తపస్సు ఫలించింది. యాదర్షిగా నృసింహస్వామిని దర్శించాడు. యాదర్షి పేరిట ఈ కొండ యాదాద్రిగా ఖ్యాతిగాంచింది.ఎందరో చక్రవర్తులు, రాజులు యాదగిరీశుణ్ని కొలిచి తరించారు. కాకతీయ గణపతి దేవుడు,శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తుల  సౌకర్యంకోసం నిజాం ప్రభువులు కొండపైకి మార్గాన్ని నిర్మించారు.
యోగశాస్త్రరీత్యా పరిశీలిస్తే, మన శరీరంలో నాభిచక్రం జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరి వంటి ప్రదేశం మన శిరసు. ఈ శిరస్సులో సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార కమలంలో నారాయణ పరబ్రహ్మాన్ని నెలకొల్పుకోవడమే యాదగిరిపై నెలకొన్న నృసింహుణ్ని దర్శించడం. శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి భక్తులు దీక్షగా నలభై ఒక్క రోజులపాటు స్వామిని దర్శించి, పూజించి, గర్భాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసే సంప్రదాయం ఈ క్షేత్రంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.