సౌందర్యలహరి- పిండాండము లోని చక్ర సాధన
సౌందర్యలహరి- పిండాండము లోని చక్ర సాధన
(Bhaskarananda Natha గారికి కృతజ్ఞతలు )
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి |
మనోzపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే || 9
ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు.
భాస్కరానంద భావము:-
శ్రీ గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు అమ్మ వారి యొక్క సూక్ష్మ ఆరాధన తెలియజేస్తున్నారు. పిండాండము లోని చక్ర సాధన, అంతర్యాగము ద్వారా అమ్మను ఎలా చేరు కోవాలి, కుండలిని సాధన ఎలా చేయాలి? యోగ సాధన ఎలా చేయాలి? యోగ మార్గములో ఎలా వెళ్ళాలి ? అని షట్చక్ర సాధన, నిరూపణ గురించి చెబుతున్నారు. అమ్మ మన శరీరంలో ఎక్కడెక్కడ ఏయే రూపాలలో నివసిస్తుందో శక్తి ఏ మూలకంగా చైతన్యముగా చలిస్తుందో చెప్పియున్నారు. ఈ శ్లోకము యోగ రహస్య సాధనకు సంబందిచినది. పిండాండమును బ్రహ్మాండమును ఏ విధముగా సమన్వయము చేసుకోవాలో నేర్పినారు ఇచ్చట. ధ్యానము ఎలా చేయాలి? నాద బిందు యోగము మొదలగు సూక్ష్మ మైన విషయములను గుప్తముగా ఇక్కడ చెప్పియున్నారు . కుండలినీ సాధనాపరులకు ఇది అత్యంత శక్తిమంతమైన శ్లోకము. బ్రహ్మాండమునందు ఆవరించి వున్న సమిష్టి రూప కుండలినియే పిండాండమునందు వ్యష్టి రూపములో వున్నది, అదే శ్రీచక్ర రూపములో బాహ్యమున పూజలు అందుకొంటున్నది. శరీరమే ఒక శ్రీచక్రము. బాహ్యమున శ్రీచక్రారాధన చేసేవాళ్ళు, అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే సహస్రారము చేరి శివుని తో ఐక్యం చెందుదురు.
శక్తి శివుడు ఐక్యం కావడమే నాద బిందు కళ అని అందరు. కులపథం అంటే కుల మార్గము, కుండలినీ మార్గము అని. ఈ శ్లోకములో కుండలినీ శక్తి యొక్క గమనమును గురించి గురుదేవుళ్ళు చక్కగా వివరించియున్నారు.
నాద బిందు కళ :-
శరీరము, లేదా షట్చక్రములను నాదము అందురు. బిందువు అంటే శ్రీచక్రములోని మధ్యభాగమున, లేదా అగ్ర బాగమున వున్న బిందువు, లేదా సహస్రారం లోని బిందువు అని. షట్చక్రములను బిందువును అనుసంధానం చేయు ప్రక్రియను నాద బిందు కళ అని అందురు. ఇది యోగ విద్యా రహస్యము. యోగ మార్గము ద్వారా దీనిని సాధన చేయ వలెను. పంచదశీ మహా విద్యతో మూలాధారములోని కుండలినీ శక్తిని ఉత్కీలనము గావించి సుషుమ్న నాడి ద్వారా మూడు గ్రంధులను దాటి సహస్రారములోని బిందువుతో ఐక్యం చెందడం నాద బిందు కళ అందురు. ఈ సమయములో సాధకుడు పంచ పుష్పములతో సాధన చేయ వలెను. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమా గుణములే పంచ పుష్పములు. గురు అనుగ్రహము పూర్తిగా వున్న వారికీ మాత్రమే కుండలినీ చలనం కలుగును. మార్గము తెలియును.
భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితా
శక్తిః కుండలినీ నామ బిసతంతు నిభాzశుభా || ........... (వామకేశ్వర తంత్రం)
మూలాధారాంబుజారూఢా ..... స్వాధిష్టానాంబుజగతా .... మణిపూరాబ్జ నిలయా....అనాహతాబ్జ నిలయా ....విశుద్ధ చక్ర నిలయా....ఆజ్ఞాచక్రాబ్జ నిలయా .....సహస్రదళ పద్మస్థా.......(లలితా సహస్ర నామం)
శ్లో: మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంధి విభేదినీ
మణి పూరాంతరుదితా విష్ణు గ్రంధి విభేదినీ
ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ,
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ
తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా
మహా శక్తి: కుండలినీ బిసతంతు తనీయసీ ...... .......(లలితా సహస్ర నామం)
మూలాధారాంబుజా రూడా పంచవక్త్రాస్థి సంస్థితా,
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా,
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణీ
1.మూలాధార చక్రము :-
మూలాధార కమలము (గుద స్థానము) నాలుగు దళములతో, పృథివీ తత్వము రూపములో సర్వాధారభూతమైన చక్రము నందు కుండలనీ శక్తి రూపములో సర్పాకారములో తోకను నోటితో కరచీ పట్టుకొని నిద్రావస్థలో వుంటుంది. అందుకే ఆమెను కులాంగనా కులాంతస్థా కులయోగినీ ....అని అందురు.
ఈ సాధన వలన యోగులు గాలి లోకి లేవడం జరుగుతుంది. తీవ్ర వత్తిడితో సాధన చేయడం వలన గుద స్థానంలో అమిత మైన వేడి జనించును. అందుకని పెసరపప్పుతో చేసిన అన్నము పులగమును ఎక్కువగా తీసుకోనినచొ ఒళ్ళు చలువ చేయును. సాధనాపరులు పులగమును మాత్రమే తీసుకొంటూ సాధన చేయ వలెను.
2. మణిపూర చక్రము:-
మణి పూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా,
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా,
రక్త వర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీత మానసా,
సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణీ
ఇది జల తత్వము. నాభి స్థానము. పది దళములతో లాకిన్యంబా స్వరూపములో యోగినీ దేవత ఇచ్చట కలదు. మణుల కాంతితో వెదజల్లుతూ వుంటుంది కనుక దీనికి మణిపూరక చక్రము అని పేరు. గర్బసంచి వుండే స్థానము, చల్లని ప్రదేశము కావున కాస్త వేడి చేయడానికి బెల్లం తినాలి. ఈ సాధన చేసే వాళ్ళు విధిగా బెల్లం అన్నం తినాలి. దీనిని జయించిన వాళ్ళు నీటిపై తేలుట, నడుచుట శక్తులు కలిగి వుండుదురు.
పద్మము ఎప్పుడు నీటిలో ఉండును. బిసతంతు తనీయసి ....వెన్నెముక వెనుక భాగమున సుషుమ్నా నాడి తామర తూడు లాగ వుండి, దాని కొస నీటి అడుగు బాగాన జలతత్వం అయిన మణి పూర చక్రము దాటి మూలాధారము వరకు విస్తరించి వుంటుంది. కమలము యొక్క తల సహస్రారము లోను, తోక మూలాధారము లోను వుంటుంది. ఈ కమలమును పూర్ణగిరి పీఠము అని అందురు.
3. స్వాధిష్టాన చక్రము:-
స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా,
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాzతి గర్వితా,
మేదోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా,
ధధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపదారిణీ
స్వాధిష్టాన కమలము ఆరు దళములతో కాకినీ అను యోగినీ దేవత లింగ స్థానమున మేధస్సు రూపములో మధువు నందు ప్రీతీ కలిగి ఉండును. అగ్నితత్వము. పీత వర్ణము కలిగి వుంటుంది.. ఈ సాధన చేసే వాళ్ళు పెరుగు అన్నమును తినవలెను. ఈ కమలమును కామగిరి పీఠము అని అందురు.
4. అనాహత చక్రము:-
అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా,
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా,
కాళ రాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా,
మహావీరేంద్ర వరదారాకిన్యాంబా స్వరూపిణీ
అనాహత కమలము, 12 దళములు, హృదయ స్థానము, వాయుతత్వము. ఈ కమలమును జాలంధర పీఠము అని అందురు. ఈ సాధన చేసే వాళ్ళు నేతితో వండిన అన్నమును తినవలెను. రక్తము అనే ధాతువు నందు రాకిని అను యోగినీ దేవత శ్యామ వర్ణముతో ఉండును.
5. విశుద్ధ చక్రము:-
విశుద్ధ చక్ర నిలయాzzరక్తవర్ణా త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా
పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి
అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ
విశుద్ది కమలము 16 దళములతో, శ్వేత వర్ణముతో కంఠస్థానమున, ఆకాశ తత్వముతో కూడి, పాయసాన్నము నందు ప్రీతి కలిగి, చర్మము అనే ధాతువు నందు డాకిని అను యోగినీ దేవత రక్త వర్ణముతో కలదు.
6. ఆజ్ఞా చక్రము :-
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా,
మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా హాకినీరూప ధారిణీ
ఆజ్ఞా కమలము 2 దళములతో, భ్రూమధ్య స్థానమున, మనస్త త్త్వాత్మకము తో కూడి హరిద్రాన్నం నందు ఆసక్తి కలిగి తెల్లని రంగుతో హాకీని అను దేవత ఇచ్చట కలదు. ఈ దేవత ఎముకలలోని మజ్జ యందు వుండి అన్ని చక్రములకు సర్వ శక్తులు ఇచ్చు చుండును. ఈ కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు.
7. సహస్రార చక్రము :-
సహస్ర దళ పద్మస్థా సర్వ వర్ణోప శోభితా
సర్వాయుధ ధరా శుక్ల సంస్థితా సర్వతో ముఖీ,
సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ
సహస్రార కమలము , 1000 దళములతో శిరో మధ్య భాగమున బ్రహ్మ రంద్రము దగ్గర సహస్ర దళ కమలము గలదు. సకల వర్ణముల చేత ప్రకాశించుచూ సకల ఆయుధములు ధరించి సకల పదార్దముల యందు ఆశక్తి కలిగి శుక్ల ధాతువు, వీర్యము నందు జీవ రూపములో యాకిని అను యోగినీ దేవత కలదు.
ఈ ఆరు చక్రములలో మూలాధార, స్వాధిష్టానములను ప్రధమ ఖండము, వాగ్భవ కూటము అని,
మణిపూర, అనాహతా చక్రములను ద్వితీయ ఖండము, కామరాజ ఖండము అని,
విశుద్ది, ఆజ్ఞా చక్రములను తృతీయ ఖండము, శక్తి ఖండము అని మూడు భాగములుగా విభజించిరి.
ప్రధమ ఖండము పై భాగమున బ్రహ్మ గ్రంధి, ద్వీతీయ ఖండము పై భాగమున విష్ణు గ్రంధి, తృతీయ ఖండము పై భాగమున రుద్ర గ్రంధి కలవు.
బ్రహ్మ గ్రంధిని అగ్ని మండలము, సృష్టి స్థానము అని,
విష్ణు గ్రంధిని సూర్య మండలము, స్థితి స్థానము అని,
రుద్ర గ్రంధిని చంద్ర మండలము, లయ స్థానము అని అందురు.
సర్వ వేద మయీ దేవి సర్వ మంత్ర స్వరూపిణీ
షన్మాసాభ్యాస యోగేన చైతన్యా కుండలీ భవేత్ ...............రుద్రయామళ తంత్రము:-
ఆరు నెలల అభ్యాసముచే కుండలినీ శక్తి జాగృతమగును. గురు సేవా పరాయణుడు, శుద్ధ సత్వ గుణ సంపన్నుడు, భక్తీ అష్టాంగ యోగ ప్రవర్తకుడు అయిన సాధకుడు కుండలినీ శక్తి యొక్క అనుగ్రహమును పొందును. సంవత్సరమునకు ఒక్కొక్క శక్తి పీఠము నందు నివసించుచూ కుండలినీ సాధన చేయ వలెను.
బ్రహ్మచర్యముతో, మౌన వ్రతముతో, నిర్మలమైన మనస్సుతో యోగుల సాంగత్యముతో ఈ సిద్ధి కలుగును. మూలాధారము నందు మనస్సును లగ్నము చేసి ఉదరము నందు వాయువును పూరించి శ్రీవిద్యా మంత్రములతో రేచక పూరక కుంభకములు చేసిన ప్రాణాయామము సిద్దించును. ఎడతెరగని ప్రాణాయామ సాధన వలన కుండలినీ శక్తి ఉద్ధీపనము అగును. బ్రహ్మచర్యముతో శక్తిని (వీర్యమును) ఊర్ధ్వముఖము గావించి సహస్రారములోని శివునితో సంగమించి స్పందించడమే స్కలించడమే ... శివేన సహా మోదతే.
గూడార్ధము:-
జీవుడు కుండలినీ (శక్తి) రూపములో సుషుమ్న నాడి ద్వారా షట్చక్రములను దాటి, సిద్దులను కాదని, గ్రంధి త్రయమును దాటి (కాదని), మనస్సును జయించి సహస్రారములోని పరమాత్ముడు అయిన శివున్ని కలసి క్రీడించడమే ..... శివేన సహా మోదతే .....జీవుడు పరమాత్మతో ఐక్యం కావడమే మోక్షం సాధన. ఇది సాధకుని యొక్క లక్ష్యం.
ఆ పరమ శివునికి నమస్కరిస్తూ ........
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)
కామెంట్‌లు