స్వామి వివేకానంద
స్వామి వివేకానంద.. హిందూతత్వ, భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖ వ్యక్తి.. వేదాంత, యోగ తత్వశాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగిన ఒక ఆధ్యాత్మిక నాయకుడు.. ఇలా ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే! కేవలం దేశాన్ని జాగృతం చేయడమే కాకుండా.. అమెరికా, ఇంగ్లాండు లాంటి అగ్రరాజ్యాల్లో యోగ-వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాస, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి ఆయనకు మాత్రమే కలదు. ముఖ్యంగా హిందూమత ప్రాశస్త్యం కోసం న్నో ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాశ్చాత్యదేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే!
జీవిత చరిత్ర :
1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో స్వామి వివేకానంద జన్మించారు. చిన్నప్పుడే ఎంతో ఉల్లాసంగా, చిలిపిగా వుండే ఈయన.. సన్యాసుల పట్ల ఎంతో ప్రేమను కనబరిచేవాడు. అంతేకాదు.. బాల్యం నుంచే ఈయనకి నిస్వార్థ గుణం, ఔషధగుణాలు అలవడ్డాయి.
ఇక వ్యక్తిగత వ్యవహారాల విషయానొకిస్తే.. ఆటలోనూ, చదువులోనూ ముందుండేవాడు. అతని జ్ఞాపకశక్తి ఎంతో అమోఘమైందంటే.. ఒకసారి చదివితే చాలు, మొత్తం గుర్తుంచుకునేవాడు. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై కళాశాలలో చేరారు. ఈ నేపథ్యంలోనే దైవం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో వుండేవాడు. చదువులో ముందుకెళ్తున్న కొద్దీ ఆయన మదిలో అనుమానాలు, సందేహాలు ఎక్కువగా కాసాగాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. దాని అన్వేషణ కోసం బయలుదేరిన ఆయన.. రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడుతుంది.
రామకృష్ణ పరమహంసతో పరిచయం : రామకృష్ణ పరమహంస భగవంతుడిని కనుగొన్నాడని జనాలు చెప్పుకుంటుండగా.. అదివిన్న నరేంద్రుడు తన మిత్రులతో కలిసి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. అప్పుడు పరమహంస భగవంతుని సంభాషణల్లో మునిగివుండగా.. ఆ సభలో నరేంద్రుడు తన మిత్రులతో కలిసి కూర్చుని ఆలకించాడు. అప్పుడు అనుకోకుండా పరమహంస దృష్టి నరేంద్రుడి మీద పడగా.. అతని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి.
‘నువ్వు పాడగలవా?’ అని ఆయన ప్రశ్నిస్తే.. అందుకు నరేంద్రుడు తన మధురకంఠంతో బెంగాలీ పాట పాడి వినిపించాడు. ఆ పాట వినగానే పరమహంస ఆధ్యాత్మత (ట్రాన్స్)లోకి వెళ్లిపోయారు. కొద్దిసేపు తర్వాత ఆయన నరేంద్రుడిని తన గదిలోకి తీసుకెళ్లి.. ‘ఇన్నిరోజులుగా నీ కోసం ఎదురు చూసి చూసి అలసిపోతున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తూ భువికి దిగివచ్చిన దైవస్వరుపడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా..?’ అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు.
ఇలా ఆయన మాటలు ముగించిన తర్వాత నరేంద్రుడు.. ‘మీరు భగవంతుని చూశారా?’ అని పరమహంసను ప్రశ్నించాడు. అందుకు ఆయన.. ‘అవును చూశాను. నేను నిన్ను చూసినట్లుగానే ఆయనతోనూ మాట్లాడాను కూడా. అవసరమైతే నీకూ చూపించగలను. కానీ.. ఇప్పుడు భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు’ అని ప్రశ్నించారు. అప్పుడు నరేంద్రుడు తన మదిలో.. ‘ఇప్పటివరకు ఎవరూ భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఈయన చూశానని అంటున్నాడు. మతి తప్పి ఇలా మాట్లాడుతున్నాడు’ అని అనుకుని వెళ్లిపోయాడు.
ఇలా ఒక నెలరోజులు గడిచిన తర్వాత.. నరేంద్రుడు మళ్లీ ఒక్కడే దక్షిణేశ్వర్’కు వెళ్లాడు. అప్పుడు పరమహంస మంచం మీద విశ్రాంతి తీసుకుంటుండగా.. నరేంద్రుని చూసి ఎంతో సంతోషించారు. అప్పుడు ఆయన ధ్యానంలోకి వెళ్లి తన కాలును నరేంద్రుడి ఒడిలో వుంచారు. అంతే! మరుక్షణం నుంచి నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. ‘నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి’ అని అరిచాడు. అప్పుడు రామకృష్ణ చిరునవ్వు నవ్వుతూ ‘ఈరోజుకిది చాలు’ అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు.
రోజులు గడిచేకొద్దీ ఒకర్నొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు వుండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణకి ఎంతో సమయం పట్టలేదు. కానీ.. నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. రానురాను రోజుల్లో నరేంద్రుడు, పరమహంసకు ప్రియతమ శిష్యుడిగా మారిపోయాడు.
నెమ్మదిగా నరేంద్రుడు సన్యాసంవైపు మొగ్గుచూపడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన అంటే 1884లో బీఏ పరీక్షలో పాసయ్యాడు. అప్పుడు స్నేహితుడు పార్టీ ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో పిడుగులాంటి వార్త నరేంద్రుడిని కలచివేసింది. ఆయన తండ్రి మరణించాడని తెలిసింది. అప్పుడు అప్పులిచ్చినవాళ్లు వేధించడం మొదలుపెట్టారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగినా.. ఫలితం లేదు. బట్టలు మాసిపోయి రోజుకొకపూట భోజనం దొరకడమే గగనమైపోతుండేది. కొన్నిసార్లు ఆకలితో కళ్లు తిరిగి వీధిలో పడిపోయేవాడు. అయితే.. ఇంత దురదృష్టం వెంటాడుతున్నా భగవంతుని నమ్మకాన్ని కోల్పోలేదు.
కొద్దిరోజుల తర్వాత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. దీంతో కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరికేది. కాలక్రమంలో గురువు పరమహంస ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు నరేంద్రుడు చదువు, ఉద్యోగం మానేసి.. గురుసేవలో మునిగిపోయాడు. ఇక చావు సమీపిస్తున్న చివరిరోజుల్లో నరేంద్రుడిని మృదువుగా తాకి, తన శక్తులన్నీ ధారపోశాడు. అనంతరం ఇలా.. ‘‘ఇప్పుడు నీవు శక్తిమంతుడివి. వీళ్లంతా నీ బిడ్డలవంటివాళ్లు. వీరిని చూసుకోవడం నీ బాధ్యత’ అని అన్నాడు. అప్పుడు నరేంద్రుడు బాధతో చిన్నపిల్లాడిలా ఏడ్వడం మొదలెట్టాడు.
రామకృష్ణ చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి బరనగూర్‌లోమి గంగానది ఒడ్డున ఆయన సమాధికి చాలా దగ్గరగా వుండే ఒక అద్దె ఇంట్లో వుండేవాళ్లు. అక్కడే రామకృష్న మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులు ప్రజలకు సేవ చేయడం , ముక్తిని సాధించడం లక్ష్యాలతో వుండేవాళ్లు. ఇక నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు.
అలా నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. అప్పుడు అతని దేశం గృహం అయ్యింది.. ప్రజలు సోదర, సోదరీమణులయ్యారు. కాషాయం వస్త్రంలోనే దేశమంతా పర్యటించాడు.. ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు.. కటిక నేలమీదే నిద్రించేవాడు. ఆధ్యాత్మిక, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు.
కామెంట్‌లు