వేములవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
వేములవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మొదట్లో లేములవాడ, లేంబాల వాటిక అనే పేర్లతోనూ పిలిచేవారని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాజన్న అని నోరారా పిలుచుకునే ఈ రాజరాజేశ్వరస్వామి.. ఎంతో మహిమగల దేవుడని భక్తుల విశ్వాసం.
క్షేత్రచరిత్ర/స్థలపురాణం: మాళవ ప్రభువైన రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడను చాళుక్యులు రాజధానిగా చేసుకొని పాలించినట్లు చరిత్రలో ఉంది. చాళుక్య రాజులలో మొదటి రాజు వినయాదిత్య యుద్ధమల్లుడు, అతని కుమారుడు అరికేసరి, ఆ తర్వాత రెండో యుద్ధమల్లుడు వేములవాడ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. చాళుక్య రాజుల్లో చివరివాడు.. భద్రదేవుడి కుమారుడైన మూడో అరికేసరి అని దేవస్థానంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.
ఆలయ ప్రత్యేకత: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రధాన పూజలైన కల్యాణం, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజ, ఆకుల పూజ, పల్లకిసేవల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల్లో చాలామంది స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) స్వామికి మొక్కుగా చెల్లించి.. ఆపై దాన్ని స్వామి ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రతినెలా జాతర కు 7లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారని అంచనా.
కామెంట్‌లు