నిస్వార్ధ ప్రేమకు ప్రతీక
మాతృపూజ ఒక విశిష్టమైన తత్త్వం. మనకు కలిగే భావాల్లో మొట్టమొదటి భావం ’శక్తి’ని గురించినది. అంతఃశక్తి ఆత్మ, బాహ్యశక్తి ప్రకృతి - ఈ రెండిటి మధ్య జరిగే యుద్ధమే మానవ జీవనం. మనకు తెలియనివీ, మనం అనుభవించేవీ..సర్వమూ ఈ రెండు శక్తుల ఫలమే. సూర్యుడు అల్పమైనవాటిమీదా, ఉన్నతమైన వాటిమీదా కూడా సరిసమానంగా ప్రకాశిస్తున్నాట్లే, భగవంతుని ప్రేమ నిష్పక్షపాతురాలైన తల్లిలాంటిదనే భావం ఉదయించింది.
భారతీయ సంస్కృతిలో మాతృభావానికే ప్రాముఖ్యం ఇచ్చారు. తల్లి అన్ని అవస్థల్లోనూ బిడ్డకు అండగా ఉంటుంది. ఒక వ్యక్తిని భార్యాపుత్రులు విడువవచ్చేమో గానీ తల్లి ఎన్నడూ విడువదు. ఎందుకంటే ఆమె ప్రేమ సడలదు, కొరవడదు, తన శిశువులోని చెడును లక్ష్యపెట్టదు, పైగా మరింతగా అతణ్ణి ప్రేమిస్తుంది. తల్లి విశ్వంయొక్క నిష్పక్షపాత శక్తి. నేడు హైందవులలోని అగ్రవర్ణాలలో కానవచ్చే పూజ మాతృపూజే. ఈ ఆదర్శం ఇంకా ప్రాచుర్యాన్ని సంతరించుకోలేదు.
ప్రపంచమంతా ఒకే తల్లి లీల. కానీ దీన్ని మనం విస్మరిస్తున్నాం. మనం స్వార్థం వీడినప్పుడు, సంతోషం కలుగుతుంది. ఈ తత్త్వాన్ని ప్రతిపాధించిన తాత్త్వికుడు, కంటికి కనిపించే ప్రతి విషయం వెనుకా ఒకే శక్తి ఉందనే భావాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. భగవంతుణ్ణి గురించిన భావనలో మానవకల్పితమైన హద్దు మూర్తిమత్త్వం ఉంది.
తల్లిలోని నిరపేక్షమైన శాశ్వత ఆత్మార్పణమే మనకు శాంతిని ఇవ్వగలదు. నిర్భయంగా, నిర్వ్యాజంగా ఆమెను ఆమే కోసమే ప్రేమించు. నువ్వామె బిడ్డవు కాబట్టి ఆమెను ప్రేమించు. మంచీ చెడూ అన్నిటా ఆమెను సమానంగా చూడు. ఇలా ఆమెను తెలుసుకొన్నప్పుడే, కేవలం అప్పుడే శాశ్వతానందం కలుగుతుంది. అప్పటివరకూ దుఃఖం మనల్ని వెన్నాడుతుంది. తల్లివద్ద విశ్రాంతి తీసుకుంటేనే మనం సురక్షితంగా ఉంటాం కాబట్టి నిస్వార్థ ప్రేమకు ప్రతీక అయిన మాతృమూర్తిని ఆరాధించాలి.
కామెంట్లు