విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజ

🌿విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజ🌿 

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .



'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .

"శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు . అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు అందుకే  జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి .

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.

యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

ఈ పూజ అనంతంరం  వేచివుంటారు.  వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.




🐦శుభాల పాలపిట్ట🐦
పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. దశమి రోజున ఈ పిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్లు అడవికి పోయి పాలపిట్టను చూడటం సంప్రదాయంగా మారింది.

Soruce: FB post

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.