శివార్చన ఎలా చేయాలి?
🌼🌿శివుడు ఆది దేవుడు. పరమేశ్వరుడు. శివ మహిమలు మాటలకూ, మనసుకూ అందరానివి. ‘శివం కల్యాణం తద్యోగాద్ శివః’ అని శాస్త్రం. ఆయన శుభాలు కలుగజేసేవాడు. సర్వవ్యాపి. చిదానంద స్వరూపుడు. శివాలయాల్లోని గర్భగుడిలో శివుణ్ణి మూలమూర్తిగా ఆరాధించరు. ఉత్సవమూర్తిగా అర్చిస్తారు. లింగ స్వరూపానికి వేద మంత్రపూరితంగా అభిషేకాలు, అర్చనలు జరుపుతారు. నైవేద్యాలు అర్పిస్తారు. విశాల విశ్వంలో పరమశివుని చిహ్నంగా శివలింగం ఆదరణ పొందుతోంది. ‘శివుడు’ అంటే శుభప్రదుడు. ‘లింగం’ అంటే సంకేతం లేదా ప్రతీక అని అర్థం. ‘లీనయతీతి లింగః’ అని శాస్త్ర వచనం. సర్వం లీనమయ్యేది అందులోనే! లింగంలో మూడు భాగాలు ఉంటాయి. అట్టడుగు భాగం సృష్టికర్త బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి దాన్ని ‘బ్రహ్మ భాగం’ అంటారు. మధ్య భాగం స్థితి కారకుడైన విష్ణువును సూచిస్తుంది. ఈ రెండు భాగాలూ పానవట్టంలో పొదిగినట్టు అమర్చి ఉంటాయి. లింగ పీఠానికి అంటే పానవట్టానికి వెలుపల... ముందుకు వచ్చిన స్తంభాకార భాగమే పూజలు అందుకొనే ‘రుద్ర భాగం’. ఇదే పూజాభాగంగా ప్రసిద్ధి చెందింది.
🌼🌿శివార్చన ఎలా చేయాలి?
శివ పంచాక్షరి పఠిస్తూ, లింగాష్టకాన్ని స్మరిస్తూ శివుణ్ణి ఆరాధించాలి. ‘అభిషేక ప్రియ శ్శివః’ అంటారు. కాబట్టి వేద మంత్రాలు పఠిస్తూ, పంచామృతాలను పూలతో శివలింగంపై చిలకరించాలి. అభిషేకం తరువాత గంధం, నైవేద్యం, ధూపం, దీపం, తాంబూలం సమర్పించాలి. వరి అన్నం నివేదించాలి. శివారాధనలో భస్మం, రుద్రాక్ష, మారేడు (బిల్వ) దళాలు ఉండాలి. మారేడు వృక్షం చుట్టూ దీపాలు వెలిగిస్తే శివజ్ఞానం సిద్ధిస్తుంది బిల్వ వృక్షం శివ స్వరూపం. భస్మం ఐశ్వర్యప్రదాయకం.
బిల్వార్చన సాగించాలి. ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివ పంచాక్షరి జపిస్తూ ఉండాలి.
శివుడు పంచాననమూర్తి. ఆయన ‘ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు’ అనే నామాలతో, రూపాలతో ప్రసిద్ధుడు. శివుడు ప్రదోషవేళలో నటరాజుగా తాండవం చేస్తాడు. హిమాలయాల్లో దక్షిణాభిముఖంగా ఋషులకు జగద్గురువై ఉపదేశామృతం అందిస్తాడు. అందుకే ఆయన ‘దక్షిణామూర్తి’ అయ్యాడు.
🌼🌿నంది అనుమతి తీసుకోవాలి!
శివాలయాలలో గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఆలయ ప్రవేశ వేళ నంది అనుమతిని భక్తులు కోరాలని పెద్దలు చెబుతారు.
నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం
మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞా దాతుమర్హసి- అని ఆయనను శరణు వేడాలి, ప్రార్థించాలి. నందితో పాటు భృంగి, వీరభధ్రుడు, చండీశ్వరుడు అనే లఘుదేవతలు కూడా శివ పరివారంలో ఉంటారు. శివుడి అనుచరుల్లో ప్రమధ గణాలు ఉంటాయి. ఈశ్వరుడు భవుడు. లోకంలోని జ్ఞాతుల తత్త్వం బాగా ఎరిగినవాడు.
🌼🌿శివనామం సర్వవశీకరం
...శివ! నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! - అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో మహాకవి ధూర్జటి.
‘శివ’ అనే రెండు అక్షరాల నామం సర్వవశీకరణ మంత్రం. సర్వవశ్యౌషధం. ఆ అక్షరాలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాయి. పాతకాలను హరిస్తాయి. పుణ్యాలను ప్రోగుచేస్తాయి.
కామెంట్‌లు