ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు - కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను. రహస్య సూక్తులు - * రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను. * ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను. * మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను. * నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను * వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను * పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను . * భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును. * గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. * శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. * ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను . * రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం . * అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును. * కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును . * అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును. * ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. * విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు. * పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. * మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి . * ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును . * రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం . * అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం . * వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది . * నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది. * పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి . * ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం . * దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం . * ఫలములలో ద్రాక్ష శ్రేష్టం . * ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం . * చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం * మినుములు అతిగా వాడరాదు. * వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. * చవిటి ఉప్పు మంచిది కాదు. * గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు. * పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు. * దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు. * మలమూత్ర వేగములను ఆపరాదు . * ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును. * హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది . * స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది . * విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును. * గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి . * ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును . * నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును * నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును . * తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును . * కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు. * ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. . * ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును . * మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును . * అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం . * నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు . * పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు . * స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు. * ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును . * బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును . * నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును. * గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను . * మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు . * పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు . * సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు . * రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు. * మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు . * స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు . * బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు . * నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు . * భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు. * మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు . * అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు . * ముక్కుతో శబ్దం చేయకూడదు . * పళ్ళు కొరకకూడదు . పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.