కంచిపురంలోని కామాక్షి దేవాలయానికి దగ్గరగానే దశావతారాల్లో ఒకటైన వామన మూర్తికి సంబంధించిన దేవాలయం ఉంది

దేశంలో ఏకైక 30 అడుగుల విగ్రహం ఉన్న వామనాలయం..
తమిళనాడు పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. దేశంలో ఎక్కడా లేనటు వంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్లే తమిళనాడును టెంపుల్ స్టేట్ అని కూడా అంటారు. ముఖ్యంగా కంచి లేదా కంచి పురం లో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కామాక్షి దేవాలయం ఉంది. ఈ కంచిపురంలోని కామాక్షి దేవాలయానికి దగ్గరగానే దశావతారాల్లో ఒకటైన వామన మూర్తికి సంబంధించిన దేవాలయం ఉంది. దేశంలో అతి తక్కువ ప్రదేశాల్లో మాత్రమే వామన దేవాలయాలు ఉన్నాయి. ఇక కంచిపురంలో ఉన్నటు వంటి వామనాలయానికి ప్రత్యేకత ఉంది. సాధారణంగా వామనుడు మరుగుజ్జుగా ఉంటాడు. అయితే ఇక్కడ వామనుడు 30 అడుగుల ఎత్తుగా ఉండటం విశేషం. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే నరకలోక ప్రాప్తి తప్పుతుందని చెబుతారు. ఈ కథనంలో ఈ దేవాలయంతో పాటు ఇదే కంచిలో బంగారు బల్లి ఉన్న దేవాలయం గురించి కూడా తెలుసుకుందాం.

 1. తిరుఊరగం
తిరుఊరగం అనే పేరుతో కూడా పిలువబడే ఉలగళంద పెరుమాళ్ కోవెల విష్ణుమూర్తి అవతారమయిన వామనమూర్తి ఆలయం. ఇది కాంచీపురంలో రైల్వే స్టేషను నుండి కామాక్షి అమ్మవారి కోవెలకు వెళ్ళే దారిలో ఉంది. ఈ దేవాలయంలో 108 వైష్ణవ దివ్యతిరుపతులలో ఇది ఒకటి.

2. ఆళ్లార్లు : 
7-10వ శతాబ్దాలకు సంబంధించిన ఆళ్లార్లు అనే వైష్ణవ భక్తులు ఈ గుడికి సంబంధించిన విషయాలు తెలుపుతూ కీర్తించారు. వామన మూర్తి ఇతర దేవాలయాల్లో చిన్ని-పొట్టి వటువుగా పూజిస్తే, ఈ దేవాలయంలో త్రివిక్రముడిగా 30 అడుగుల విగ్రహాన్ని పూజిస్తారు


3. పురాణాల ప్రకారం:
 పురాణాల ప్రకారం రాక్షసుల రాజు, ప్రహ్లాదుని మనవడు అయిన మహాబలిచక్రవర్తి తన మంచి తనము మరియు దాతృత్వం వలన ప్రసిద్ధుడై కీర్తిలో దేవరాజు ఇంద్రుణ్ణి మించిపోయాడు. అలా వచ్చిన గర్వాన్ని హరించేందుకు విష్ణువు వామనుడై అవతరించాడు. మరుగుజ్జు అయిన వటువు రూపంలో మహాబలిని చేరుకొని మూడడుగుల నేలను దానమివ్వమని కోరాడు.

4. శుక్రుడు వారించినా :
 రాక్షస గురువు శుక్రుడు వారించినప్పటికీ ఈ దానానికి బలి చక్రవర్తి ఒప్పుకుంటాడు. కానీ దానం పుచ్చుకునేప్పటికి వామనుడు తన ఆకారాన్ని పెంచుకుంటూ ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడు. ఒక్క అడుగులో భూమిని, మరొక అడుగులో ఆకాశాన్ని (ముల్లోకాలనూ) కొలిచి, మూడవ అడుగు కోసం తిరిగి బలిచక్రవర్తిని అడుగుతాడు.

5. అక్కడ మూడవ అడుగు :
 బలిచక్రవర్తి నిస్సహాయుడై తన తలను వంచి అక్కడ మూడవ అడుగును కొలవమంటాడు. వామన మూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేస్తాడు. మాటను నిలబెట్టుకుని దానమిచ్చినందుకు వామనుడు పాతాళాన్ని ఏలుకోమని ఇంకా మరెన్నో వరాలు బలిచక్రవర్తికి ప్రసాదిస్తాడు.

6. తపస్సు చేస్తాడు :
 కానీ బలి చక్రవర్తి విష్ణుని పునర్దర్శనం కోసం తపస్సు చేస్తాడు. విష్ణువు ఆదిశేషునిగా దర్శనమిస్తాడు, ఆ సన్నిధి ఈ కోవెలలోనే గర్భగృహానికి ఎడమ వైపుకి ఉంది. దీనినే తిరుఊరగం అంటారు.

7. 60 వేల చదరపు అడుగులు :
 ఈ గుడి 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవ్యంగా ఉంటుంది. మూడంతస్తుల రాజగోపురం మనోహరంగా ఉంటుంది. ఈ ఒక్క క్షేత్రంలోనే ఐదు దివ్య తిరుపతులు ఉన్నాయి. అవి తిరుక్కర్వాణం, తిరుకారగం, తిరుఊరగం, తిరునీరగం.

8. అముద వల్లి కూడా : 
తిరుమంగై ఆళ్వారు మరియు తిరుమళశై ఆళ్వా రు రచించిన పాశురాలలో ఈ గుడి కీర్తించబడింది. ఈ స్వామి దేవేరి అమృతవల్లి అమ్మవారు (స్థానికులు అముదవల్లి అని పిలుస్తారు). ఉత్సవమూర్తి పేరు శ్రీలోకనాథుడు. ధ్రువబేరము పేరు త్రివిక్రముడు లేదా ఉలగళంద పెరుమాళ్ళు.

9. 30 అడుగుల ఎత్తు : 
విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉండి పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ధ్రువబేరము ఎడమ కాలు విగ్రహశరీరానికి సమకోణంలో ఉంటుంది. కుది పాదం వామనుడి శిరస్సుపై ఉంటుంది. ఎడమ చేతిలో రెండు వేళ్ళు తెరిచిపెట్టి ముల్లోకాలను రెండడుగుల్లో కొలిచిన సంజ్ఞగానూ, కుడి చేత ఒకవేలు తెరిచి మూడవ అడుగు ఎక్కడ ఉంచాలి అని అడుగుతున్న సంజ్ఞగానూ కనిపిస్తాయి.

10. మరెక్కడా లేదు: 
ఇంత పెద్ద విగ్రహం మరెక్కడా ఏ దివ్య క్షేత్రంలోనూ ఉండదు, అదే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత. ధ్రువబేరమును చూడాలంటే పూజారి ఒక కర్రకు దీపపు కుందె కట్టి అది ఎత్తి చూపించాల్సి ఉంటుంది.

11. వరద రాజ స్వామి ఆలయం : 
1053 సంవత్సరం చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది.

12. బంగారు వెండి బల్లులు : 
ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి.

13. దీని వెనక ఉన్న కథ ఇది : 
ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు.

14. దేశం నలుమూలల నుంచి : 
తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు.

15. వెయ్యి స్తంభాల మండపం :
 ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని కృత యుగములో బ్రహ్మ, త్రేతా యుగములో గజేంద్రుడు, ద్వాపరయుగములో బృహస్పతి, కలి యుగములో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.