వేయి స్తంభాల గుడి, వరంగల్

వేయి స్తంభాల గుడి, వరంగల్.

వెయ్యి స్తంబాల గుడి ని కాకతీయులలో అప్పటి రాజైన రుద్ర దేవా 1163 లో కట్టించారు.

11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.

ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగినది. ఇటీవల పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది.

మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

ఇంతటి ప్రశస్థి కల ఈ ఆలయానికి దూరప్రాంతాల వారు ఖాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషను చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కి.మీ. దూరంలో నున్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.