సింహాచలం ....... చందనోత్సవం

సింహాచలం ....... చందనోత్సవం

శ్రీ వరాహ నారసింహ స్వామి "ప్రహ్లాద వరదుదు కేవలం ప్రహ్లాదునీ రక్షించి ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడి స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరుపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత.




శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం

వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం ||

అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలములిస్తాయి. ఈ అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలదము.

సింహాచలము ... ప్రహల్లాదుడు

కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. మహా శివ భక్తుడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహల్లాదుడు. ప్రహల్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. రాక్షస రాజులన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు మదబల గర్వితులై ముల్లోకాలను గడ గడ లాడించిన పరమ క్రూరులు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయమున భూదేవిని చెరబట్టి చాప చుట్టునట్లు చుట్టి తీసుకవెల్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహావతారమెత్తి శిక్షించాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని చంపిన శ్రీహరిపై తీవ్ర కక్షవహించి తనను మించిన అజేయుడు ముల్లోకముల్లోను ఉండరాదు, తనకు చావు రాకూడదు, తానూ వృద్ధుడు కారాదు అనే కోరికల సాధనకు హిరణ్యకశిపుడు మంద పర్వతమునకు వెళ్లి అచ్చట ఒంటికాలి బొటన వ్రేలిపై నిలబడి బ్రహ్మను గురించి తీవ్ర తపమాచరించాడు. అతని ఘోరతపస్సుకు ముల్లోకాలు దద్దరిల్లిపోయినాయి. సెగలు పోగలుగా లోకాలన్నిట వ్యాపించి జీవులను వణికించింది దేవతలు ఆలోచించారు. బ్రహ్మ హిరణ్యకశిపుని వద్దకు వచ్చారు.నాయనా హిరణ్యకశిపా లే, నీకే వరం కావాలో కోరుకో... నీ శరీరమంతా పురుగులు తినివస్తున్నాయి, ఎందుకింత కటిన తపస్సు అంటూ లేపాడు. లేచిన హిరణ్యకశిపుడు దేవదేవా, జగత్పితా, వచ్చావా, రా, నాకేం కావాలో అడుగుతాను విను నీవు సృష్టించి జీవరాసులలో దేని వలన నాకు చావు రాకూడదు. రాత్రిగానీ, పగలు కానీ, భూమిపైన గానీ, ఆకసమునగాని, బైటకానీ, ప్రాణమున్న ఆయుధముతోకానీ, ప్రనములేని ఆయుధముతోకాని నాకు చావురాకూడదు. సకల సంపదలూ, సకల గ్రహరాసులు నా ఆధీనములో వుండాలి. నాకెదురు వుండకూడదు. ఇవీ నా కోరికలు అన్నాడు. అది విన్నాడు బ్రహ్మ. సరే ఇచ్చాను పో అన్నాడు. విజయగర్వంతో వెళ్ళాడు రాక్షస రాజు .

హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడితో ఏదైనా ఉపాయం ఆలోచించి అతని తపస్సు భంగం చెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఎంత ప్రయత్నిచిన అతని తపస్సు భంగంకాలేదు. ఇంద్రుడి దివ్య దృష్టితో హిరణ్య కశిపుని భార్య లీలావతి గర్భిణి అని గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అయి కూర్చుంటే, ఇంకా అతనికి కుమారుడు కలిగితే అపుడు ఇద్దరు రాక్షసులు చేరి దేవతలను ఇంకా హింసిస్తారని, అంతేకాక తన సింహాసనానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందనుకొని, మాయా రూపములో లీలావతి దగ్గరకు చేరి ఆమెను చేపెట్టి తనలోకానికి తీసుకొని పోతుండగా, దారిలో నారద మహర్షి కనిపించి ఓయీ ఇంద్రుడా నీవు చేస్తున్న పని ఏమి?, ఈ గర్భిణి స్త్రీ చెరబెట్టి తీసుకుపోతావా?, ఇంతనీచానికి దిగాజారుతావని నేననుకోలేదు. అని గద్దిస్తాడు, అప్పుడు ఇంద్రుడు తాను దురుద్దేశ్యంతో అలా చెయ్యడం లేదని దేవతల సంక్షేమానికి చెయ్యాల్సి వస్తుందని తెలిపాడు. అప్పుడు నారద మహర్షి అసలు విషయం తెలుపుతాడు, ఆమె గర్భలో ఉన్నది రాక్షసుడు కాదు ఒక గొప్ప హరి భక్తుడు, నీవు చింతించకు, ఆమెను నేను ఆశ్రమానికి తీసుకొని వెళతాను అని తన వెంట ఆమెను తీసుకొని వెళతాడు. ఆ తరువాత లీలావతి కుమారున్ని కనడం, హిరణ్యకశిపుడు రావడం జరిగిపోయినది.బాలుడు ప్రహల్లాదుడు అను పేర దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న కాలంలో హిరణ్యకశిపునికి సరిగ్గా ఆ సమయములోనే ప్రహల్లాదుని పరిస్థితి అర్ధం అయ్యింది. సరిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ పనిచెయ్యలేదు. ఇక లాభంలేదనుకొని దండన ప్రారంభించాడు కొట్టించాడు. తిట్టించాడు, ఎన్నో చేసి విసిగి హరిభక్తి మానని కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని అతని పైకి వేయించాడు. శ్రీహరి వచ్చి తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు.

ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలము హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహల్లాదుని కోరికమేరకు పిన తండ్రిని చంపిన వరహామూర్తి, తండ్రిని చంపిన నరసింహ అవతారం హిరణ్యకశిపుని వధించాక లక్ష్మీదేవితో కలిసి నేను ప్రహల్లాడునితో పూజలందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటాను అన్నాడు స్వామి.

స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు, ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తీసివేయగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, చందన లేపనం తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. ప్రసాదంగా స్వామీ నుంచీ తీసిన గంధం, అనగా చందనం ప్రసాదం ముఖాన పెట్టుకొని కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని నమ్మకం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.