కర్ణాటకలోని ఏడు ముక్తి క్షేత్రాలు
*కర్ణాటకలోని ఏడు ముక్తి క్షేత్రాలు*
🙏 భారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. దర్శన, స్మరణ,పఠన, శ్రవణ మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని భగవత్ సన్నిధిని చేర్చే అవి అయోధ్య, మథుర, మాయ ( హరిద్వార్), కాశి, కంచి, అవంతిక ( ఉజ్జయిని), మరియు పూరి. వాటితో సరిసమానమైన స్థలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్నాయి.
అవి ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యం, కుంబాసి, కోటేశ్వర, శంకర నారాయణ, కొల్లూర్ మరియు గోకర్ణం.
స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.
*ఉడిపి*:
శ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు. దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై, శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి దై్వత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.
పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.
*కుక్కే సుబ్రహ్మణ్యం దేవస్థానం*
ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160 కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉన్నది. ఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది.
లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది. స్కన్దునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార.కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది. దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది.
గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు కి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.
*శంకర నారాయణ ఆలయం*
కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాధ గురించిన విశేషాలు అందుబాటులో లేవు. కానీ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.
సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణు లింగ పై భాగాన కామ ధేనువు గిట్టల ముద్రలుంటాయి. మరో విశేషము ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.
*కోటేశ్వర*
ఉడిపికి సుమారు ముపై్ప కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి.
ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును. ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి.
ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం ( ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతివక్కటి విశేషమే !
*అనెగూడ( కుంభాషి )*
సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగూడ లేక కుంభాషి. ఉడిపికి ముపై్ప కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.
గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల). పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.
తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట.
దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట.
కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది. యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.
యాగారంభములో పాండƒ వులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అనుకొంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగ నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు.
దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.
*కొల్లూర్ శ్రీ మూకాంబిక దేవి* :
కోలా మహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదా శివుడు ప్రత్యక్షం కాగ మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట. అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.
తదనంతర కాలంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడ శ్రీ చక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట. దేవి నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.
*శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువుతీరిన గోకర్ణం* :
ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం. రామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే !
పరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగారానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ ! 🙏
కామెంట్‌లు