కొత్తకోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ?


కొత్తకోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ? వ్రతాలలో సత్యనారాయణస్వామి వ్రతానికి ఎంతో విశిష్టత వుంది. అనేక కష్టాల నుంచి ... నష్టాల నుంచి ... బాధల నుంచి బయటపడేసే శక్తి ఈ వ్రతానికి వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, జీవితమనే సముద్రంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్లని క్షేమంగా తీరానికి చేర్చే నావలా సత్యనారాయణస్వామి వ్రత ఫలితం పనిచేస్తుంది. సాధారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో ఎక్కువగా జరుపుకుంటూ వుంటారు. ఇక తొలిసారిగా కొత్తకోడలు తమ ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా, అత్తగారింటి వాళ్లు నూతన దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతం చేయించడం ఆచారంగా వస్తోంది. ఎక్కడో కొంతమంది తప్ప చాలామంది ఈ ఆచారాన్ని పాటిస్తూ వుంటారు. సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషంగా భావిస్తుంటారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి ఈ భూమిపై ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తిని కలిగిన ఈ స్వామి మహిమాన్వితుడని భక్తులు భావిస్తుంటారు. ఈ స్వామిని పూజించడం వలన త్రిమూర్తులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తుంటారు. పెళ్లితో ఒక్కటైన నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. వాళ్ల జీవన ప్రయాణం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగేలా ఆశీస్సులు అందజేయమని, త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ ఈ వ్రతాన్నిచేయిస్తూ వుంటారు. ఇక ఈ వ్రతానికి తమ గ్రామస్తులను ఎక్కువగా పిలుస్తూ వుంటారు. తమ గ్రామానికి కొత్తగా వచ్చిన కోడలు పిల్లను చూడాలని అక్కడి స్త్రీలు ఆతృత పడుతుంటారు. సత్యనారాయణస్వామి వ్రతానికి వచ్చిన వాళ్లు ఆ కోడలు పిల్లను చూడటం జరుగుతుంది. ఈ కారణంగా వాళ్లందరితో ఆ కోడలికి పరిచయం ఏర్పడటం వలన, ఆ తరువాత చాలాతొందరగా వాళ్లతో కలిసిపోతుంది. తనకి ఆ ఊరు కొత్త అనే విషయాన్ని కొద్ది రోజుల్లోనే మరిచిపోతుంది. ఇలా ఒక పవిత్రమైన పూజా సమయంలో తమ కోడలను ఇతరులకు పరిచయం చేయడాన్నిఅత్తింటి వాళ్లు శుభసూచకంగా భావిస్తుంటారు. కొత్తగా కోడలు పిల్ల తమ ఇంటికి వచ్చిన సందర్భంగా, సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేయడం ... దానికి గ్రామస్తులను పిలవడం అనే ఆచారం వెనుకగల అర్థ ఇదే!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.