మకర సంక్రాంతి

మకర సంక్రాంతి 

దీనినే  మనం పెద్ద పండుగ అని పిలుస్తుంటాము. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం నుంచి ఇక  మకరసంక్రాంతి  అవుతుంది. ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభమయినది  అంటే  దేవతాసంబంధమైన కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానం కల్పించబడుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తే, మళ్ళీ కర్కాటకరాశిలోకి ప్రవేశించే పర్యంతం ఉన్న కాలం ఉత్తరాయణపుణ్యకాలం. ఉత్తరాయణపుణ్యకాలం తనంతట తాను చాల తేజోవంతమైన కాలంగా,ఈశ్వరసంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసినప్పటికి కూడా గొప్ప ఫలితాలు అనుగ్రహించేటటువంటి కాలంగా చెప్పబడుతుంది. అందుకే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయాన్ని లెక్కకట్టుకొని ఆ ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభమవుతోంది అన్నప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా మకరసంక్రమణస్నానం అని చేసి, పితృదేవతల యొక్క సంతోషం కోసం, దేవతల యొక్క అనుగ్రహం కోసం మనం దానధర్మాది కార్యక్రమాలని నిర్వర్తిస్తుంటాము. ఇటువంటి  ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభమయినటువంటి పెద్దపండుగని మకరసంక్రాంతిగా మనం విశేషంగా జరుపుకుంటాము. ఆ పండుగ నాడు కొత్త అల్లుళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళందరికి కూడా తలస్నానం చేయించి, నూతన వస్త్రములని ఇచ్చి, మంచి మధురపదార్ధాలతోటి అత్తవారింటిలో మంచి భోజనం ఏర్పాటు చేసి, విందువినోదాలతో ఎంతో సంతోషంగా చేసుకొనేటటువంటి పండుగ.  ప్రత్యేకించి సంక్రాంతి పండుగ అనేటప్పటికి  దాని  శోభ వేరు. ప్రతి ఇంటి ముందు కూడ పెద్ద పెద్ద రంగవల్లులు తీరుస్తారు. తీర్చి గొబ్బిళ్ళు పెట్టి ఆవుపేడతో దానికి బంతిపూలు అమర్చి కన్నెపిల్లలు అందరు కూడ ఆ గొబ్బిళ్ల చుట్టు తిరుగుతు, పాటలు పాడుతు, ఆ ఆవుపేడలోకి ఆవాహన చేయబడిన అమ్మవారి విశేషం చేత వారికి ఉత్తముడైనటువంటి భర్త లభించాలని, వారి జీవితం సుఖ సంతోషాలతో గడవాలని అమ్మని ప్రార్ధన చేస్తూ కొత్తబట్టలు కట్టుకొని ప్రాతఃకాలంలోనే ఆ గొబ్బిళ్ళకి పూజ చేసి వాళ్ళందరు గొబ్బిళ్ళ పాట పాడుతూ, చుట్టు తిరుగుతూ, కేరింతలు కొడుతూ, నైవేద్యాలు పెడుతూ, ఆ ప్రసాదాలు పంచుకుంటూ, తింటూ ఒక కొత్త శోభని ఆవిష్కరించేటటువంటికాలం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.