కేదారేశ్వర వ్రతకథ
🌺🌹🌿కేదారేశ్వర వ్రతకథ 🌱🌷🌺
సూత మహర్షి శౌనకాది మహర్షులతో ఇట్లనెను మానవులకు సర్వసౌభాగ్యములు కలుగజేయునది. పార్వతీదేవికి సాంబశివుని శరీరార్థము పొందినది.అగు కేదారేశ్వరవ్రతమును తెలియజేస్తున్నాను. అందరూ ఆచరింపవచ్చును. ఈ వ్రతము 21 మార్లు ఆచరించి పుణ్యాత్ములు సకలసంపదలు అనుభవించుదురు. అంత్యమందు శివ సాయుజ్యమునుపొందుదురు. భూలోకమున అనేక మెరుపులతో కూడుకొని శరత్ కాల మేఘములతో, అనేక పర్వతములతో ,అనేక లతలతో , బహువిధములైన పుష్పములతో, నానా విధములైన పక్షులతో అనేకములైన కొండచిలువతో సర్పములతో,సింహశార్థూలాదిమృగములతో,అనేకవృక్షములతో, సర్వజన నమస్కృతమైన కైలాస పర్వతము కలదు. అందున మహనీయులగుమహర్షులు దేవతలు సిద్ధులు సాధ్యులు గంధర్వ యక్ష రాక్షస కిన్నెరకింపురుషలతో సేవింపబడే మనోహరమైన ఆ పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పార్వతి పరమేశ్వరులు ప్రధమ గణములతో సేవింప బడుతూ ప్రసన్నుడై బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చెను. అద్భుతమగు ఆ సభలో నారదుడు మొదలగు గాయకులు గానము చేసిరి. శ్రావ్యమగు ఆ గానములో రంభాది అప్సరసలు నాట్యము చేసిరి. రంభ చేసిన నాట్యం హ్రుదయ రంజకముగా ఉన్నది. ఆసందర్భములో పరమేశ్వరుని అనుజ్ఞతో భృంగిరిటి అనే మహర్షి అద్భుతమైన నాట్యము చేసెను. ఆ నాట్యమునకు సభలో వారందరూ కరతాళధ్వనులు హర్షద్వానాలు చేసిరి. అప్పుడు పరమేశ్వరుడు భృంగిరిటిని కొనియాడి అనుగ్రహించెను.భృంగిరిటి ప్రీతుడై పార్వతి దేవిిని విడిచి పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణము చేసెను. అందులకు పార్వతీదేవి చిరునవ్వుతో పరమేశ్వరునితో ఇట్లనెను. ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేయుటకు కారణమేమి అని అడిగెను. అందులకు పరమేశ్వరుడు యోగులకు నీ ప్రయోజనము లేదు అనెను.అందులకు ఆ పార్వతీ దేవి కోపించి కైలాసము వదలి తపమాచరించుటకు గౌతమ మహర్షి ఆశ్రమమునకు చేరెను. అంత గౌతమ మహర్షి హోమసమిధలు కుశ ఫలాదులు గ్రహించుకొని వస్తూ తన ఆశ్రమము చూసి ఆశ్చర్యము పొందెను. ఆశ్రమమునకు వచ్చి పార్వతీదేవిని చూసి జరిగినది తెలుసుకొని పురాణ అవలోకన చేసి కేదారేశ్వర వ్రతం ఉపదేశము చేసెను. వ్రతమును పార్వతి దేవి ఎక్కువ భక్తిశ్రద్ధలతో 21 యొక్క మార్లు ఆచరించెను. అందులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై శరీరంలో అర్థ భాగమును అనేక వరములను ప్రసాదించెను.ఈవ్రతం నందీశ్వరుని ద్వారా తెలుసుకొని చిత్రాంగదుడు అనే గంధర్వుడు ఈ వ్రతము చేసెను. చిత్రాంగదుని ద్వారా తెలుసుకొని ఉజ్జయినీ పట్టనంబున వజ్రదంతుడు అనే మహారాజు ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచుండెను. ఆ రాజ్యములో కడు పేదవారైన సుబుద్ధి అనే వైశ్యని కుమార్తెలు భాగ్యవతి పుణ్యవతి తండ్రి అనుజ్ఞ తీసుకొని కేదారేశ్వర వ్రతము సంకల్పించుకుని నదీతీరమున స్నానాదులు పూర్తిచేసుకుని శివలింగమును తయారు చేసి మర్రిఆకులూ మర్రికాయలు ఆకులుచెక్కలుగా మర్రి ఊడలు తోరణాలుగా ఉంచి అక్కడదొరికే పత్రములతో పూలతో విశేష భక్తిశ్రద్ధలతో ఆరాధన చేసిరి. అందుకు పరమేశ్వరుడు అనుగ్రహించి వారికి వరములు కోరుకోమనెను వారు తమకి మహారాజులు భర్తలుగా కావాలని తమ దరిద్ర బాధలు తొలగాలని సకలఐశ్వర్యములు కలగాలని కోరుకొనెను. పరమేశ్వరుని అనుగ్రహమువలన పుణ్యవతిని వజ్రదంతుడు అనే మహారాజు, భాగ్యవతిని చోళభూపాలుడు, వివాహమాడారు. కొన్నాళ్ల తరువాత భాగ్యవతి అహంకారముతో నాస్తికురాలై వ్రతభంగము చేసినది.అందువలన భార్యాభర్తలకు మనస్పర్ధలు ఏర్పడి కుమారుని తో సహా భాగ్యవతి రాజ్యము నుంచి వెళ్ళగొట్టబడినది. భాగ్యవతి అరణ్యముల తిరుగుతూ బోయపల్లి చేరి ఆ కుమారుడుపెరిగి పెద్దవాడు అయినతర్వాత జరిగినది తెలుసుకొని బాధ పడుతూ ధనము సంపాదించుటకు పెద్దతల్లి పుణ్యవతి వద్దకు చేరి తమకు కలిగిన కష్టమును తెలియచేసెను.పుణ్యవతి కుమారునికి అనంతమైన ధనమును మూటగట్టి ఇచ్చెను. మార్గమధ్యములో ఆధనమను నదీ తీరము నుంచి దాహమునకు నదిలో దిగి దాహము తీర్చుకొని వచ్చునప్పుటికి ధనము అంతర్థానమయ్యెను. మరలా తిరిగి పుణ్యవతి వద్దకు వెళ్లి ధనము సంపాదించుకొని వస్తున్న సమయములో ఆధనము అదృశ్యము చెందెను. ఆశ్చర్యపడుతూ దిక్కులు చూస్తున్నప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వ్రతభ్రష్ఠులకు ఈధనము చెందదని తెలియచేసి,మాయమయ్యెను. తిరిగి పెద్ధమ్మ వద్దకు చేరి జరిగినది తెలియపరిచెను. పుణ్యవతి అంతయూ గ్రహించి కుమారునిచే కేదారేశ్వర వ్రతము చేయించి, అనంత ధనము ఇచ్చి పంపించెను, అప్పుడు దారిలో పోగొట్టుకొనిన ధనము లభించినది.ఆధనము అంతయు తీసుకుని బోయపల్లి చేరుకొనెను. చోళభూపతి విచారించి తన తప్పిదము తెలుసుకుని భార్యను కుమారుని తీసుకుని రాజ్యమునకు తీసుకొని వచ్చి పట్టాభిషేకం జరిపి ప్రతి సంవత్సరము కేదారేశ్వర వ్రతము ఆచరిస్తూ, భోగభాగ్యములు తో సంతసముగ ఉండెను.
వ్రతంసువ్రతమస్తు.🌺🌹🌺🙏🙏🙏
కామెంట్లు