మౌనం అనగా?
మౌనం అనగా వాక్కుని నియంత్రించడం లేదా మాటలాడడం తగ్గించడం. ఇదొక అపూర్వమైన కళ మరియు తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా అవసరం మేరకే మాట్లాడటం సర్వదా శ్రేయస్కరం. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి. (పంచ శాంతులు: #ఉపవాసం, #జపం, #మౌనం, #పశ్చాత్తాపం మరియు #శాంతి)
మౌనంగా ఉండేవారిని మునులు అంటారు.
మాట వెండి అయితే, మౌనం బంగారం అని సామెత.
మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చుఅన్నారు స్వామి వివేకానంద.
నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించడం అనుకూలం కాదు.
అతిగా మాట్లాడేవారికి విలువ తగ్గిపోతూ ఉంటుంది.
మౌనం మూడు విధాలుగా చెప్తారు.
#వాజ్మౌనం:
వాక్కును నిరోధించడమే వాజ్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల
పరుష వచనాలు పలుకుట,
అబద్ధము లాడుట,
ఇతరులపై చాడీలు చెప్పుట,
అసందర్భ ప్రలాపాలు
అను నాలుగు వాగ్దోషాలు హరించబడతాయి.
#అక్షమౌనం:
అనగా ఇంద్రియాలను నిగ్రహించడం. ఇలా ఇంద్రియాల ద్వారా శక్తిని కోల్పోకుండా చేస్తే ఆ శక్తిని ధ్యానానికి, వైరాగ్యానికి సహకరించేలా చేయవచ్చును.
#కాష్ఠమౌనం:
దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా అరికట్టినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశము మనస్సును నిర్మలంగా ఉంచుట. కాబట్టి ఇది మానసిక తపస్సుగా చెప్పబడింది.
#ప్రయోజనాలు:
మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివలన దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, ఆంతరిక సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటవారిలో పరివర్తనను తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకి శాంతి లభిస్తుంది. సమయం సదుపయోగమౌతుంది.
పతంజలి మహర్షి తన యోగసిద్ధాంతంలో అవలంబించవలసిన మౌనానికి ప్రాధాన్యతనిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ములలో #రమణ_మహర్షి, #శ్రీరామకృష్ణ_పరమహంస, #స్వామి_వివేకానంద మున్నగు వారెందరో ఉన్నారు.
#UsesOfSilence #BeSilence #TalkLessTips #Mounam
కామెంట్‌లు