కూష్మాండా దేవి
కూష్మాండా దేవి
దుర్గామాత చతుర్థ స్వరూప నామం కూష్మాండా దేవి. తన మందస్మితం ద్వారా అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయడం కారణంగా ఈమె కూష్మాండా దేవి నామం తో పిలవబడుతున్నది. సృష్టియే లేని వేళ దశ దిశలా అంధకారం అలుముకున్న సమయంలో ఈ దేవియే బ్రహ్మాండాన్ని సృష్టించింది. కనుక సృష్ట్యాది స్వరూపురాలు, ఆదిశక్తి ఆమెయే. ఈమెకు ముందు బ్రహ్మాండ అస్తిత్వం లేనే లేదు. సూర్యమండలాంతర్భాగంలో ఈమె నివసిస్తూ ఉంటుంది. సూర్యమండంలో నివసించే శక్తిసామర్థ్యాలు ఈమెకు మాత్రమే ఉన్నాయి.
ఈమె శరీర కాంతి ప్రభాసూర్య సమంగా దేదీప్యమానంగా ఉం టుంది. ఆమె తేజస్సు అతులనీ యమైనది. ఇతరేతర దేవి తేజోప్రకాశాల వల్లనే దశదిశలూ ప్రకాశిస్తూ ఉంటాయి. బ్రహ్మాండాంతర్గత సమస్త వస్తు వులు ప్రాణిమాత్రులలోని తేజస్సు ఈమె ఛాయయే. అష్టభుజాలూ ఉండడం వల్ల ‘అష్టభుజాదేవి’ అన్న నామం తో ఖ్యాతి చెందింది. ఆమె హస్తాలలో క్రమంగా కమండలం, ధనుర్బానాలు, కమలం, అమృతకలశం, చక్ర గదాదులున్నాయి. అష్టమ భుజంలో సర్వనిధులనూ, సిద్ధులనూ ప్రసాదించు నట్టి జపమాల ఉంది. ఆమె వాహనం సింహం. సంస్కృతంలో గుమ్మడికాయ ను కూష్మాండమని అంటారు. ఈ దేవికి బలులలో కూష్మాండా బలి విశేష ప్రీతిదాయమైనది.
ఈ కారణం వల్ల కూడా ఆమెను కూష్మాండా దేవి అని అంటా రు. నవరాత్రులలో నాలుగవ నాడు కూష్మాండా దేవి స్వరూపార్చనయే జరుగుతుంది. ఆ రోజున సాధకుడి మనస్సు అనాహత చక్రంలో లయమవుతుంది. కనుక సాధకుడు తత్వమయంలో అత్యంత పవిత్రంగా అచంచల మనస్సుతో కూష్మాండా దేవి స్వరూపాన్ని ధ్యానంలో ఉంచుకొని పూజోపాసనలలో లగ్నం కావాలి. కూష్మాండా దేవి ఉపాసన వల్ల భక్తుల రోగశోకాదులన్నీ నాశనమవుతాయి. ఈ జనని భక్తి ద్వారా ఆరోగ్యం వర్ధిల్లుతుంది. కూష్మాండా దేవి అత్యల్ప భక్తి సేవలకే ప్రసన్నురాలవుతుంది. శరణు వేడగలిగితే అతడు సుగమంగా పరమపదాన్ని పొందగలుగుతాడు. శాస్తప్రురాణాల్లో వర్ణించబడిన విధి విధానాల అనుసారం మనం దుర్గామాతను ఉపాసిస్తూ అహర్నిశలూ భక్తి మార్గంలో పురోగమించాలి. మాతృభక్తి మార్గంలో సాధకుడు కొన్ని అడుగులు మాత్రం ముందుకు వేయగలిగితే సాధకునికి అమ్మవారి కృపాకటాక్షం యొక్క సూక్ష్మానుభవం కలుగుతుంది. దుఃఖ స్వరూపమైన ఈ సంసారం అట్టి భక్తునకు అత్యంత సుఖకరమైనదిగా మారుతుంది.
సేకరణ - సూర్యదినపత్రిక 2011
కామెంట్‌లు