నరసింహ జయంతి

నరసింహ జయంతి

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహ స్వామి. నరసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహ స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నరసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.
నరసింహ జయంతి వృత్తాంతం:

నరసింహ స్వామి విష్ణుమూర్తి అవతారాలలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన అవతారం. నరసింహస్వామి శరీరం సగ భాగం మనిషి ఆకారం, సగ భాగం సింహ రూపంలో దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి వరాన్ని ఉద్దేశించి స్వామి ఈ రూపంలో అవతరించారని పురాణాల ప్రశస్తి.

హిందు పురాణాలలో పూర్వం కశ్యపుడనే ఒక మహర్షికి భార్య దితి, ఇద్దరు కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణుభగవానుడు లోకకళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి బ్రహ్మను ప్రత్యక్షం గావించుకొన్నాడు. బ్రహ్మ వలన చావులేని వరం పొందిన హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు.

ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య కయధు మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమే అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తు ఉండేవాడు.

ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రంతొ కోపోద్రుక్తుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు.

అంతే భయంకరాకారుడై,  తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. ప్రహ్లాదుని ఆశీర్వదించి ఎవరైతే ఈ రోజున నా నామసంకీర్తనతో ఉపవసించి ఉంటారో వారి సమస్యలు, బాధలు తొలగిపోతాయి అని శలవిస్తారు.కావున ఈ శుభదినాన్ని మనం అందరం నరసింహజయంతిగా జరుపుకుంటున్నాము.


ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తి తో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు.

1. ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం.
2.నృం నృం నృం నరసింహాయ నమహా:
ఈ మంత్రాలు పఠించడం వలన మనిషి తన బాధలనుండి విముక్తి గావింపబడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. 

నృసింహస్తుతి
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం 
వందే కృపానిధిం అహోబలనారసింహం!!
ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం 
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం  
వందే కృపానిధిం అహోబలనారసింహం!!
కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం 
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం 
వందేకృపానిధిం అహోబలనారసింహం!!

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం  
వందేకృపానిధిం అహోబలనారసింహం!!
మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం 
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం !!
తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం 
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.