శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.. హంసలదీవి

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.. హంసలదీవి

================================

కృష్ణానది సాగరుణ్ణి చేరే ఈ అత్యంత సుందర ప్రదేశంలో దేవతలచే నిర్మింపబడిన శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం వుంది.

పవిత్ర సంగమం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సింధూ స్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసేచోట హంసలదీవిలో సింధూ స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఏటా ఆ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసలదీవిలోని సాగర తీరమంతా భక్తజనసంద్రంగా మారుతుంది. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.


మహర్షుల, దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగిన ప్రదేశం ఇది. పెద్దలనూ, పిన్నలనూ ఒకేలాగా ఆకర్షించే ప్రదేశమిది. 


హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది.

పౌరాణిక  విశేషాలు

-***************

 కృష్ణా నదీ విశేషాలు  పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపాలతో అపవిత్రమైంది. ఆ పాపాలనుంచి విముక్తికై ఆవిడ మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపాత్ముల పాపాలమూలంగా నువ్వు నల్లగా మారి పోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కధ.

పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.


పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం కట్టి పూజలు చెయ్యసాగారు.

అక్కడ చాలామంది మహర్షులు, పరమ హంసలు తపస్సు చేసుకుంటూ వుండేవారు. అందుకని కూడా హంసల దీవి అనే పేరు. వాళ్ళు అక్కడ ఒక యజ్ఞం చేయాలని శౌనకాది మహర్షులను ఆహ్వానించారు. వారందరూ వచ్చారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడినుండో రాసాగారు. గోదావరి తీరాన నివసించే కవశుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది. ఆయన బ్రాహ్మణ మహర్షికీ, శూద్ర జాతి స్త్రీకి జన్మించినవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అనేకమంది శిష్యులకు మోక్ష మార్గాన్ని బోధించేవాడు. కొందరు శిష్యులను వెంటబెట్టుకుని యజ్ఞం చూడటానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన సమయంలో యజ్ఞం జరిగేచోట పెద్దలెవరూ లేరు. శిష్యులు కొందరు కార్యక్రమ నిర్వహణలో నిమగ్నులయి వున్నారు. వాళ్ళు కవశ మహర్షిని చూడగానే వేద మంత్రోఛ్ఛారణ ఆపేసి కుల భ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమయినదని అనేక విధాల దూషించి, అగౌరవ పరచారు. కవశుని శిష్యులు కోపంతో వారించబోగా, కవశుడు వాళ్ళని అడ్డుకుని, అక్కడి మునులకు క్షమాపణ చెప్పి, దేవతలు నిర్మించిన వేణు గోపాలస్వామి ఆలయం ముందు నిలిచి విచారిస్తూ, కృష్ణ స్తోత్రాలు చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు జరిగిన విచిత్రమిది. నిర్మలంగా ప్రవహిస్తున్నకృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలయి ఒక చీలిక ఉధృతంగా బయల్దేరి కళ్ళేపల్లి మీదుగా హంసలదీవి వచ్చి వేణు గోపాలస్వామి పాదాలను తాకి, కవశ మహర్షి చుట్టూ తిరిగి యజ్ఞ వాటికని ముంచెత్తింది. యజ్ఞకుండాలు నీటితో నిండిపోయాయి. ఋత్విక్కులు నీటిలో కొట్టుకుపోయారు.

ఉత్సవాలు: ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.