నిరతాన్నదాత ఆంధ్రుల అన్నపూర్ణ -డొక్కా సీతమ్మ

నిరతాన్నదాత ఆంధ్రుల అన్నపూర్ణ -డొక్కా సీతమ్మ

శిబిచక్రవర్తి, రంతి దేవాది చక్రవర్తుల జన్మించిన భూమి ఇది. అతిథి దేవోభవ అని తలచే నేల ఇది. ఆకొన్నవారికి ఇంత అన్నం పెట్టడమే.. హరి సేవయని.. మానవ సేవయే మాధవ సేవయే .. అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న అని ప్రపంచానికి చాటిన దేశం ఇది. ఈ నేల మీద పుట్టిన ఎందఱో ఈ సూత్రాలను పాటించి జగతికి చాటారు. అట్టి మహాత్ముల కోవకు చెందినదే శ్రీమతి డొక్కా సీతమ్మ. ఆమె 1841 లో గోదావరి జిల్లా లోని మండపేటలో నరసమ్మ, భవానీ శంకరం అను పుణ్యదంపతులకు జన్మించారు. చిన్నతనములోనే తల్లిని కోల్పోయిన సీతమ్మ కి ఇంటి పనులు చేయడం, తండ్రికి సహాయంగా ఉండటం నేర్చుకున్నారు.


చిన్నతనము నుండే ఆమెకు అతిథులను ఆదరించడం అలవడింది.. ఒకరోజు గ్రామాంతరం వెళ్ళిన భవానీ శంకరం గారి ఇంటికి ఏదో పని మీద ఆ ఊరికి వెళ్ళిన జోగయ్య .. ఆ ఎనిమిదేళ్ళ బాలిక ఆతిథ్యానికి మర్యాదలకు అణకువకు సంతసించి తరువాత కొద్దినాళ్ళకు ఆమెనే వివాహం చేసుకున్నారు. లంకల గన్నవరానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన వాడు జోగన్న. తన ఇంటికి వచ్చిన వారికి , ఆకలి అన్నవారికి ఆమె ఎన్నడు లేదన్న మాట లేకుండా స్వయంగా వండి వారి ఆకలి తీర్చేది.. పెళ్ళయిన కొత్తల్లో తన భర్త ఏమయినా అనుకుంటారేమో ఇలా అన్నదానం చేస్తే అనుకున్న ఆమెను ఆమె భర్త జోగన్న వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇప్పటికీ గోదావరి ప్రాంతములో ఆమె గూర్చి కథలు కథలుగా ఆమె దాతృత్వం గూర్చి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.ఆమె కీర్తి ఒక్క భారత దేశములోనే కాదు.. ఖండాంతరాలు దాటింది. ఆమె దాతృత్వాన్ని విన్న ఆనాటి బ్రిటిషు ప్రభుత్వమూ.. ఆమెను ఏడవ ఎడ్వర్డు ప్రభువు పట్టాభిషేక మహోత్సవానికి ఇంగ్లాండునకు రమ్మని ఆహ్వానించారు. ఆమె తను చేసే అన్నదానం పేరు ప్రఖ్యాతులకు చేయడం లేదని ఆకొన్నవరికి అన్నం పెట్టడం లో దైవాన్ని చూస్తున్నాను అని.. ఆమె సున్నితంగా తిరస్కరించారు.సీతమ్మ ఉదారం పరోపకారం గూర్చి విన్న పిఠాపురం మహా రాజు గారు ఆమె ఆన్నదానాన్ని మెచ్చి ఒక అగ్రహారం రాసిస్తానంటే వద్దని వారించి సేవకు ప్రతి ఫలం ఆశించడం లేదని చెప్పారు .ఈ ఆదర్శాన్ని సాధ్య మైనంత వరకు ప్రతి గృహిణి ఆచరించి అన్న పూర్ణ అని పించుకోవాలని కోరారు .బ్రిటిష్ చక్రవర్తి విశాఖ కలెక్టర్ ద్వారా సీతమ్మ గారి ఫోటో తీయించి ఇంగ్లాండ్ తెప్పించుకోన్నారని తన పట్టాభి షేకం రోజున దర్బార్ హాల్ లో ఉంచి గౌరవించారని చెబుతారు.. కాశీ లో అన్నపూర్ణ దేవాలయం వద్ద ఒక భవనములో సీతమ్మ గారి చిత్ర పటంఉందని చెప్పారు .
 పేదరికం లో కూడా ఆమె అన్నదానం మానలేదు. అంతటి గొప్ప నిరతాన్నదాత సీతమ్మ గారి గూర్చి గూర్చి ఒకప్పుడు తెలుగు పాఠ్యాంశమ్ ఉండేది. 1990 ల తర్వాత తీసి వేసారు కానీ ఆమె గూర్చి ప్రతి ఒకరికీ తెలియాలి. ఈ తెలుగు వెలుగు డొక్కా సీతమ్మ గారి గూర్చిమా ఇంటిలో ఉన్న ఓ పాత తెలుగు పుస్తకములో నేను చిన్నపుడు చదివాను. . . డొక్కా సీతమ్మ గారు చనిపోయినపుడు.. ఒక మహోజ్వల తార నేల రాలిందని ఆనాడు చూసినవారు అందరు చెప్పుకున్నారట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.