శ్రీనివాసుడికి *గోవింద నామం ఎలా వచ్చింది???
గోవు...!..ఇందా.. ! [గోవు + ఇందా = గోవిందా] !*
పూర్తిగా చదవండి !!!...
*కలౌ వేంకట నాయక:" అన్నట్లు , కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి . నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణంగల »కలి యుగానికి» ఆదిదైవం «శ్రీ వేంకటేశ్వర స్వామి». ఈ యుగాది నందే, తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని , తిరుపతి ప్రాంతానికి వచ్చాడట ! అప్పుడు అక్కడ చిర కాలంగా ఆశ్రమం ఏర్పరచుకొని , తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి , "ముని పుంగవా! నేను వేంకట నాయకుణ్ణి . ఈ కలియుగానికి అధిపతిని. అందరికీ ఆరాధ్య దైవాన్ని. ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని వచ్చాను .రోజూ క్షీర సేవనం చెయ్యడానికి నాకు ఒక గోవునిస్తావా?" అని అడిగాడు . ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు . "ఓహో ! ఏమి నా భాగ్యం ? సాక్షాత్తూ వేకటేశ్వర స్వామియే వచ్చి ,నన్ను గోవునిమ్మని అడగ వచ్చాడా ?" అని ఆనందిస్తూ . అప్పుడాశ్రమంలో ఉన్న గోవులు మేతకై అడవిలోకి వెళ్ళడం చేత , అగస్త్యుడు చేతులు మోడ్చి , "స్వామీ !అలాగే ! నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే కానీ, నీపు ఇంకా రాలేదు కదా! మా అమ్మతో కూడా [శ్రీ మహాలక్ష్మితో] కలసి వచ్చిన నాడే, నీకిస్తాను" అని , అన్నాడు . అందుకు ఆనందించిన స్వామి అలాగే కానిమ్మని , అంతర్హితుడయ్యాడు . మరి కొన్నాళ్ళకి , లోక మాత అయిన లక్ష్మీదేవితో కూడి , ఇక యుగాంత పర్యంతం ,స్థిర నివాసం ఏర్పరచుకోటానికి వచ్చినప్పుడు , మళ్ళీ అగస్త్యాశ్రమానికి వచ్చాడు . అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేడు . శిష్యుడెవరో ఉంటే వెంకన్నస్వామి ఈమాటే అతనితో చెప్పాడు. అతను "అలాగే ! స్వామీ !మా గురువుగారెక్కడికో వెళ్ళారు, రాగానే , చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేడో ! అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి "అడుగో !స్వామి !" అని అటుగా చూపించాడు ". అలాగా ! దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం ! " అని ఏంతో మదిలో నొచ్చుకుంటూ , పాకలో ఉన్న గోవు నొకదానిని కట్టు విప్పి , గబగబా వేంకటేశ్వరుని వెంటబడి ,"గోవు+ఇందా !" "గోవు+ఇందా !" అని కేకలు వేసుకుంటూ, వెనకాలే వెళ్ళాడు . 'ఇందా 'అంటే "ఇదిగో ! తీసుకో ! " అని అర్ధం కాబట్టి , మునీంద్రుడు ఎలుగెత్తి , " గోవిందా ! గోవిందా !" అని అరుస్తూ , వెంటబడి వెళుతూనే ఉన్నాడు . శిఖరాగ్రానికి చేరే సరికి , నూటెనిమిది సార్లు ముని , "గోవిందా ! గోవిందా ! " అని కేకలు వేశాడు . అప్పుడు స్వామి వెనుదిరిగి , "మునీంద్రా ! గో...విదిగో ! తీసుకో ! అనే అర్ధంతోనే అయినా, నన్ను నీవు "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు నన్నుద్దేశించి అన్నావు కాబట్టి, గోవిందుడనేది, నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
"నాకీ "గోవింద" నామం ఎంతో ప్రీతి పాత్రమయ్యింది కూడా ! నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి , "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు పలికితే, వాళ్ళకి మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి, అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగాస్వీకరించాడు.
కనుకనే, ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు "ఏడు కొండల వాడా ! వెంకట రమణా ! గోవిందా ! గోవిందా ! అడుగు దండాల వాడా ! గోవిందా ! గోవిందా ! ఆపద మ్రొక్కుల వాడా ! గోవిందా !గోవిందా ! అని నోరారా పిల్చుకుంటూ , స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామ స్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి కదా ! సహస్ర నామాలున్న ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా "గోవిందా !గోవిందా !" అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు కదా !!!
ఇదండీ గోవింద నామ ఆవిర్భావ రహస్యం
కామెంట్‌లు