కుచేలోపాఖ్యానం లో కథ

కుచేలోపాఖ్యానం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా.. ఇందులో తెలియని విషయం ఒకటుంది. అదే ఇప్పుడు చెప్పబోయేది.

శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరూ కలిసే చదువుకున్నారని తెలుసుకదా. అందుకే చిన్ననాటి స్నేహితులు అన్నారు. ఐతే చదువుకునే సమయంలో జరిగిన ఘటన ఇది. దీని పర్యవసానమే కుచేలుడికి చేటు తెచ్చిపెట్టింది. అదేమిటంటే!

ఒకరోజు ఆనాటి విద్య పూర్తి చేసి తిని ఆనాటి రాత్రి అందరూ పడుకున్నారు. శ్రీకృష్ణుడు తనదగ్గర ఏది ఉన్న పంచేవాడు. కుచేలుడు అటుకులు తెచ్చుకున్నాడు. ఎవరికీ పెట్టలేదు. చివరికి శ్రీకృష్ణుడికి కూడా పెట్టకుండా దుప్పటి ముసుగు వేసుకొని మరీ పరపరా తిన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడి సందేహం వచ్చి మిత్రమా ఏమిటి తింటున్నావ్? అంటే "ఏమీలేదు ఏమీలేదు" అంటూ మూతి తుడుచుకుంటూ చెప్పాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఏమిలేదా!సరే అన్నాడు.

ఆనాటి నుండి కుచేలుడికి దారిద్య్రం పట్టుకుంది. పెళ్లయింది, పిల్లలు పుట్టారు. సరైన పోషణ లేదు. సంపాదన లేదు. అష్టకష్టాలు పడ్డాడు. ఎన్నో ఏళ్ళు గడిపోయాయి. అప్పటికి కాని మనస్సులో శ్రీకృష్ణుడు మెదలలేదు. భార్య శ్రీకృష్ణుడి గురించి విని "మీరు వెళ్లి మీ బాల్యస్నేహితుడైన శ్రీకృష్ణుడి ని కలిసి మన విషయం చెప్పండి" అంటే అప్పుడు కుచేలుడికి మదిలో మెదులుతాడు. కాని స్నేహితుల దగ్గరికి, పెద్దల దగ్గరకి, రోగుల దగ్గరికి, దేవతల దగ్గరకి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదు. ఇంటికి ఎవరైనా ఆడపిల్ల వస్తే పసుపుకుంకుమ పెట్టకుండా పంపకూడదు" కదా. మనమే కటిక పెదరికంలో ఉన్నాం. ఏమీలేదు ఇవ్వడానికి అన్నాడు.


అప్పుడు భార్య పొరుగింటికి వెళ్లి కాసిన్ని అటుకులు తెస్తే చింకిపోయిన గుడ్డలో కట్టి తీసుకెళతాడు. కుచేలుడు రావడం శ్రీకృష్ణుడు గమనించి స్వయంగా పాదాలు కడిగి మరి అక్కున చేర్చుకున్నాడు. సంతోషంతో కుచేలుడు తెచ్చిన అటుకులు తిన్నాడు. కాని శ్రీకృష్ణుడు ఏమి చెప్పలేదు. కుచేలుడు శ్రీకృష్ణుడి ఐశ్వరం చూసి ఏమీ అడగలేకపోయాడు. తెల్లవారి వెళుతూ కూడా శ్రీకృష్ణుడు ఏమి చెప్పలేదు. ఏమి ఇవ్వలేదు అని కుచేలుడు మదనపడ్డాడు కాని అడగలేదు.

కాని ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మారిపోయింది. ధనవంతుడయ్యాడు. మేడలు మిద్దెలు, పనివారు భోగమే భోగం. కొద్దిగా సంతోష పడడంతోనే అంత ఇచ్చాడు.

ఇక్కడ చెప్పేది ఏమిటంటే! ఇంట్లో పూజలు చేస్తూ కూడా దేవుడికి ఏదన్నా చేస్తే చాలామందికి దేవుడికి పెట్టాలంటే మాత్రం ఎక్కడ తినేస్తాడో అన్నట్లుగా చాటుమాటున తినేస్తారు. ఎవరైనా అతిథులు వచ్చినా మనసారా పెట్టాలంటే మనసొప్పదు. ఇలా దాచుకొని దాచుకొని తింటే కుచేలుడి పరిస్థితే వస్తుంది.

అదే కనుక మనసారా పెట్టి చూడండి. అంతకి అంత వచ్చి తీరుతుంది. ఇదే కుచేలోపాఖ్యానం లో మనం తెలుసుకోవలసింది. ఎంత దాచుకుంటే అంత దారిద్య్ర దుఃఖాలలో కొట్టుకుంటారు. ఎంత పంచితే అంత భాగ్యవంతులు అవుతారు.

సేకరణ
గీతగోవింద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.