భోగి పండుగ

భోగి పండుగ

#సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ #భోగి. భోగి రోజు తప్పకుండా తెల్లవారుఝామున అభ్యంగనస్నానం చేయాలి. ఎన్ని ముఖ్యమైనా పనులున్నా సరే, అన్నిటిని పక్కన పెట్టి తలకి (మాడుపై) నువ్వుల నునె పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. భోగి పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి?


భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతనామం. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి/దిష్టి తొలగిపొతుంది. ఇది వారి ఎదుగుదలకు తొడ్పడుతుంది.


మన బాహ్య నేత్రాలకు కనిపించదు కానీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులవుతారు.


ఈ సంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది. భోగిపండ్లు, చెరుకు ముక్కలు, రూపాయి బిళ్ళలు, పువ్వులు మొదలైనవి కలిపి పోస్తారు. చెరుకు, పూలు, పండులు ఇవన్నీ ప్రకృతికి సంకేతం. వీటిని తలమీద పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి, రక్షించండి, వృద్ధి చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని అర్ధం. ఈ పూలు, పండ్ల మిశ్రమాన్ని తలమీద పోయడం వలన పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది, చెడు ప్రభావం తొలగిపొతుంది, అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రకృతిని, భూగోళాన్ని రక్షించడం వల్లనే మనకు రక్షణ ఉంటుంది, అభివృద్ధి జరుగ్తుంది అనేది #అంతరార్ధం.


పాశ్చాత్య మతాలు కేవలం శరీరాన్ని గురించే వివరించాయి. కాని సనాతన హిందూ ధర్మం, శరీరంతో పాటు శరీరంలో ఉన్న ఆత్మను గురించి వివరించింది. మనం ఆత్మ, కాని మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం. చెరుకు, డబ్బు, పూలు, రేగిపండ్లు మనసు, బుద్ధి, అహంకార చిత్తాలకు సంకేతాలు. వీటి మాయలో పడ్డ పడి మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం కోసం తపన పడుతుంటాం. మనం పోసిన పండ్లు క్రిందకు జారిపోయినట్టుగా, మనలో ఆత్మగా ఉన్న "నేను" మీద మనోబుద్ధ్యహంకారచిత్తాల వలన కమ్మిన మాయ కూడా అలా సులువుగా క్రిందకు జారిపోయి మన నిజస్వరూపమైన ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలన్న ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విశేషం తెలియపరుస్తుంది మన సంప్రదాయం.


చిన్న పిల్లలకే భోగి పండ్లు పోయాలని ఏమి లేదు. పిల్లలు ఎంత పెద్దవారైన, ముసలిదైన "అమ్మ"కు వాళ్ళు ఎప్పుడూ పసివాళ్ళతో సమానం. అందుకే ప్రతి తల్లి తన పిల్లలకు, తన పిల్లల తోటివారికి భోగిపళ్ళను పోసి మనసార ఆశీర్వదించండి. తల్లి దీవనలుంటే సకల దేవతల దీవేనలున్నట్టే అంటున్నాయి మన శాస్త్రాలు. ప్రేమతో తల్లి దీవించే ప్రతి దీవెన సత్యమవుతుందని కూడా మన సనాతన ధర్మం చెప్తోంది.


మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్ధాలు, అంతరార్ధాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సంప్రదాయాలను మూఢనమ్మకాలు అనడం మూర్ఖత్వం.


భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వండుకుని తినాలి.


అందరికి భోగి శుభాకంక్షలు.


ఓం శాంతిః శాంతిః శాంతిః

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.