వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం ........మహిమాన్వితం.. బాసర క్షేత్రం
🌼🌿వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం ........మహిమాన్వితం.. బాసర క్షేత్రం🌼🌿
దక్షిణ భారత దేశంలో అత్యంత మహిమాన్విత క్షేత్రం.. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ నిలయం. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో గోదావరి నదీ తీరాన వెలిసిన చదువులమ్మ నెలవు. మనశ్శాంతి ప్రసాదించే ప్రాంతంగా పేరు పొందింది. భారత యుద్ధాన్ని చూసి చలించిన వ్యాస మహార్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలనాటి నుంచి నేటి వరకూ కూడా సరస్వతీ అమ్మవారు విశేష పూజలందుకుంటోంది.
బాసర ఆలయం దినదినప్రవర్థమానం చెందుతూ అఖండ కీర్తితో అలరారుతోంది. నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటు న్నారు. వందల మందికి అక్షర శ్రీకార పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించని, దర్శించాలనుకోని విద్యార్థుల్లేరంటే అతిశయోక్తే అవుతుంది. ఇలా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. నేడు వసంత పంచమి సందర్భం ఆలయ ప్రతిష్టపై ప్రత్యేక కథనం.
భైంసా/బాసర : బ్రహ్మండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం ఏర్పడింది. శక్తిని వర్ణించాలంటే మరింత తపోశక్తితోపాటు ఎలాంటి అంతరాయంలేని మహిమ గల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసర (జాహ్నావితీరం) చేరుకున్నారు. ఇది గోదావరి నాబీ స్థానం. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాబీ స్థానం అంటారు. బ్రహ్మేశ్వరం ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్లో ఉంది.
ఇది అప్పటికే పుణ్యస్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయనకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్యదృష్టితో చూడగా జ్ఞాన సరస్వతీ అమ్మవారు కనిపించింది. పూర్తిరూపం కనిపించకపోవడానికి కారణం అడిగాడు. భూలోకంలోని కొన్ని పాప కార్యాల కారణంగా తన పూర్తి రూపాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు చెప్పింది. ప్రతీరోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తిరూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికీ దర్శనమిస్తానని అమ్మవారు తెలిపింది.
వ్యాసుడు గోదావరి తీరాన కొంత దూరంలో ఉన్న కుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్లు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారు. ఇలా కొన్నేళ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తి కావడం ఆమె జ్ఞాన సరస్వతీగా ఆవిర్భవించడం జరిగిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతీ దేవి ఆయనకు జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది.
జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతోంది. భారతదేశంలోని కాశ్మీర్, కన్యాకుమారిలలో సరస్వతీ ఆలయాలు ఉన్నా చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ బాసరలోనే ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టించడం సబబు కాదని అమ్మవారికి తోడుగా మహాకాళి, మహాలక్ష్మీలను ప్రతిష్టించారు. ముగ్గురు మాతలు పక్కపక్కనే భారతదేశంలో మరెక్కడా లేరు. ఈ అరుదైన దృశ్యం ఒక బాసరలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యం చేకూరింది.
కామెంట్లు