హారతి ఎందుకు అద్దుకోవాలి?
హారతి ఎందుకు అద్దుకోవాలి? హారతి జ్యోతి స్వరూపం. పరమాత్మ స్వయంప్రకాశ స్వరూపుడు. జ్యోతి స్వరూపుడు. ప్రకాశం అంధకారాన్ని తొలగించి వస్తువును దృష్టికి కనిపించేలా చేస్తుంది. చీకట్లో వస్తువుల్ని చూడలేం. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపం కానరాదు. కాబట్టి కళ్ళకు హారతి అద్దుకుంటూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞాన ప్రకాశాన్ని కలిగించమని భగవంతుడిని ప్రార్థించాలి. సూర్యుడిలో గల జ్యోతి, పరామాత్మ యొక్క జ్యోతి, మన కళ్ళలో గల జ్యోతి ఒక్కటే. ‘జాగ్రదావస్థలో కుడి కంటిలో ఆ పరామాత్మ స్థానముండు’ అని శ్రుతి పలుకుతున్నది. పరామాత్మ దర్శన భాగ్యాన్ని కలిగించే హారతి అతి విశిష్టమైనది. ఇంట్లో, పూజా మందిరాల్లో, ఆలయాల్లో, శుభకార్యాల్లో హారతి ఇస్తుంటారు. హారతిని దర్శించుకునేందుకు భక్తులు వరుస కడుతుంటారు. మరోరకంగా చూస్తే కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, అంటూవ్యాధులు దరిచేరవు. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో, అలాగే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలైన ఆధ్యాత్మిక అంతరార్థం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
కామెంట్లు