ముందుగా నందిని ఎందుకు దర్శిస్తాం?

*ముందుగా నంది, తరువాత శివుడు*

*భగవంతునికి పూజలు చేస్తుంటాం. వ్రతాలు పాటిస్తాం. తీర్థయాత్రలు చేస్తాం. దేవాలయాలను దర్శిస్తాం. మంచిదే. ఇవన్నీ కర్తవ్యాలే. భగవంతుని ఉనికిని నిరంతరం మన స్పృహలో ఉండేటట్లు చేసే సాధనలివి.*

*కానీ భగవత్ప్రీతికరమైన పనిని మనం విస్మరించరాదు. అదే ధర్మపాలన. ఇది వదిలి ఎన్ని ఆరాధనలు చేసినా దైవం సంతోషించదని అన్ని గ్రంథాలూ చెబుతున్నాయి.*

*ఈ మౌలిక సూత్రాన్ని వదిలి చేసే ఆరాధనలన్నీ కేవలం 'ఫ్యాషన్లు' మాత్రమే.*

*ధర్మం, జీవితం సమాంతర రేఖలుగా ఉంటాయి చాలా మందికి. ఎన్నో అక్రమాలతో ఆర్జన చేసి ఉన్నతస్థితికి ఎదుగుతారు కొందరు. అది అక్రమమని వారికీ తెలుసు. కానీ అందులో కొంత దైవసేవకో, గుడి హుండీకో సమర్పిస్తే పాపం పోతుందని భావిస్తారు. అయితే పాపపు సొమ్ము భగవంతునికి సమర్పిస్తే మహాపాపం వస్తుందని వారికి తెలియదు.*

*భగవత్ కైంకర్యానికి వినియోగించే ద్రవ్యం స్వార్జితమై, సక్రమార్జితమై ఉండాలని శాస్త్రం శాసిస్తోంది.*

*పాపజీవనులు తాత్కాలికంగా భౌతికంగా అభివృద్ధి దశలో ఉన్నపుడు దేవస్థానాలవారు పూర్ణకుంభాలతో స్వాగతించవచ్చు.*

*కానీ దేవుని హృదయం మాత్రం వారిని స్వాగతించదు. శ్రమించి సంపాదించిన చిల్లిగవ్వతో కష్టించి గుడిచేరుకున్న అతిసామాన్యుడు స్వామిని చూసేది క్షణమైనా, స్వామి అతడిని కలకాలం గమనిస్తాడు. స్వామికీ మనకీ దృఢమైన అనుబంధాన్ని ఏర్పరచేది ధర్మమే. ధర్మాన్ని వృషభస్వరూపంగా వేదశాస్త్రాలు వర్ణించాయి.*


*"వృషోహి భగవాన్ ధర్మః" - ధర్మభగవానుడే వృషభం. ఈ వృషభం తెల్లగా ఉంటుంది. అంటే ధర్మపు లక్షణం స్వచ్ఛత. ధర్మ వృషభానికి నాలుగు కాళ్లు.*
*అవి 
1. సత్యం, 
2. అహింస, 
3. అస్తేయం, 
4. శౌచం*

*సత్యమంటే ఏమిటి? - ఈ ప్రశ్నకు ఉపనిషత్తు చక్కని సమాధానాన్ని ఇచ్చింది.*

*"భూతహిత యథార్ధ భాషణమేవ సత్యం" - ప్రాణి హితం కలిగించే యథార్ధ వచనమే సత్యం.*

*యథార్ధ వచనమే సత్యం (ఉన్నదున్నట్లు మాట్లాడడం) – అని చెప్తే చాలు కదా! కానీ దానికన్నా ముందు 'భూతహితం' ముఖ్యం. ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పడం ఎలాగూ అవసరమే. అయితే అన్ని పరిస్థితుల్లోనూ అది క్షేమకరం కాదు. ప్రాణికోటి క్షేమానికి భంగం కలిగించే సత్యం కూడా అసత్యమే.*
     
*ధర్మాన్ని మూర్ఖంగా, మొండిగా కాక ఆచరణశీలమైన విశ్లేషణతో అందించిన ఘనత సనాతన సంస్కృతిలో ఉంది. ఈ విధమైన స్పృహతో, మాటకీ మనసుకీ పొంతన కలిగిన కట్టుబాటుతో ఉండడమే సత్యం.*
           
*రెండవది అహింస. మాటతో కానీ, మనసుతో కానీ, క్రియతో కానీ మరొక ప్రాణిని నొప్పించకపోవడమే అహింస.*
        
*మూడవది అస్తేయం. స్తేయం అంటే దొంగతనం. అస్తేయం అంటే దొంగతనం లేకపోవడం. ఇళ్లమీదపడి దోచుకోవడమో, పరాయి వాడి ద్రవ్యాన్ని అపహరించడమో మాత్రమే దొంగతనం కాదు. అక్రమార్జననూ దొంగతనం అన్నారు.*
        
*ఆర్జనలో అక్రమం ఉండరాదు. అలాగే వినియోగంలోనూ అక్రమం పనికిరాదు. తన బాధ్యతల్ని తాను సరిగ్గా నిర్వర్తించేలా ధనాన్ని వినియోగించాలి.*
         
*మాతాపితరులు, భార్యాబిడ్డలు, అన్నదమ్ములు... ఇలా కుటుంబం పట్ల, సమాజం పట్ల తాను చేయవలసిన కర్తవ్యాలకు ధనాన్ని ఖర్చు చేయాలి.*
         
*ఈ విధంగా ఆర్జన, వినియోగం సక్రమంగా ఉండడమే 'అస్తేయం.'*
          
*నాలుగవది శౌచం. శుచి కలిగి ఉండడం. ఈ శుచి బాహ్య శుచి, అంతః శుచి - అని రెండు విధాలు. స్నానాదులు బాహ్య శుచి. తీర్ధసేవనం, ఆచారం మొదలైనవి బాహ్యశుచికీ, అంతఃశుచికీ నడుమన ఉంటాయి. అవి మన సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధిచేస్తాయి. అంతః శుద్ధి ఉత్తమ భావాలతో, మనస్సును నిర్మలం చేసుకోవడం. ప్రేమభావన, భగవచ్చింతన, సంతృప్తి మనోనిర్మలతకు సాధనలు.*
         
*ఈ నాలుగే ధర్మానికి ప్రధానాధారాలు.*
         
*అందుకే ధర్మవృషభానికి నాలుగు కాళ్లు అన్నారు. ఈ వృషభ స్వభావం ఆనందం. ఈ నాలుగూ పాటించేవానికి భయమూ, దుఃఖమూ ఉండవు. సంతుష్టితో కూడిన ఆనందమే ఉంటుంది. ఆనందంగా ఉండడాన్నే 'నంది' అంటారు. అందుకే ధర్మవృషభానికి నందీశ్వరుడని పేరు.*
         
*ఈ నంది పరమేశ్వరుని వాహనం. అంటే పరమేశ్వరుడు ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడని అర్ధం. ధర్మం ఎవరి వద్ద ఉంటుందో వారిని అధిష్ఠించి భగవంతుడు ప్రకాశిస్తాడు.*
         
*అంతేకాదు - మనం శివాలయానికి వెళితే ముందు నందీశ్వరుని పూజించి, తరువాత శివుని ఆరాధిస్తాం. నంది కొమ్ముల ద్వారా శివుని దర్శిస్తాం.*
          
*దీనిలో అంతరార్థం: ముందు ధర్మాచరణ. తద్వారా దేవతార్చన. ధర్మం ద్వారా భగవంతుడు దర్శనమిస్తాడు.*
         
*నాలుగు అంశాలను అధ్యయనం చేసి ఆచరణలోకి తెచ్చుకొనే కనీస ప్రయత్నం కూడా చేయనప్పుడు చిత్తశుద్ధి సిద్ధించదు. శుద్ధం కానీ చిత్తం శివార్పణం చేయగలమా?*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.