అష్టాదశ పురాణాలు
అష్టాదశ పురాణాలు :
ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం.
1.మత్స్య పురాణము:
శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు.., మానవులు ఆచరించదగిన ధర్మాలు..,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి.
2.మార్కండేయ పురాణము:
ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి.
3.భాగవత పురాణము:
ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.
4.భవిష్య పురాణము:
ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన విధి., అగ్నిదేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. ఈ పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి.
5.బ్రహ్మ పురాణము:
ఈ పురాణమును ఆది పురాణము లేక సూర్య పురాణము అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు., వర్ణాశ్రమ ధర్మాలు., ధర్మాధర్మ వివరాలు., స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి.
6.బ్రహ్మాండ పురాణము:
ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధాకృష్ణుల., పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు., శ్రీలలితా సహస్రనామ స్తోత్రాలు., శివ, విష్ణు స్తోత్రాలు.,గాంధర్వ,ఖగోళ శాస్త్ర వివరాలు., స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డతాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి.
7. బ్రహ్మవైవర్త పురాణము:
ఈ పురాణం సావర్ణమనువుచే నారదునకు చెప్పబడింది. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు.., సృష్టికి కారణమైన భౌతిక జగత్తు(ప్రకృతి) వివరములు., దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.
8.వరాహ పురాణము:
శ్రీమహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీశ్రీనివాసుని చరిత్రము, వేంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందు 24,000 శ్లోకాలు కలవు.
9.వామన పురాణము:
ఈ పురాణాన్ని పులస్త్యప్రజాపతి నారదమహర్షికి బోధించాడు.ఇందులో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కల్యాణము..,గణేశ, కార్తికేయుల చరిత్రలు., భూగోళ, ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి.
10.వాయు పురాణము:
ఆ పురాణము వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో శివదేవుని వైభవము., కాలమానము., భూగోళ, ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి.
11.విష్ణు పురాణము:
ఈ పురాణాన్ని పరాశరమహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణుమహత్యము, ప్రహ్లాద, ధృవ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి.
12.అగ్ని పురాణము:
ఈ పురాణము అగ్నిదేవునిచే వసిష్ఠునకు చెప్పబడింది.ఇందు శివ, గణేశ, దుర్గా ఉపాసనలు., వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి.
13.నారద పురాణము:
ఈ పురాణాన్ని నారదుడు.., బ్రహ్మమానసపుత్రులయిన సనక, సనంద,
సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము(శివస్తోత్రము) వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి.
14.స్కంద పురాణము:
ఈ పురాణము కుమారస్వామిచే (స్కందుడు) చెప్పబడింది.ఇందులో శివచరిత్ర., స్కందుని మహాత్మ్యము., ప్రదోష స్తోత్రములు., కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవా ఖండము, వేంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాధ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మ ఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రానది,మహాకాల మహాత్మ్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్ననాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి.
15.లింగ పురాణము:
ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు,దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి.
16.గరుడ పురాణము:
ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాదు. ఇందులో జీవి జనన, మరణ వివరములు., మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు., దశ మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి.
17.కూర్మ పురాణము:
కూర్మవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి.
18.పద్మ పురాణము:
అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మ పురాణము. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థసారము, గంగా మహాత్మ్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థవృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, దైవపూజా విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి.
🙏🙏🙏🙏
కామెంట్‌లు