గురు పూర్ణిమ-వ్యాస పూర్ణిమ
గురు పూర్ణిమ రోజునే
వ్యాస పూర్ణిమ అని అంటారు అలా ఎందుకు జరిగింది అని. గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అయ్యిందా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అయ్యిందా? ఇలా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
నిజానికి వేద విభాగం చేసి, పద్దెనిమిది పురాణాలు, ఉప పురాణాలు, ఇలా ఇది చివర అనలేనంత వాజ్ఙ్మయాన్ని మనకి భగవాన్ శ్రీ వేద వ్యాసులవారు ఇచ్చారు. అంత గొప్ప వాజ్ఙ్మయ రాశినిచ్చి, సనాతన ధర్మానుష్టానానికి కావలసిన అధ్యవసాయాన్ని ఇచ్చి, ఆయన వాజ్ఙ్మయము ద్వారా సనాతన ధర్మంలో చరించేవారికి పూనికనిచ్చిన మహానుభావులు శ్రీ వేద వ్యాసమహర్షి. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే వ్యాస మహర్షి లేకపోతే మన సనాతన ధర్మఎప్పుడో క్షీణించిపోయేది. వ్యాసులు ఇవ్వని స్తోత్రం లేదు, వారు స్తుతి చేయని దేవతాస్వరూపంలేదు. వారి వాజ్ఙ్మయంలోలేని భక్తి భావంలేదు, వారి వాజ్ఙ్మయంలోలేని తత్త్వంలేదు. ఏదేవత స్తోత్రం తీసినా, ఏదేవత యొక్క విశేషాలను కథలను చూసినా, ఏ క్షేత్ర మహాత్మ్యం చూసినా అన్నీ ఆయన ఇచ్చిన వాజ్ఙ్మయంలోవే, మనం నిత్యం చదువుకునే స్తోత్రాలు ఆయన పెట్టిన భిక్షయే. ఒక వేద పండితుడు నాలుగువేదాలలో ఒక దానిలో ఒక పన్నం లేదా ఒక సూక్తం చదువు తున్నాడు లేదా స్వాధ్యాయం చేస్తున్నాడు అంటే వేద వ్యాసుల భిక్షే, ఒక వ్యక్తి ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాడు అంటే అందుకు గాను చదివే రుద్రం యాజుర్వేదంలోనిదే అదీ వేదవ్యాసుల భిక్షే. ఇలా ఇప్పటికీ మనమందరం ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వ్యాసులవారి వాజ్ఙ్మయాన్ని కాని వ్యాసులిచ్చిన స్తోత్రాలను కాని తలచుకోకుండా ఉండం. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే, వ్యాసులవారు ఇంత వాజ్ఙ్మయాన్ని ఇవ్వకపోతే, శంకరులంతటివారు సనాతన ధర్మ పునరుద్ధరణకు ఇంకెంత కష్టపడవలసి వచ్చేదో... వ్యాసులవారి తరవాత వచ్చినవారెవరైనా ఏ స్తోత్రాలనిచ్చినా, ఎంత వాజ్ఙ్మయాన్నిచ్చినా అన్నీ వ్యాసులవారిచ్చిన వాటితోటి అనుసంధానమవుతూనే ఉంటాయి. ఉదాహారణకు ఆది శంకరభగవత్పాదుల సౌందర్యలహరి తీసుకోండి, బ్రహ్మాండ పురాణంలో వ్యాసులవారిచ్చిన లలితా త్రిశతి, ఇంకా వారిచ్చిన దేవీ భాగవతం వాటిలోకే వెళ్ళిపోతుంది. ఇలాగే ఏది చూసినా అంతే. అదీ వ్యాసులవారి గొప్పతనం. వారే లేకపోతే మనకి ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకునే స్థితికాని, భగవంతుని గురించిన విషయాలు కానీ చర్చించుకోడానికి కానీ, భగవత్సంబంధ కథలు, భగవంతుని స్తోత్రాలు ఇలా ఏవీ ఉండేవి కాదు, అన్నీ ఉంటేనే తెలుసుకోడానికి గురువులను ఆశ్రయించం మనం, ఏమీలేని స్థితి ఊహించడానికే భయం. ఏ గురువు చెప్పినా, వ్యాసుల వారి వాజ్ఙ్మయమే, వ్యాస విభాగమైన వేద భాగమే, వ్యాసుడు ఇచ్చిన బ్రహ్మ సూత్రాలే, వ్యాసుడు చెపిన తత్త్వమే, అందుకే సంవత్సరానికొక్కరోజు ఆషాడ పౌర్ణిమ రోజును వ్యాస పౌర్ణిమగా వ్యాసుని పూజిస్తాము. ఆషాడ పౌర్ణిమే ఎందుకు? పౌర్ణిమ నాడు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి నిశిరాత్రిలో పూర్ణ చంద్రుని వెలుగులు, గ్రీష్మ తాపంతో అల్లాడుతున్న జనులకి చల్లని వెన్నెల. అంటే అజ్ఙానమనే చీకట్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రకాశ వంతమైన జ్ఙానాన్ని ప్రసారంచేసేవాడు వ్యాసుడు, ఆయన పరంపరగా వస్తున్న గురువులు. ఇంద్రియ తాపంతో అల్లాడుతున్న మనకు తాపాన్ని తీసి చల్లని వెన్నెలలు పంచేవారు వ్యాసభగవానుడు వారి పరంపరలోని గురువులు. అందుకు ఆషాడ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా వ్యాసుని పూజిస్తున్నాం. వ్యాసపూర్ణిమ నాడు నిమ్మకాయలతో గురుమండలాన్ని వేసి పుజిస్తారు. వ్యాసుని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులను పూజిస్తారు, అలా గురువులను పూజించటం ద్వారా వ్యాస పూర్ణిమ కాస్తా గురు పూర్ణిమ అయ్యింది. ఈ గురు పూర్ణిమనాడు ఏ గురువుని పూజించినా వ్యాస భగవానుని ప్రతినిధిగా పూజించటం అన్నదే లెక్క. ఆ పూజ స్వయంగా వ్యాసునికే చెందుతుంది. ఎందుకంటే వ్యాసునికి మన గురువుకి అబేధం కనుక. //వ్యాసపుర్ణిమ నాడు చేయవలసింది// వ్యాసుని తలచుకోవడం, గురుపూజ/ గురు పాదసేవ/ గురు పాదుకాపూజ చేయడం, గురువుగారిని కలిసి కనీసం పాదాభివందనం చేయడం, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితులలో ఉంటే గురుతుల్యులనెవరినైనా కలవటం శ్రేయస్కరం. ఈ క్రింది శ్లోకాన్ని తప్పక ఈ రోజు తలచుకోవాలి, ఈ శ్లోకం గురుపరంపరయే గాక వ్యాస మహర్షి వంశ స్తుతి కూడా.. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం!! వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః!!
కామెంట్‌లు