శ్రీ కృష్ణావతారం 9

శ్రీ కృష్ణావతారం 9

 పూతన వ్రేపల్లెకొచ్చుట

కంసుడు పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆ పూతన శిశువులను చంపడంలో ఆరితేరిన రక్కసి. అలా కంసుడు పంపగా వచ్చి, గ్రామాలు, గొల్ల పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చంటి పిల్లలు కనబడినా చంపివేయ సాగింది. ఎవరి పేరు విన్నట్లయితే సమస్త భయాలు పోతాయో అట్టి ముకుందుడు ఉన్నట్టి నందుడి వ్రేపల్లెకు ఒకరోజు ఆకాశ మార్గాన వచ్చింది. మాయలు పన్నటంలో దిట్ట గనుక, కామరూపం ధరించి వ్రేపల్లె ప్రవేశించింది. ఎవరికి తెలియకుండ ప్రతి ఇంటిని పరిశీలిస్తోంది. నందుని ఇంట్లోంచి పిల్లాడి ఏడుపు విని సంతోషించింది. మంచి అందగత్తె వేషం వేసుకొంది. ప్రకాశవంతమైన కళ్ళు, పొంకమైన స్తనాలు, మచ్చలేని చంద్రుడి వంటి ముఖము. ఉందా లేదా అన్నట్లున్న సన్నని నడుము, విశాలమైన పిరుదులు. చివురు కొమ్మల వంటి ఎఱ్ఱని కాళ్ళు చేతులు. చాలా ఒత్తైన జుత్తుముడి. ఇలా చాలా అందమైన రూపంతో ఆమె అందరిని మోహింపజేసే రూపంతో వచ్చింది. బంగారపు లోలకుల కాంతులు చెక్కిళ్ళ మీద కేరింతలు కొడుతుండగా, జడ లోని చక్కటి మల్లెల సువాసనలకు ఆకర్షించబడిన తుమ్మెదలు గాలిలో వెన్నంటి వస్తుండగా, వేసుకున్న గాజులు, గొలుసులు కాంతులు విరజిమ్ముతుండగా, పైట కొద్దిగా జారుతుండగా. చంద్రుడిలాంటి అందమైన ముఖం గల పూతన బాలకృష్ణుడి ఇంటికి వెళ్ళింది.

(సహజ కవి పోతన వారు, ఆ మాయా మానిని వర్ణిస్తూ మానిని వృత్తం వేశారు. ఎంత చక్కటి సందర్భోచిత ఛందస్సు ఎన్నిక.)

అలా ఆమె ఇంట్లోకి వెళుతున్న సమయంలో . . .




 పూతన బాలకృష్ణుని చూచుట

పూతన అలా ఇంట్లోకి వెళుతున్న సమయంలో, లక్ష్మీదేవి ఇలా శృంగార వేషంతో మమ్మల్ని బ్రతికించడానికి వచ్చిందేమో అన్న భ్రాంతిలో పడిపోయారు, గోపికలు మాటలు పెగలనంత మైకంలో పడ్డారు, తదేక దృష్టితో అలా చూస్తూ ఉండిపోయారు. పూతన లోనికి వెళ్ళి మంచం మీద ఉన్నట్టి బాలకుడిని చూచింది. ఆ పరాత్పరుడు, నివురు గప్పిన నిప్పు లాంటి వాడని, దుష్టులను వధించడం ప్రారంభిస్తున్న వాడు అని ఆమెకు తెలియదు. అలా చూసి శైశవరూపి కృష్ణమూర్తి దరికి పూతన చేరుతున్న సమయంలో. .అలా పూతన వస్తోంది. లోకాలు అన్నిటికి ఈశ్వరుడు. ఈ చరాచర జగత్తు అంతటికి ప్రభువు. బాల కృష్ణుడిగా అవతరించిన వాడు ఐన అతడు, ఆ శిశు హంతకిని చూశాడు. క్రూరాత్మురాలు దురాత్మురాలు అయిన ఆ పూతన కోరి బాలింతరాలి వేషంలో వక్షోజాలలో విషం ధరించి వస్తోంది అని గ్రహించాడు. లోలోపల నవ్వుకొని కాలు చెయ్యి తెలియకుండా నిద్రపోతున్నట్లు గుఱ్ఱు పెట్ట సాగాడు.

 పూతన కృష్ణుని ముద్దాడుట

ఆ పాపిష్టి రాక్షసి మంచం దగ్గరకి వెళ్ళి, కృష్ణుడిని చేతుల లోకి తీసుకొంది. పాలిళ్ళకి హత్తుకొని, తల వాసన చూసి, ముద్దు పెట్టుకొంది. బాలకృష్ణుని వద్దకు వస్తున్న శిశుహంతకి పూతన “నీకు చనుబాలు (చనుట) పట్టించ గల నేర్పరులు ఎవరు లేరయ్య. ఇంక నువ్వు పోవాలి.” అని లాలించింది. నీకు చనుబాలు (చనుట) పట్టించి అటుపిమ్మట మెల్లగా (తప్పక) పోతాలే (చనిపోతాలే) అంటున్నట్లు ఉత్సాహంతో స్తన్యం ఇవ్వడానికి బయలుదేరింది.
ఓ పద్మాలవంటి కన్నులు గల చిట్టి తండ్రీ! నా చనుబాలు ఒక్క గుక్కెడు తాగు. తరువాత నీ చక్కదనం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నా అందానికి కూడ తగిన ఫలితం దక్కుతుంది."
ఈ విధంగా ముద్దాడుతున్నట్లు కృష్ణుడితో మాట్లాడుతున్న పూతనను చూసి యశోదాదేవి రోహిణి అభ్యంతరం చెబుతూ.

 పూతన కృష్ణునికి పాలిచ్చుట

 .“ఓ యమ్మా! మా బాబును ముట్టుకోకు. పాలివ్వద్దు. నీవెవరో మాకు తెలియదు. నీ స్తన్యం మా బాబు తాగడు. వదలిపెట్టి దూరంగా వెళ్ళిపో!” అని ఓ ప్రక్క ఈ విధంగా ముద్దాడుతున్నట్లు కృష్ణుడితో మాట్లాడుతున్న పూతనను చూసి యశోదాదేవి రోహిణి అభ్యంతరం చెబుతున్నారు, అరుస్తున్నారు. కాని మాటల మెత్తదనం మాటున వాడితనం కనబడకుండా దాగి ఉన్న ఆ పూతన, వారిని లెక్కచెయ్యకుండ మాయ పన్ని, ఒరలో ఉన్న పదునైన కత్తిలా కృష్ణుడిని చూస్తోంది. ఈ విధంగా తియ్యని మాటలతో నదురు బెదురు లేకుండా పక్క దగ్గరకి వచ్చింది. తెలివి లేని వాడు ఎదురుగుండా నిద్రపోతున్న పామును, పాము అని తెలియక, తాడు అనుకొని చేతితో లాగుతున్నట్లు, ఆ క్రూరురాలైన దుష్ట యువతి పిల్లాడి మంచం దగ్గరకి వచ్చింది. పరుపు మీద కృష్ణుడు చక్కటి కాంతులతో ప్రకాశిస్తూ, కళ్ళు తెరవకుండా, భయం మరుపులు లేక అందాలు చిందిస్తున్నాడు. ఆ చిరు బాలుని ఒడిలోకి తీసుకొని, ఒళ్ళు నిమురుతూ, వాత్సల్యం చూపుతోంది “ఓ నా చిన్ని కన్న! దా, నా చనుబాలు తాగు నాయనా!” అంటు చనుబాలు పట్టబోతోంది. అప్పుడు

 పూతన సత్తువ పీల్చుట

కృష్ణుడు అప్పుడే నిద్ర చాలించి నట్లు, మెలకువ వచ్చినట్లు, మెల్లగా కళ్ళు తెరిచాడు. ముక్కి, ఒళ్ళు విరుచుకొని ఆవలిస్తూ, క్రీగంట చూశాడు. చేతులు పైకి చాపి, ఒత్తిగిల్లాడు. ఎంతో ఆకలితో ఉన్నట్లు చేతులతో ఆమె చన్నులు రెండు గట్టిగా పట్టుకొని నొక్కాడు. తాగుతూనే రెండు గుక్కలలో గుటుక్కు గుటుక్కు మని పూతన ఒంటిలోని సత్తువ అంతా ప్రాణాలతో సహా తాగేశాడు. దాని గుండెలు తల్లడిల్లి పోయాయి. నాలుక లుంగచుట్టుకుపోయింది. తల నిలపలేక వాల్చేసింది “అయ్యబాబోయ్. నువ్వు మిగతా పిల్లలలాంటి వాడివి కాదు. ఇంక చాలు. నా చన్ను వదలిపెట్టు.” అంటు గిలగిలలాడి పోయింది.

 పూతన నేల గూలుట

పూతనకు భయంకరమైన మంటలు లోపలి నుంచి చెలరేగాయి. కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయి నేలమీద పడిపోయింది. కను గుడ్లు వెళ్ళుకొచ్చాయి. పెద్ద ఆర్తనాదంతో కూలి చచ్చిపోయింది. ఆ రాక్షసికి చావు దగ్గర పడటంతో, తన భయంకర రూపం వచ్చేసింది. పెద్ద గావుకేక పెట్టి, ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు కూలిన కొండలా పెద్ద దేహంతో దభాలున నేల కూలింది. అతి భీకరమైన ఆ ధ్వనికి దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. పర్వతాలతో పాటు భూమి అదిరింది. ఆకాశంలో గ్రహాలు, తారలు కదిలి పోయాయి. లోకాలు అన్ని బెదరి చెదరి పోయాయి.
భయంకరమైన ఆ శబ్దం గోపకుల హృదయాలలో దూరి అలజడి రేపింది. వారు అందరు భయంతో బెంబేలుపడి, మెలికలు తిరుగుతూ, స్పృహతప్పి పడిపోయారు. పరీక్షిన్మహారాజా! క్రూరురాలు, నీచురాలు ఐన ఆ రక్కసి తన అసలు దేహంతో నేలమీద పడిపోవడంతో, ఒకటిన్నర ఆమడల (12 లేదా 14 కిమీ) పరిధిలోని చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయిపోయాయి. (యోజనం / ఆమడ = 8 నుండి 9 km) ఆ రాక్షసి కోరలు నాగలి కొయ్యలంత ఉన్నాయి. ముక్కు రంధ్రాలు కొండ గుహలలా ఉన్నాయి. స్తనాలు రెండు కొండరాళ్ళ లాగ ఉన్నాయి. ఎఱ్ఱని వెంట్రుకలు గాలికి ఎగురుతున్నాయి. కళ్ళు చీకటి నూతులు కన్న లోతుగా ఉన్నాయి. విశాలమైన పిరుదులు పెద్ద దిబ్బలని పోలి ఉన్నాయి. కాళ్ళు చేతులు పొడుగైన కాలువ కరకట్టలు వలె ఉన్నాయి. కడుపు ఇంకిపోయిన చెరువులా ఉంది. ఆరు క్రోసుల (3.6X6 కిమీ) పొడవైన దాని భయంకరమైన పెద్ద దేహాన్ని గొల్ల స్త్రీలు గొల్ల పురుషులు గుంపులుగా చూసి మనసులో బెదురు పుట్టి, కళవళ పడుతున్నారు. ఇలా ఈ విధంగా, అప్పుడే విరిసిన పద్మాల వంటి కన్నులున్న కృష్ణుడు, చనుబాలు తాగే నెపంతో పూతనను అవలీలగా సంహరించాడు. మరి ఆ రక్కసి మృత్యువులాగా పసిపిల్లలని చంపేది, మునులను బాధ పెట్టేది, యాతనలపాలు చేసేది కదా. విషము కోరలలో ధరించే నాగులను చీల్చెడి గరుత్మంతుడు వాహనంగా కలవాడు, కంఠమున విషము ధరించెడి శంకరుని మిత్రుడు, ప్రళయకాలమున విషము (జలము)పై శయనించు నిర్మలమైన వాడు, విషము (నీటి) యందు పుట్టెడి పద్మము నందు జనించిన వాడైన బ్రహ్మదేవునికి తండ్రియైన వాడు అయినట్టి సాక్షాత్తు మహావిష్ణువు యైన ఈ బాలుడికి విషము చిమ్మే చన్నులతో తిరిగే ఒక రాకాసి విషం లాగివేయటం విషమ (పెద్ద కష్ట)మైన పనా, కానేకాదు. ఇంతలో ఆ విషయం ఆ గొల్లవాళ్ల లోని స్త్రీ పురుషులకు అందరికి తెలిసింది. యశోదా రోహిణిలతో కలిసి వచ్చి బెదరిపోకుండా దగ్గరకి వచ్చి. . .చచ్చి పడి ఉన్న ఆ రాకాసి విశాలమైన వక్షస్థలం మీద చిన్నికృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటున్నాడు. రమ్మని పిలిచి ఎత్తుకున్నారు ఒళ్ళు నిమురుతూ ఓదార్చారు. పీడ వదలిపోడానికి ఆవుతోక పిల్లవాడి చుట్టు తిప్పి దిష్టి తీశారు. గోధూళిని, గోమూత్రాన్ని బాలుని మీద చల్లారు. పన్నెండు నామాలతో పన్నెండు అవయవాలు లోను గోమయము (ఆవుపేడ) పట్టించారు. 
గోపికలకు అంతటితో తృప్తి కలుగలేదు. అంగాంగాలకు మహారక్ష కట్టదలచి ఆచమనం చేశారు. బాలునకు రక్షకట్టే ముందు తమకు రక్షకోసం బీజన్యాసం చేసుకొన్నారు. బాలునికి రక్ష కట్టడం మొదలు పెట్టారు. “చిన్ని తండ్రి! నీ పాదాలు బ్రహ్మ, మోకాళ్లు వాయువు, తొడలు యఙ్ఞుడు, నడుము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్థలము ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖము త్రివిక్రముడు, శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తారు. అంతేకాక, నీ ముందు చక్రధారి అయిన విష్ణువు, వెనుక గదాధారి అయిన శ్రీహరి, కుడి పక్క ధనుర్ధారి అయిన మధువైరి, ఎడమ పక్క ఖడ్గధరుడైన అజనుడు, కోణములలో శంఖ చక్ర గదా ధరుడైన ఉరుగాయుడు, మీద ఉపేంద్రుడు ఐన విష్ణువు, కింద గరుత్మంతుడు, అంతట హలధరుడు అయిన పురుషుడు రక్షిస్తారు. నీ ఇంద్రియాలు హృషీకేశుడు, ప్రాణాలు నారాయణుడు, చిత్తము శ్వేతద్వీపవతి, మనస్సు యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధి పృశ్నిగర్భుడైన విష్ణువు, అహంకారం భగవంతుడైన పరమపురుషుడు రక్షిస్తూ ఉంటారు. నీవు ఆడుతుండగా గోవిందుండు, నిద్రించేటప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుండు, కూర్చొన్నప్పుడు శ్రీపతి, భుజిస్తున్నప్పుడు సర్వభక్షకుడైన యఙ్ఞభుజుడు ఏమరుపాటు లేకుండా నిన్ను రక్షిస్తూ ఉంటారు. నీ పేరు పలికితే చాలు పీడ కలలు, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు, కూశ్మాండాలు, డాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్టశక్తులు, ప్రేత, యక్ష, రాక్షస, పిశచాదులు నశించిపోతాయి. గోటర, రేవత అనే దుష్టశక్తులు, జ్యేష్ఠదేవి, పూతన, మాతృకలు మొదలైన గణాలన్ని నాశనమై పోతాయి. నీ యందు ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని బాధించే ఉన్మాదాలు, మూర్ఛలు, మహోత్పాతాలు చేరకుండు గాక!” అని బాలుడికి రక్షపెట్టి దీవించారు.
ఆ పెను మాయల చంటి పాపడికి చనుబాలు పట్టి పానుపు మీద పరుండబెట్టారు “ఇక నిద్రపో నాయనా” అని యశోద జోల పాట పాడింది. అప్పుడు నందుడు మొదలైన యాదవ నాయకులు మధురా నగరం నుండి వచ్చి, ఆ రాకాసి కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు “వసుదేవుడు మహా యోగి కనుక ఈ జరగబోయే ఉత్పాదాలు ముందే ఊహించి చెప్పాడు” అని మెచ్చుకొన్నారు. తరువాత కఠినమైన పూతన కళేబరాన్ని గొడ్డళ్ళతో నరికి ముక్కలు ముక్కలు చేసారు. తమ ఇళ్ళకు దూరంగా చందనం కఱ్ఱలు పేర్చి ఆ కళేబరం ముక్కలు దహనం చేసారు.
ఓ పరీక్షిత్తు మహారాజా! ఆ పూతన కళేబరం రగిలి రగిలి కాలుతుంటే అగరు సువాసనల పొగలు వెలువడ్డాయి. మరి విష్ణుమూర్తి ఆమె విషపు పాలతోపాటు ప్రాణాలే కాదు శరీరం లోని మాలిన్యాలన్నీ తాగేశాడు కదా. అంతటి పాపిష్టి రాక్షసి, కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి, చనుబాలు తాగినంత మాత్రాన పాపాలు అన్ని పటాపంచలైపోయి, విష్ణువు తల్లి లాగ పరమగతికి వెళ్ళింది. విష్ణువుకు ఒక్కసారి విషపూరితమైన చనుబాలు ఇచ్చిన బాలహంతకురాలైన రాకాసి కూడ స్వర్గానికి వెళ్ళిందట. మరి ఇంక విష్ణుమూర్తిని కన్నతల్లికి, పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షం తప్పక లభిస్తుంది కాని, మళ్ళీ జన్మ అన్నది ఉంటుందా?
చక్రిని కని చనుబాలు తాగించగలిగిన యువతులకు లభించే ఉత్తమలోకాలు ఊహించడం సాధ్యం కాదు. చక్రి తాగడానికి పాలను ఇచ్చిన గోవులు పరమపదం పొలిమేరలలో తిరుగు తుంటాయి. ఆ పూతన కళేబరంనుంచి మంచి సువాసనలు రావడం గోపాలకులు గమనించారు. ఆశ్చర్యంతో “ఇంతటి దుష్టురాలి శరీరంలోంచి ఇంత చక్కటి సుగంధమా” అనుకొంటు తమతమ పల్లెలకి వెళ్లారు. అంతటి ప్రమాదం తప్పిపోయినందుకు చాలా సంతోషంగా నందుడు ఇంటికి వెళ్ళాడు. గోపికలు పూతన చేష్టలు అన్ని చెప్పగా విని, ఆశ్చర్యపోయాడు. చంటిపిల్లాడిని లేపి శిరస్సు మూర్కొని ముద్దుపెట్టుకొన్నాడు. కొడుకుకి ఆపద తప్పినందుకు సంతోషించాడు.” ఈ విధంగా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు. “భగవంతుడైన విష్ణుమూర్తి ఏయే అవతారాలలో ఏమేం పనులు చేసాడు. అవి విన్నవారిని రక్షిస్తాయి. నా మనస్సు వాటి మీదకు తప్పించి ఇంకో వాటి మీదకు పోదు. హరి చరిత్రలు వినడానికి చెవులకు పండుగలాగా ఉంటాయి.బాలకృష్ణుని గొప్ప పనుల స్మరణలు సంసారమనే మహా సముద్రాన్ని దాటించే నావలు. అవి పాపాల సమూహాలను పార తోలుతాయి, సకల సంపదలు సమకూరుస్తాయి, మోక్ష పదానికి మంచి మార్గాలు. నా మీద దయ ఉంటే ఆ తరువాత బాలకృష్ణుడు ఏమి చేసాడో చెప్పవలసినది” అని పరీక్షిత్తు అడుగగా, శుకబ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.