శ్రీ కృష్ణావతారం 8

శ్రీ కృష్ణావతారం 8

నందుడు వసుదేవుని చూచుట

ఆ బాలుడు పుట్టినప్పటి నుండి వ్రేపల్లె లోని ఆలమందలు కుండపొదుగులతో కనులపండుగ చేసాయి. ఒకనాడు నందుడు ఆలమందలను వ్రేపల్లెను రక్షించడానికి నిపుణులైన గోపకులను నియమించాడు. తాను మధురానగరానికి వెళ్ళి, ఏటేటా చెల్లించవలసిన పన్నులను కంసునికి సమర్పించాడు. అతని వద్ద సెలవుతీసుకుని వసుదేవుని దగ్గఱకి వెళ్ళాడు. ఎంతో గౌరవంగా అతనిని దర్శనం చేసుకున్నాడు. నందుని చూడగానే ఆనందాశ్రువులతో చేతులు సాచి వసుదేవుడు నందుడిని కౌగలించుకున్నాడు. ప్రాణంలేని కళేబరానికి ప్రాణాలు వచ్చినట్లు అతనికి నందుని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి. ఆవిధంగా నందుని కౌగిలించుకుని, సుఖాసీనుణ్ణి చేసాడు. అప్పుడు వసుదేవుడికి కన్నకొడుకుపై ప్రేమ పొంగింది. అంతట వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సంతానం లేదని ఎన్నో ఏళ్ళ నుండి తీరని చింతతో చిక్కిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగింది. ఎంత అదృష్టవంతుడవు నిజానికి సంతానం లేని వాడికి సౌభాగ్యం ఎక్కడ ఉంటుంది.
ఎన్నోరోజులకు నిన్నుచూసాను, బ్రతికిపోయాను. నా ఆపదలన్నీ గడచినట్లు అనిపిస్తూ ఉంది. కార్యనిర్వహణలో ఏమాత్రం భేదభావం చూపని స్నేహితుణ్ణి చూడడం అంటే పునరుజ్జీవితుడు కావడమే కదా. బ్రతుకుతెరువులో ఎన్నోపాట్లు పడతూ ఉండే జనులకు ఒకే చోట ఉండాలంటే వీలు అవుతుందా? మరి నదులలో ఎన్నో చెట్లు మ్రాకులు కొట్టుకుని వస్తూ ఉంటాయి; క్రొన్ని మ్రాకులు కలిసి ఒక చోట చేరి ప్రయాణం చేస్తాయి; మళ్లీ విడిపోయి తమ దారిని తాము వెళ్ళిపోతాయి కదా. మిత్రమా! మీ ఆవులన్నీ చక్కగా పాలు ఇస్తున్నాయా? ఏ అంటురోగాలూ లేవు కదా? మీ ప్రాంతాల చెరువులూ ఏరులూ నీళ్ళతో నిండి ఉన్నాయా? మీ గొల్లపల్లెలన్నీ వృద్ధి పొందుతున్నాయా? మీ గోవులు నిలిచేచోట పులులూ, దుప్పులూ సంచరించడం లేదు కదా? మీ అడవులలో చక్కని పచ్చని పచ్చికబయళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కదా? తన పుత్రులూ, మిత్రులు మొదలైన వారిని సంతృప్తి పరచకుండా; వారి క్షేమం చూడకుండా; వారు క్షీణించి నశించిపోయేలా ప్రవర్తించే గృహస్థు పోషణలో ఉన్నవారికి ఏమాత్రం సంతోషం ఉండదు కదా. నందా! నీవూ నీభార్య ప్రేమగా చూస్తూ ఉంటే యశోదవద్ద నాకొడుకు ఆనందంగా ఉన్నాడా? నిన్ను తండ్రిగా చూస్తూ నీ ప్రేమలు అందుకుంటూ వ్రేపల్లెలో క్షేమంగా ఉన్నాడు కదా!”



వసుదేవ నందుల సంభాషణ

ఇలా అడిగిన వసుదేవుడుతో నందుడు ఇలా అన్నాడు

“వసుదేవా! నీకూ దేవకీదేవికి పుట్టిన కొడుకులు అందరినీ పుట్టిన వెంటనే ఆ కంసుడు వధించాడు. పాపం చివరికి మీ కూతురిని కూడా హింసించబోతే ఆపాప ఆకాశానికి ఎగిరిపోయింది. మొత్తంమీద నీకు బిడ్డలు లేకుండా పోయారు. జగత్తు అంతా దైవాధీనంకదా. ఈసంగతి తెలిసినవాడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖపడతాడా. కనుక ఊరడిల్లుము నా కొడుకే నీ కొడుకు అనుకో.”
అలా అన్న నందుడితో వసుదేవుడు ఇలా అన్నాడు.
“కంసుడికి పన్నులు చెల్లించావు; మమ్మల్ని చూడటానికి వచ్చావు; మేమూ నిన్ను చూసాము; మంచిది. గోకులంలో ఉత్పాతాలు సంభవించే సూచనలు ఉన్నాయి. ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే బయలుదేరు.” ఇలా చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన గోపకులకు వీడ్కోలు చెప్పి పంపించాడు. వాళ్ళు కూడా త్వరత్వరగా పోయే గిత్తలను పూన్చిన బళ్ళు ఎక్కి తమ తమ పల్లెలకు ప్రయాణమై వెళ్ళిపోయారు. నందుడు తన ఎదురుగా స్పష్టమైన ఉత్పాతాలను చూసాడు. “వసుదేవుడు చెప్పిన మాటలు తప్పవేమో” అనుకుంటూ వేగంగా ప్రయాణం సాగించాడు.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.