శ్రీ కృష్ణావతారం 7

శ్రీ కృష్ణావతారం 7

కంసునికి మంత్రుల సలహా

ఇలా ప్రసన్నులు అయిన దేవకీవసుదేవుల అనుమతి తీసుకుని, కంసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎలాగో గడపి మరునాడు ఉదయాన్నే తన మంత్రులను పిలిపించాడు. దేవి యోగమాయ చెప్పిన విషయాలు అన్నీ వారికి చెప్పి సలహా అడిగాడు. వారు ఇలా అన్నారు. “అలా అయితే ఇంకా ఆలస్యం దేనికి మహారాజా! పట్టణాలు, గొల్లపల్లెలు, గ్రామాలు అన్నిటిని వెదకి పసిపాపలు ఎక్కడ పుట్టినా పెరిగినా వధించి వస్తాము మమ్మల్ని ఆజ్ఞాపించండి. మహారాజా! భయంకరంగా ప్రకాశిస్తున్ననీ బాహువులతో ప్రయోగించిన బాణాల దెబ్బలు తిన్న దేవతాప్రభువులు ఏమైపోయారో? ఎక్కడ తలదాచుకున్నారో? శివుని ఆశ్రయించారేమో? లేక బ్రహ్మనో విష్ణువునో సేవిస్తున్నారేమో? అదీ కాకపోతే మునివృత్తులను స్వీకరించి నిరాశతో అరణ్యాలమధ్యలో ఉండిపోయారేమో? మనం వెదకడం మంచిది.
శత్రువులు దెబ్బతిన్నారు కదా! అనుకుని విచ్చలవిడిగా తిరగరాదు. వారు ఎన్నో రకాల వేషాలతో దొంగతనంగా రాగలరు. వారు చచ్చిపోయేటంతవరకు రాజైనవాడు వారిని మరచిపోరాదు. విజృంభించిన రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను అవి మనను ఆక్రమించేవరకు ఊరుకోరాదు. అవి పుట్టినప్పుడే త్రుంచివేయడంలో మెతకదనం చూపుట పనికిరాదు. ముదిరిన తరువాత జయించడం మన వల్ల కాదు.
దేవతలు అందరకీ ఆ విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మము నందు నిలచి ఉంటాడు. విష్ణువును సంహరించాలంటే అతని శరీరం మనకి దొరకాలి. అది ఒక్కచోట దొరకదు. అతనికి ఎన్నోశరీరాలు ఉన్నాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదములు, ఓరిమి, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ విష్ణువు యొక్క శరీరాలే. వీటిని అన్నింటినీ అంతంచేస్తే అతడు కూడా నిలువనీడలేక నశించిపోతాడు.మంచిని మట్టుపెడితే విష్ణువు నశించిపోతాడు కనుక . . .మహారాజా! దేవతలను చంప మంటావా? తపస్సు చేసుకునే మునులను భీకర గర్జనలతో యముని వద్దకు పంపేయ మంటావా? దూడలతో కూడా గోవులను నరికివేయ మని అంటావా? బ్రాహ్మణులను తరిమి తరిమి కొట్టమంటావా? లేక వేదాలను చింపివేయమంటావా? అదీకాకపోతే, భూమినే చుట్టచుట్టి తెచ్చి నీ వశంలో ఉంచమంటావా? ఏమి చేయమంటావో మమ్మల్ని ఆజ్ఞాపించు.”ఆ విధంగా మాట్లాడుతున్న మంత్రుల ఆలోచనలకు కంసుడు ప్రభావితం అయ్యాడు. బ్రాహ్మణులను బాధించడం తప్పు అని ఆలోచించ లేదు. కాలము అనేది అతని దుష్కర్మ రూపంలో యమపాశంవలె అతణ్ని బంధించి వేసింది. బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను చంపడానికి తన అనుచరులైన రాక్షసులను పంపి తాను అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట రాక్షసులు భీకరంగా విజృంభించారు. సజ్జనుల వద్దకు చేరి భయపెట్టారు. దూషించారు. దండించారు. ఇలా అనేక దుర్మార్గాలతో వారిని బాధించి వేధించి ఎన్నో పాపాలు మూటగట్టుకున్నారు. ఆవిధంగా ఆ దానవులు సజ్జనులను వెదకి వెదకి మరీ హింసపెడుతూ ఉంటే క్రమంగా వారిలోని అసలైన బల సామర్థ్యాలు నశించి పోయాయి. పూజ్యులను హింసిస్తే కీర్తి, ఐశ్వర్యం, ధర్మం, ఆయుర్దాయము, క్షేమము నశించిపోతాయి కదా.


కృష్ణునికి జాతకర్మచేయుట

ఇది ఇలా ఉండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని విని, మహానందం పొందాడు. వేదపండితులు అయిన బ్రాహ్మణులను పిలిపించాడు. తాను శుచిగా స్నానాలు చేసి, అలంకరించుకున్నాడు. బ్రాహ్మణుల చేత స్వస్తివాచకాలు శుభాశీస్సులు పుణ్యాహవచనాలు చేయించాడు. బాలుడికి శుభకర్మలు చేయించాడు. పితృదేవతలకు తృప్తిగా పూజలు చేసాడు. రెండు లక్షల (2,00,000) పాడిఆవులను ఆభరణాలతో అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానాలు చేసాడు. పెద్ద పెద్ద నువ్వుల రాసులు ఏడింటితో (7) పాటు బంగారు చెంబులు, రత్నాభరణాలు, నూతన వస్త్రాలు దానం చేసాడు. బ్రాహ్మణులు అందరూ “ఈ నందగోపకుమారుడు సమస్త సంపదలతో; తులతూగగలడు; శత్రు వీరులను జయించగలడు; దీర్ఘాయుష్మంతుడు కాగలడు.” అని గట్టిగా దీవించారు. ఆ వ్రేపల్లెలో దుందుభులు మ్రోగించారు. గాయకులు ఆనందంతో పాటలు పాడారు. సూతులు వందిజనులు స్తోత్రాలతో కీర్తించారు. భద్రంకరములు అయిన బాకాల మోతలు చెవుల కింపుగా వినిపించాయి. గొల్లనాయకుల ఇండ్లువాకిళ్ళు చిగురుటాకుల తోరణాలతో మనోహరములైన తీగలతో గొప్ప కేతనములతో ధూపముల పరిమళములతో ఇంపుగొల్పుతున్నవి. గోపకులు అందరూ తమ పశువుల శరీరాలకు పసుపు నూనె కలిపి పట్టించారు. ఆ పశువులు బంగారురంగు నెమలిపింఛముల లాగ పచ్చని పసిమిరంగుతో వెలుగొందుతూ మందలలో చిందులు వేశాయి.
బాలుడు కలిగిన సమయంలో ఆ మందలలోని లేగదూడలు చెంగున గంతులు వేశాయి. పోతరించిన వృషభాలు ఉత్సాహంతో ఖణిల్లు మని ఱంకెలు వేశాయి. ఆవులు పుష్కలంగా పాలు వర్షించాయి.
నందుడు ఆ సమయంలో తృప్తిగా దానాలు చేసాడు. ప్రతిదినమూ వచ్చి పుణ్యకథలు వినిపించే బ్రాహ్మణులకూ, స్తోత్రపాఠాలుచేసే వందిగాయకులకూ, గారడీలు ఇంద్రజాలాలు పగటివేషాలు మొదలైన విద్యలపై బ్రతికేవారికి, దారిద్ర్యంతో బాధపడుతూ దరిచేరినవారికి, అందరికి వారు అడగక ముందే గోవులను ధనాన్ని కొల్లలుగా దానం చేసాడు. ఆనాడు . . . .గోపకులందరూ నందుని నందనుణ్ణి చూడడానికి బయలుదేరారు; అందరూ అంగీలు తొడుక్కున్నారు; తలపాగాలు చుట్టుకున్నారు; బంగారు అభరణాలు, అందమైన దుస్తులు ధరించారు; అందరూ శుభకరములైన పదార్థాలు తీసుకుని నందుని ఇంటికి వచ్చారు; ఆ పుట్టిన వాడు లక్ష్మిదేవికి భర్త కనుక అందరూ సంపదలతో తులతూగుతూ వచ్చారు. అలావచ్చి ఆ బాలుని చూసి గోపకులు అందరూ ఆనందముతో పొంగిపోతున్నారు; ఉత్సాహంతో చెలరేగి నేతులను పెరుగులను పాలను నీళ్ళను వెన్నను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఛలోక్తులు విసురుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు. అలా బాలుని చూసి ఆనందంతో పండుగ చేసుకున్న పిమ్మట. "ఓ సుందరమైన చెలులారా! ప్రొద్దునే లేస్తూనే ఇంత మంచి శుభవార్త చెవులార విన్నాం, ఏనాడు నోచిన నోముల ఫలితమో గానీ; మన యశోదమ్మ చిన్న పాపడిని కన్నదట. చూసి వద్దాం సుందరీమణులు! రండి రండి." ఆ గోపికలు సహజంగానే సున్నితహృదయాలు గలవారు. ఈవార్త వినేసరికి తొందర ఎక్కువైంది. అపూర్వంగా అలంకారాలు చేసుకుని ఒకరి నొకరు లేవండి లేవండి అని చెప్పుకుంటూ ఇళ్ళనుండి బయలుదేరారు. అందరికి త్వరగానే వెళ్ళాలి అని ఉన్నది కాని, విశాలమైన పిరుదులు; పొంకమైన వక్షోజాలు; పిడికిట్లో ఇమిడేటంత సన్నని నడుము; ఇంకెలా త్వరగా నడువగలరు. నెమ్మదిగా నడకలు సాగుతున్నాయి. కన్నులు మాత్రం ఆనందంతో విశాలంగా విచ్చుకున్నాయి. పెద్ద తుమ్మెద రెక్కలవలె నల్లనైన పెద్దతల కొప్పులు చక్కగా ఊగుతున్నాయి. లక్ష్మీకళలు కూడా ఆ గోపికల మోముల అందాల ముందు తడబడుతున్నాయి. ఆతురతలు పెరిగిపోతుండటంతో అంతకంతకు పెరుగుతున్న గోపికల నడక వేగాలు నందుని ఇంటికి చేరేసరికి దాదాపు పరుగును అందుకున్నాయి. అప్పుడే వేసుకుని వచ్చిన జడముడులు విడిపోయాయి; వక్షస్థలంపైన ఉన్నహారాలు అల్లల్లాడిపోయాయి; బంగారు కర్ణపత్రాల కాంతులు వారి చెక్కిళ్ళపై కదులుతున్నాయి; పైట కొంగులు గాలిలో ఒయ్యారంగా నాట్యాలు చేసాయి; ఆవిధంగా ఆ గోపికలు యశోద ఇంటికి చేరి, ఎంతో ఉత్సాహంతో చిన్ని కృష్ణుడిని చూసారు. అతడు సకల జయశీలుడు, దానవులనే కాదు వారి హృదయాలను కూడా జయింపబోతున్న వాడు అయిన విష్ణువు కదా.గోపికలు చిన్నికృష్ణుని చూసి ఎంతో సంతోషించారు. తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు.

జలకమాడించుట

గోపికలు అందరూ కలసి ఆ బాలుడి తలకు నూనె అంటి శరీరానికి పసుపు రాసారు. శుభ్రంగా స్నానం చేయించారు. చివరగా బోరున నీళ్ళు పోసి, “ఇదే నీకు శ్రీరామరక్ష” అని కొన్ని నీళ్ళు చుట్టూ త్రిప్పి చల్లారు. ఊయల తొట్టెలలో పడుకోబెట్టి దీవించారు; ఇలా జోల పాటలు పాడేరు. గోపికలు చిన్నికృష్ణునికి శుభ్రంగా స్నానం చేయించి, నిద్రపుచ్చుతు – "జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందువదన! జోజో" అంటు జోలపాటలు పాడారు. ఈ విధంగా 
ఎన్నెన్నో ప్రళయసమయాలలో ఎన్నోమార్లు జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ 
ఆడుకున్నాడు. లోకాలన్నింటినీ జోకొట్టి నిదురపుచ్చుతూ తాను మాత్రం మెలకువగా ఉండే ఆ అందగాడు, గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు. దుఖాలు అనేవి ఎరుగని మహాత్మునికి పశువుల కాపరుల ఇంట పుట్టి బాధలలో పెరుగవలసిన స్థితి వచ్చింది; కర్మలనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించే విష్ణువు జాతకర్మలు చేయించుకున్నాడు; తానే జగత్తుకు తల్లితండ్రి అయి తల్లిపాలు ఎరుగనివాడు నేడు యశోదాదేవి చనుబాల రుచి మరిగాడు. పెరుగుట తరుగుట అనేవి యెరుగని పరబ్రహ్మము ఈనాడు యశోద ఒడిలో పెరగసాగాడు. ఎన్ని తపస్సులు చేసినా పండని బంగారుపంట నేడు గోపకుల వ్రేపల్లె వాడలో కన్నులపండువగా పండింది. ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరాని ఆ పరమార్ధం అందాలుచిందే బాలుని అవయవా లన్నింటిలోనూ అభివ్యక్తం 
కాసాగింది.  చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేస్తూ క్రొత్త క్రొత్త లీలలు ప్రకటించే టప్పుడు సృష్టికర్త యైన బ్రహ్మదేవుడివలె ప్రకాశిస్తాడు. సంతోషం నిండిన చూపులతో ఉన్నప్పుడు విష్ణువువలె కనిపిస్తాడు. కోపంవచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రునివలె భయం గొలుపుతాడు. ఆనందంతో తన్మయుడు అయినప్పుడు పరబ్రహ్మములాగా గోచరిస్తాడు. ఈవిధంగా ఎన్నోరీతులతో బాలకృష్ణుని బాల్యం గడుస్తున్నది.అప్పుడు . . .నందుడు తాను కొడుకును కన్న సంబరంలో రోహిణీదేవిని పిలిపించాడు రంగురంగుల చీరలను ఆభరణాలను బహుకరించి గౌరవించినాడు. ఆమె చాలా సంతోషించింది.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.