శ్రీ కృష్ణావతారం 6

శ్రీ కృష్ణావతారం 6

దేవకీవసుదేవులపూర్వఙన్మ

ఇలా దేవకీదేవి విన్నవించగా, విష్ణుమూర్తి “అమ్మా! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో “పృశ్ని” అనే మహాపతివ్రతవు నువ్వు, అప్పుడు “సుతపుడు” అనే ప్రజాపతి వసుదేవుడు. మీరిద్దరు సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహా తపస్సు చేసారు. ఇంద్రియాలను జయించారు. గాలి, వాన, ఎండ, చలి మొదలైన వానిని సహించారు. ఏకాంతగా ఉంటూ ఆకులు అలములు తిని తీవ్రమైన తపస్సు చేసారు. అలా పన్నెండువేల దివ్యసంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు కాంతివంత మైనాయి. అలా నిష్ఠగా నా నామజపం చేయగా నా తత్వాన్ని సమీపించగలిగారు. నన్ను బహునిష్ఠగా పూజించారు. అప్పుడు నా సత్యరూపదర్శనం ఇచ్చి, మంచి వరాలు కోరుకో మన్నాను. అప్పటికి మీకు పిల్లలు లేరు. అయితే ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవహించింది. కనుక మోహంతో తిరుగులేని మోక్షం కోరుకోకుండా నాతో సాటి యైన కొడుకును ప్రసాదించ మని వరం కోరుకొన్నారు. నేను మెచ్చి అలాగే వర మిచ్చాను. నా సాటి వేరొకడు లేడు కనుక నేనే మీకిద్దరికి “పృశ్నిగర్భుడు” అనే పేరుతో కొడుకుగా పుట్టాను. రెండవ జన్మలో మీరు "అదితి", "కశ్యపుడు" అనే పేర్లు గల ప్రసిద్ధ మైన దంపతులు. అప్పుడు నేను మరుగుజ్జు రూపంతో "వామనుడు" అనే పేరుతో మీకు జన్మించాను. పూర్వం నేను చెప్పనట్లుగానే మూడవ జన్మలో ఇప్పుడు మీ దంపతులకు పుత్రుడుగా జన్మించాను. ఇకపై మీ యందు నాకు పుట్టుక లేదు. నన్ను మీరు కుమారుడని తలచుకుంటు ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన దర్శనం వలన పరమానంద స్వరూపుడైన "పరబ్రహ్మము" నేనే అని అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతర స్మరణ వలన నా అద్భుతమైన లోకాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇకపై మీరు జన్మ ఎత్తరు."

కృష్ణుడు శిశురూపియగుట

ఈ విధంగా చెప్పిన పిమ్మట విష్ణుమూర్తి ఆ బృహద్రూపాన్ని విడిచి పెట్టాడు. పరీక్షిన్మహారాజా! ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పిన పిమ్మట. దేవకీవసుదేవులు ఆశ్చర్యచకితులై కన్నార్పకుండ చూస్తుండగా హరి, మాయను ఆవరింపజేసుకొని ఆ దివ్య రూపాన్ని వదలి, అప్పుడే పుట్టిన పసిబిడ్డ రూపం ధరించాడు. కేరుకేరు మనడం లాంటి కొన్ని వేడుకలు చేసాడు.

 కృష్ణుని వ్రేపల్లెకుతరలించుట

అప్పుడు వసుదేవుడు తాను చేయ వలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. కనుక. పరీక్షిత్తు మహారాజా! అప్పుడు శిశురూపి అయిన విష్ణుని తీసుకొని, పురిటిల్లు దాటించి త్వరత్వరగా తీసుకుపోవాలని గ్రహించాడు. అదే సమయంలో వ్రేపల్లె లోని నందుని భార్య యశోదాదేవి యోగమాయను ఆడబిడ్డగా ప్రసవించింది. ఆ సమయంలో అప్పుడు, వసుదేవుడు పసిబిడ్డను చక్కగా చేతులతో ఎత్తుకొని, రొమ్ముకు అడ్డంగా హత్తుకొన్నాడు. చప్పుడు చేయకుండ మెల్ల మెల్లని అడుగలు వేస్తూ, గభాలున కావలి వాళ్ళు ఉండే ఆవరణ దాటాడు. చటుక్కున పురిటిల్లు నుంచి బయట పడ్డాడు.
అక్కడ, వ్రేపల్లెలో. అక్కడ, నందుడి భార్య యశోదకి యోగమాయ చక్కగా పుట్టింది. వెంటనే ఆ వ్రేపల్లెలో ఊరివారిని, కావలివారిని అందరిని విష్ణుమాయ ఆవరించి చిత్రమైన మైకం కమ్మింది. వసుదేవుడు పురిటింటిని దాటి, తప్పటడగులు వేస్తూ చడి చప్పుడు కాకుండా వస్తున్నాడు. విష్ణుమాయ వలన కాళ్ళకి చేతులకి ఉన్న ఇనపగొలుసులు, సంకెళ్ళు అతుకులు వీడి ఊడిపోయాయి. ఆ మహామహిమాన్వితుని సంకల్పానికి అడ్డు రాలేక తలుపుల తాళాలు కీళ్ళు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకొన్నాయి. వసుదేవుడు మెల్ల మెల్లగా ముందున్న చావళ్ళు అన్ని దాటాడు. అక్కడెక్కడా దాక్కుందా మన్నా ఏమి లేని తిన్నని పొడుగైన చావళ్ళు. అయినా శ్రీహరి మాయ వలన ఎవరు చూడలేదు. వసుదేవుడు ఇలా చావళ్ళు దాటుతుంటే ఆదిశేషుడు ఆ ద్వారాలని మూస్తూ వెనువెంట వస్తున్నాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులా పట్టి వెనుకనించి ఎలాంటి ఆపద రాకుండా కాస్తూ అనుసరిస్తున్నాడు. వసుదేవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. శూరుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తు యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నల్దిక్కులను కమ్ముకుంటు ప్రవహిస్తూ ఉన్న, ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, ఆ శిశు రూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి యిచ్చింది.

 శయ్యననుంచుట

ఇలా వసుదేవుడు యమునానదిని దాటి వెళ్ళి, హుటాహుటిని నందుని వ్రేపల్లెను ప్రవేశించాడు. అక్కడ మందలోని గొల్లలందరు ఒళ్ళుతెలియని అతిగాఢమైన నిద్రలో ఉన్నారు. వారికి చెప్పడం ఇష్టంలేని వసుదేవుడు తిన్నగా ఎప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవి శయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె కూడ మైమరచి నిద్రపోతోంది. తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను జాగ్రత్తగా పరుండబెట్టి. ఆమె పక్కలోని ఆడపిల్లని ఎత్తుకొని వెనక్కి బయలుదేరాడు. తాత్సారం చేయకుండా వేగంగా తిరిగి వచ్చి దేవకీదేవి పక్కలో చక్కగా పడుకోబెట్టాడు. శూరసేనుని కొడుకైన వసుదేవుడు మనసులో తడబడుతు కాళ్ళకి సంకెళ్ళు తగిలించుకొన్నాడు. అతడు “ఏమి తెలియని వాడిలా, బెదిరిపోతున్న వాడిలా, ఒదిగి ఒదిగి పోతూ, శరీరం వణుకుతున్న వాడిలా” గడుసుగా నటిస్తూ ఉన్నాడు. మహారాజా! పరీక్షిత్తూ! ఆ పద్మాల లాంటి కళ్ళున్న నల్లనయ్యను తీసుకురావడంకాని, తన కూతురును తీసుకుపోవడంకాని ఏమాత్రం ఎరుకలేకుండా యశోదాదేవి మైమరచి కమ్ముకు వచ్చిన నిద్రమైకంలో ఆ రాత్రంతా ఉండిపోయింది. (పద్మాల్లాంటి కళ్ళున్న ఆ యశోదాదేవికి అలాంటి కళ్ళున్న కొడుకు)
అక్కడ మథురలో, అప్పుడు, కారాగారంలో పసిపిల్ల కేరుకేరుమని ఏడ్చింది. ఆ శబ్దం విన్న కావలివారి విష్ణుమాయ వీడిపోడంతో వెంటనే మేల్కొన్నారు. లోపలికి తొంగి చూసారు. తాళాలు అవి మామూలుగా ఉన్నాయని స్థిమితపడ్డారు. వెంటనే కంసుడి దగ్గరకు పరుగెట్టుకొని వెళ్ళి, "దేవకి ప్రసవించింది. తొందరగా ర"మ్మని పిలిచారు. అతడు గాబరాగా మంచం దిగాడు. వెంట్రుకలు చిందర వందరగా వేళ్ళాడుతున్నాయి. పై పంచె నేలమీద జీరాడుతోంది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభిస్తోంది. తీరని శత్రుత్వంతో, వాడు పురుటింటికి పరుగుపెట్టాడు. పసిపాపని చంపేద్దామని దగ్గర కెళ్లాడు.

 దేవకి బిడ్డను విడువ వేడుట

అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.

అప్పుడు, చెల్లి దేవకి అన్న కంసుడికి అడ్డం వచ్చి ఇలా అంది. "ఓ అన్నా కంసా! శాంతించవయ్యా! ఇది నిన్ను సంహరించే మేనల్లుడు అయ్యే మగపిల్లవాడు కాదు. ఈమె ఆడపిల్ల నీకు మేనకోడ లవుతుంది. ముద్దు జేయుమయ్యా! ఆడవారిని చంపుట క్షత్రియమర్యాదలకు తగిన పని కాదు కదయ్యా! కోపాన్ని చల్లార్చుకొని మహాత్ములు నడచే దారిలో నడువవయ్యా! మంచి కీర్తిమంతుడవుగా జీవించవయ్యా! నేను నీ సోదరి నయ్య! నిన్ను శరణు వేడుతున్నానయ్యా! ఈ పిల్లను వదిలెయ్యవయ్యా!
అయ్యో! ఇప్పటికే పసిబిడ్డలైన ఆరుగురు కొడుకుల్ని చంపేశావు కదయ్యా! ఇదేమో ఆడపిల్ల కదా, నీ మేనకోడలు కదా ఎందుకని చంపాలయ్యా? అన్నా! మరీ దయలేని వాడవైపోయావయ్యా! కరుణ చూపి వదిలిపెట్టవయ్యా! నా కొడుకు నీ ప్రాణానికి శత్రువు అని విన్నావు. అందుకు చంపేవు. సరే! నేను కొడుకుల్ని ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ కూతుర్నైనా నాకు వదలిపెట్టి పుణ్యంకట్టుకోరాదా?”



 మాయమింటనుండిపలుకుట

ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతి పడి, విలపిస్తూ, పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, జారిపోతున్న పైట సర్దుకొంటు, పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి, పైటకొంగుతో చటుక్కున పిల్లని కప్పింది. పసిపిల్లేమో గట్టిగా ఏడిచింది. వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు, లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు. కన్నుమిన్ను కానని కావరంతో చిన్నారిపాప కాళ్ళు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడ్చింది. అయినా లెక్కచేయక నేల మీదకి విసిరి కొట్టాడు. కాని పాప నేలమీద పడలేదు. రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతాపుష్పాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది. గద, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే ఎనిమిది ఆయుధాలు ఎనిమిది చేతులలో చక్కగా ధరించి ఉంది. విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్ధులు, చారణులు, కిన్నరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవ గణాలు ఆమెకు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ, ఆకాశంలో కనబడి, కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది. "దుర్మార్గుడా! తెంపరితనంతో దేవకీదేవి బిడ్డలను వరసపెట్టి ఆరుగురిని వధించావు. అంతటితో శాంతించక పసిబిడ్డను ఆడపిల్లను నన్ను విసిరి కొట్టావు; ఛీ!ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే మహా వీరుడు ఒకడు నాతో పాటే పుట్టి మరో చోట గొప్ప గౌరవాలు పొందుతున్నాడులే."ఇలా హెచ్చరించి అదృశ్యమైంది. ఆ దేవి భూలోకంలో అనేక చోట్ల ప్రజలచే పూజింపబడుతున్నది. ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరుతో ఒక్కో మహాగుణం ప్రధానంగా వివిధ నామాలతో విలసిల్లుతూ ఉన్నది. ఏ ఊరైనా, ఏ పేరైనా రక్షించడమే ఆమె ముఖ్య లక్షణమై ఉంటుంది. అప్పుడు ఆ యోగమాయ పలుకులు బాణాలై చెవులో దూరి కలతపెట్టాయి. అతడు ఉలిక్కిపడ్డాడు. చెదరిన మనస్సుతో బాగా భయపడ్డాడు. దుఃఖంతో కుంగిపోతున్న దేవకీవసుదేవులను పిలిపించి, ఆదరించి, గౌరవించాడు. దగ్గరకు చేరి వారితో ఇలా అన్నాడు.
"శాంతమూర్తులారా! మహాపాతకుడను. నేను బయలు మాటలు నిజమని నమ్మి బ్రహ్మహత్య చేసే పాతకుడులా మీ పురిటి కందులను చంపాను. బంధువులపై కత్తిగట్టిన దుష్ట బుద్ధిని. క్రోధం నా కళ్ళుకప్పివేసింది. నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. మహాక్రూరుడిని. మహాపాపిని. నా తప్పులు, పాపాలు లెక్కించకుండ దయాస్వభావంతో నన్ను కరుణించి క్షమించండి. వారి వారి కర్మలే జీవులను నడిపిస్తుంటాయి. అలా వారి కర్మలే కారణంగా, ఎన్నోరకాల జీవులు వారికి అనుకూలమైన దేహాంతో ఒక్కొచోట జన్మిస్తారు. అందరు తలోవైపునుంచి వచ్చి ఒకచోట చేరతారు, జీవిస్తారు, ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. ఈ రాక పోకలలో చిక్కులు పడుతుంటారు. ఒకచోట ఏర్పడిన స్నేహాలు అక్కడ వదలి వెళ్ళిపోతారు. ఇలా ఉండగా, చంపేవాడు ఎవడు? చనిపోయేవాడు ఎవడు? మీ బిడ్డలను చంపినవాడను నేను కాదు. వారు నాచే చంపబడ్డవారు అనటం కూడా సరి కాదు. ఇంక ఒకరి నేరాలొకరు ఎంచడం ఎందుకు? తాను శత్రువులను బాధించానని. తన్ను శత్రువులు బాధించారని అమాయకుడు మాత్రమే అనుకుంటాడు. సత్యం తెలుసుకొని ఆలోచిస్తే, ఆత్మకు స్నేహ విరోధాలు అంటూ లేవు. ఆ శత్రుత్వ మిత్రత్వాల మధ్య సంబంధం కేవలం తమ కర్మల బంధం మాత్రమే సుమా.” కంసుడు ఇలా పలికి, దుఃఖించి, కన్నీరు పెట్టుకున్నాడు. బెదురు బెదురుగా దేవకీవసుదేవుల కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు. వారి సంకెళ్ళు ఊడదీయించాడు. చాలా ప్రేమ కురిసే మాటలతో ఐకమత్యాలు చూపించాడు. వారు కూడ పశ్చాత్తాపం పడుతున్న కంసుని చూసి శాంతించారు. అప్పుడు వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు.
"బావా! కంసమహారాజా! నీవు చెప్పిన మాట నిజమే సుమా! ప్రాణు లందరు అహంకారంచేత ఙ్ఞానాన్ని నష్టపోతారు. లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దుఃఖం, ఆవేశం మొదలైనవాటికి లోనై నువ్వా, నేనా అంటు ఒకరినొకరు వధించుకుంటూ ఉంటారు. అంతేగాని, ఉన్నది పరమాత్మ ఒకడే అనీ, అతనే అనేక రూపాలలో ఉంటాడని తెలుసుకోలేక, ఇతరులు వేరు తాము వేరు అనుకుంటూ భ్రాంతిలో పడుతూ ఉంటారు."

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.