సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు
🙏సుదర్శనం ధరించే 16 ఆయుధాల వివరాలు🙏
కుడివైపు పైనుంచి వరుసగా చక్ర, పరశు, కుంట, దండ, అంకుశ, అగ్ని, నిస్త్రింశ, శక్తి; కాగా వామహస్తాలలో పైనుంచి క్రమంగా పాంచజన్య, శార్ జ్గ, పాశ, సీర, వజ్ర గధ, ముసల, త్రిశూల ఆయుధాలు. శత్రుశంహారం కోసం కృష్ణుడు ప్రయోగించిన సుదర్శనాయుధానికి సంబంధించిన ఆసక్తికరమైన కథలు చాలా ఉన్నాయి.
గజేంద్రమోక్షంలో మకరసంహారం; శిశుపాలవధ, జయద్రధ సంహారం కోసం కృష్ణుడు సుదర్శనాన్ని సూర్యునికి అడ్డుపెట్టిన సందర్భం, అంబరీషుని దగ్గర అహం ప్రదర్శించిన దుర్వాసుని తరిమిన సందర్భం, పౌండ్రకవాసుదేవ సంహారం మొదలయిన ఘట్టాలలో సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఈ గాథలన్నీ సుదర్శనం గొప్పతనాన్ని వెల్లడిస్తాయి.
తమిళనాడు – త్రిప్లికేన్ (తిరువళిక్కేణి) చెన్నైలోని పార్థసారధి స్వామి వారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ సందర్భాన వర్దరాజ పెరుమాళ్ళు మకర సంహారార్థం సుదర్శనాన్ని ప్రయోగించే భంగిమ నేటికీ బ్రహ్మోత్సవాల సందర్భాన ప్రదర్శితమౌతుంది.
కూరనారాయణా జీయర్ స్వామి వారు ఓ గొప్ప సుదర్శన భక్తుడు. వారు ప్రసిద్ధమైన సుదర్శనశతకాన్ని సంస్కృతంలో రచించారు.
శ్రీరంగంలో తిరువాయ్ మొళిని పాడే ఓ వ్యక్తి ఒకానొకప్పుడు ‘ కంఠమాల ‘ అనే జబ్బుతో చాల బాధపడుతుంటాడు. ఆయన సుదర్శనాళ్వారును అతడి జబ్బును నయం చేయమని ప్రాథిస్తారు. ఆ సందర్భాననే కూరనారాయన స్వామి వారు సుదర్శన శతకాన్ని రచించాడని చెబుతారు.
శ్రీనాథకవిసార్వభౌముడు భీమేశ్వరపురాణంలో పంచాయుధాలను గొప్పగా వర్ణించారు.
నరకాసుర సంహార సందర్భాన నరకుని చేతులు సుదర్శనం బంధిస్తుంది. బాణాసురవధలో కృష్ణుడు సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. తిరువయ్ మోళిలోని (4-1-8) పాశురంలో పెరియాళ్వారు జయద్రధ సంహారంలో సుదర్శనపాత్రను అభివర్ణించారు.
కొన్ని దేవస్థానాలలో ప్రత్యేకించి సుదర్శన సన్నిధులు కూడా ఉన్నాయి. తిరుక్కోవలూరు, తిరుమహీంద్రపురం,తిరుక్కుడందై (కుంభకోణం), కందియార్, శ్రీవిల్లిపుత్తూర్, వానమామలై, ఆళ్వార్ తిరునగరి, తిరుక్కురునంగుడి,శ్రీరంగము, వరదరాజపెరుమాళ్ కోయిల్, కాంచీపురం తిరుమోగూర్ లలోని దేవస్థానాలలో సుదర్శన సన్నిధులు ఉన్నాయి.
చక్రం ప్రగతికి చిహ్నం, ప్రగతికి సాధనం. ప్రపంచం సర్వత్రా చక్రమే కనిపిస్తుంది మనకు. ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వులు గ్రహించారు. వారు “తతశ్చక్ర మయం సర్వం జగత్ స్థావర గంగమం” అని తెలియ చేశారు. సర్వ ప్రపంచమంతా చక్రమయమే. అట్టి చక్రం మహావిష్ణుస్వరూపం. ఈ అంశాన్ని కూడా మనపెద్దలు ఇలా తెలిపారు.
*చక్రాంభోజే సమాసీనం*
*చక్రాధ్యాయుధ ధారిణం*
*చక్రరూపం మహావిష్ణుం*
*చక్ర మంత్రేణ చింతయేత్;
-సౌలభ్యచూడామణీస్తోత్రం
సుదర్శనవాజ్ఞ్మయం చాల ఉంది. అయితే అది చెల్లాచెదురుగా మరుగున ఉంది. నేడున్నా కొందరు మహనీయులు సుదర్శనోపాసకులు ఉన్నారు. వారి దగ్గర సుదర్శన వాజ్ఞ్మయం లభిస్తుంది. తెలియవచ్చినంతలో సుదర్శన వాజ్ఞ్మయాన్ని నామమాత్రంగా ప్రస్తావించు కుందాం. “సుదర్శనవాద:” అనే గ్రంథాన్ని వేదాంతదేశిక విహారసభా,పరకాలమఠం – మైసూరువారు ప్రచురించారు. చెన్నైలోని అడయార్ లైబ్రరీ 2 గ్రంథలిపిలో “సుదర్శనమీమాంస” అనే బృహత్ గ్రంథం ఉంది. సుదర్శనోపాసకులయిన కూరనారాయణజీయరుస్వామివారు “సుదర్శన శతకాన్ని” 101వృథ్వీవృత్తాలలో సంస్కృతంలో రచించారు. ఈ శతకంలో సుదర్శనజ్వాల 24, నేమి 14, ఆర్ 12, నాభి 11, అక్షం 13,పురుష 26 మొత్తం 100 శ్లోకాలు ఉన్నాయి. బీజక్షర సంపుటితమైన ఈ సోత్రశతకానికి సంస్కృతాంధ్రాలలో వ్యాఖ్యానాలు వెలూడ్డాయి.
ఉభయ వేదాంత సభ వారు శ్రీసుదర్శన శతకాన్ని వెలువరించారు. దానితోపాటు కొన్ని సుదర్శన స్తోత్రాలు కూడా చేర్చారు. వేదాంతదేశికులవారు కూడా ఒక సుదర్శనశతకం రచించినట్లు తెలుస్తుంది. దానికి కూడా వ్యాఖ్య రచించబడిందట. దానిని ఖగేంద్రాచార్యగారి సంపాదకత్వాన హజారిమల్ సోమాని స్మారకట్రస్ట్ –బొంబాయివారు 1967 దేవనాగరిలో ప్రచురించినట్లు సమాచారం ఉంది. కుంభకోణంలోని గోపాలవిలాస ప్రెస్ లో కూడా భారద్వాజ గోపాలచార్య, శ్రీనివాసగోపాల తాతాహార్య వివరణ వ్యాఖ్యానాలతో వేదాంత దేశికులవారి సుదర్శనశతకం ప్రచురించినట్లు తెలుస్తోంది.
సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలు రెండు లభిస్తున్నాయి. సుదర్శన సహస్రనామ స్తోత్రం, హేతిపుంగవస్తవ:, సుదర్శనషట్కం, సుదర్శనాష్టకం, సుదర్శనకవచం, షోడశాయుధస్తోత్రం, అంబరీషకృత సుదర్శన స్తోత్రం, సౌలభ్యచూడామణిస్తోత్రం, చక్రరాజమంగళం, అపరాధస్తవం మొదలయినవి సుదర్శన స్తోత్రవాజ్ఞ్మయానికి సంబంధించిన రచనలు. ఇవికాక ఇంకా ఉన్నాయి.
సుదర్శన షడక్షరమంత్రం, సుదర్శనా ష్టాక్షరీమంత్రం, సుదర్శన నారసిమ్హ మంత్రం, సుదర్శన నరసింహ మంత్రం (మరోపత్థతి), జ్వాలా సుదర్శనం, ఆత్మరక్షాకర సుదర్శనం, పరవిద్యాభేదన సుదర్శనం, అస్త్రమంత్రసుదర్శనం,సుదర్శన హృన్మంత్రం, ఆకర్షణ సుదర్శనం, సుదర్శానమాలామంత్రం, మొదలయినవి మంత్ర శాస్త్ర సంబంధితాలు. సాధకులు నియమనిష్ఠలతో ఆయా మంత్రాలను అనుష్టిస్తే, ఆయా ఫలితాలు ఉంటాయని పరంపర విశ్వాసం. ఇక సుదర్శన యంత్రమును బహువిధాలుగా వినియోగిస్తుంటారు. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి.
జ్యోతిశ్శాస్త్రరీత్యా గ్రహపీడ కలిగిన వారు ఆయా గ్రహాలను పూజించి నవగ్రహాది జపాలను చేస్తుండటం అద్వైతాది మతాలలో కనిపిస్తుంది. అయితే విశిష్టాద్వైతులు మాత్రం ఆయా బాధల నివారణార్థం సౌలభ్య చూడామణి స్తోత్రం,సుదర్శన కవచం, సుదర్శనశతకం, సుదర్శన నారసింహం, సుదర్శనాష్టోత్తర శతనామస్తోత్రాలను జపించటం,పారాయణం చేయటం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ సంప్రదాయ పూర్వ వర్తమాన పంచాంగాలను పరశీలిస్తే కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. అందుకే కేవల విశిష్టాద్వైత సంప్రదాయ దేవాలయ పరిధులలో నవగ్రహాది ప్రతిష్టలు కానరావు, సుదర్శన ప్రతిష్టలు దర్శనమిస్తాయి. సుదర్శన విగ్రహాలకు ముందువైపు సుదర్శనుడు దర్శనమివ్వగా వెనుకవైపు నారసింహుడు దర్శనమిస్తాడు.
దుర్మాంత్రికుల బెడదను నివారించేందుకు శ్రీరంగ క్షేత్రంలో శీసుదర్శన నారసింహమూర్తి ప్రష్టించబడిందని పెద్దలమాట. నేడు కూడా శత్రుభయ నివారణార్థం సుదర్శన నారసింహ మంత్రాన్ని పారాయణం చేయటం ఉంది.
పరవిద్యాభేదనం,వశీకరణం, ఆకర్షణం, సంమోహనం అనే పేరుతో లభిస్తున్న వివిధ సుదర్శన మంత్రాల ప్రయోజనం, వాటి పేరే సూచిస్తున్నాయని వేరుగా చెప్పనవసరం లేదు. చక్రాంకనం కానివాడు శ్రీవైష్ణవుడే కాదు అని విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథాలు తెలుపుతున్నాయి.
సర్వపీడానివారణకూ,సర్వఫలప్రదాలకూ సుదర్శన చక్రరాజ మహామంత్రం మహోన్నతమైనదని మహనీయుల మాట. మంత్రశాస్త్రంలో చక్రషట్కం (ఆరుచక్రాలు) చెప్పబడింది. అవి కాలచక్రం,పురుషచక్రం, ప్రకృతిచక్రం , మహాచ్చక్రం, అహంకార చక్రం జగచ్చక్రం.
ఏదైనా బాగా జరుగుబాటు వుండె చక్రం బాగా తిరుగుతూ ఉందని అంటుంటాం. జరుగుబాటు లేకుంటె చక్రం ఆగి పోయిందని అంటుంటాం. అంటే మనకు తెలియకనే మన జీవితచక్రంలో చక్రం చోటు చేసుకుంది.
భీజాక్షరసంపుటితమైన మహా సుదర్శన మంత్రాన్ని నియమనిష్ఠలతో గురుముఖత: అభ్యసించి జపిద్దాము,సుదర్శనమంత్రాని పూజిద్దాము. “సర్వ ధర్మే నిధనం శ్రేయ: పరధర్మోభయావహా:” అనే గీతాచార్యుని ఉందేశం అనుష్ఠేయం కదా!
మంగళం చక్రరాజాయ
మహనీయ గుణాబ్దయే
పద్మనాభ కరాంభోజ
పరిస్ఖారాయ మంగళం||జాలాజ్వాలా విభూషాయ
సహస్రాదిత్య తేజసే
సర్వాఘ హరినే విష్ణో:
చక్రరాజాయ మంగళం||
*శాంతాకారం భుజగశయనం – పద్మనాభాం సురేశం*
*విశ్వాకారం గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం,*
*లక్ష్మీకాంతం కమలనయనం – యోగిహృద్ద్యానగమ్యం*
*వందే విష్ణుం భవభయహారం – సర్వలోకైకనాథం ||*
🙏జై శ్రీమన్నారాయణ 🙏
కామెంట్‌లు