శ్రీ కృష్ణావతారం 15

శ్రీ కృష్ణావతారం 15

కృష్ణుని రోలుకి కట్టుట
యశోద ఇలా శ్రీకృష్ణబాలుడి వెంటపడి, కృష్ణబాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరక్కుండా పరిగెడుతున్నాడు; “ఈ ఒక్కసారికీ క్షమించవే! ఇంకెప్పుడూ దొంగతనం చేయనే!” అంటూ మునుముందే ఏడుస్తున్నాడు; కాటుక చెదిరేలా కళ్ళు నులుము కుంటున్నాడు; కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు; తన తల్లి ఎటువైపు నుంచి వస్తుందో అని బెదురుతూ మాటి మాటికీ క్రీగంట చూస్తున్నాడు, పక్కలకు తప్పుకుంటున్నాడు; చివరికి ఎలాగైతేనేం వెంటబడి తరుముతున్న యశోద “అమ్మయ్య! ఈ చిన్ని వెన్నదొంగచిక్కాడు.” అంటూ భుజం పట్టుకుంది; కానీ ఆమెకు కొట్టటానికి చేతులు రాలేదు, యశోద శరీరము, స్వభావము కూడా పువ్వువలె సుతిమెత్తనైన పూబోడి కదా; కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టివేద్దా మనుకుంది; యశోదాదేవి కృష్ణునితో ఇలా అంది. ఓహో ఎవరండీ వీరు? శ్రీకృష్ణులవారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడనే చూడలేదట కదా! దొంగతనమంటే ఏమిటో పాపం తెలియదట కదా! ఈ లోకంలో ఇంతటి బుద్ధిమంతులు లేనేలేరట!
పట్టుబడ్డ వెన్నదొంగను కొట్టటానికి చేతులురాని తల్లి యశోదాదేవి కొడుకును ఇలా దెప్పుతోంది. పట్టుకుందామంటే ఎవరికీ చిక్కనని అనుకుంటున్నావా. పట్టుకోవాలని నేను పట్టుబడితే నువ్వు దొరకటం పెద్ద కష్టం అనుకుంటున్నావా. నువ్వు చిక్కవు అని అందరూ అంటారు. నిన్ను పట్టుకోడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదురా.”
అసలు తత్వం కూడా ఆ మహాతల్లి యశోదమ్మ నోట అంతరార్థంగా ఇలా బయటబడుతోంది. కన్నా! ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. ఒకచోట కుదురుగా, బుద్ధి కలిగి ఉండవు కదా. నీకు పద్ధతి ప్రకారం ఉండటం అంటూ లేదా ఏమిటి? ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు ఎన్నివేషాలైనా వేసి, ఎక్కడికైనా పోతావురా కొడుకా!
ఇలా యశోదాదేవి తన కొడుకు కృష్ణుని దెబ్బలాడుతూంటే కూడా తత్వమే కనబడుతోందిట. “భగవంతుడవు సర్వాంతర్యామివి, ఎక్కడైనా తిరుతావు. గుణాతీతుడవు, నీవు బుద్ధికలిగి కూర్చోడం ఏమిటి? సర్వోన్నతుడవు నియమాలు ఎవరు పెట్టగలరు? ఈ ఎరుక మరచి ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు. మిత్రులు, శత్రులు మొదలైన అనేకంగా కనిపిస్తావు కదయ్యా!” . . . అవును ఆత్మావైపుత్రా అంటారు పెద్దలు. ఒరే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్స్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరపర్వతాన్ని ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రాజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకఱ్ఱ పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా). ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.
చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి." ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతూ.......ఇలా యశోద అవతార రహస్యాలు ఎత్తుకుంటూ దొంగకృష్ణుని ఎత్తిపొడిచి,
అతనిని ఒక రోలుకి కట్టేసింది. ఆ దుడుకు పిల్లాడు వెన్నదొంగిలించటమనే క్రీడ కలవాడు, సంతోషాలు పంచుతూ గలగలా మాట్లాడు వాడు. తల్లి తనను కట్టిసినందుకు ఆశ్చర్యపోతున్నట్లు కనబడుతున్న గొల్లపిల్లాడు. ముత్తెపుబొట్టు నుదుట అలంకారంగా మెరుస్తున్న వాడు.పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు. పరీక్షిన్మహారాజా! బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండే వాడు గనుక తను రోటికి కట్టిబడిపోయి ఉన్నాడు. దానికి అతడు ఏమాత్రం బిక్కమొగం వేయలేదు. పైగా కట్టుకొయ్యకు కట్టబడిన గున్న ఏనుగు వలె హుందాగా వెలిగిపోతున్నాడు.యశోదాదేవి తన చిన్నికృష్ణుడు కూడా అందరి లాంటి బాలుడే అనుకుంది గనుక అతణ్ణి కట్టగలిగింది; అలాకాక, అనేకమైన బ్రహ్మాండాలు ఆ బాలుని కడుపులో ఉంటాయని తెలిస్తే ఆ తల్లి కట్టేయదు కదా? ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.
ఇలా తన ముద్దుల కొడుకును కట్టటానికి ఒక త్రాడు తెచ్చి నడుం చుట్టూ చుట్టబోయింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరో త్రాడు జతచేసినా అదే 2 అంగుళాలు తక్కువైంది. మరొక్క త్రాడు ముడేసినా అంతే తక్కువైంది. ఇలా....ఆ యమ్మ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ వరుసగా కలిపినా అంతే వెలితి ఉండిపోయింది. ముజ్జగములూ దాగి ఉన్న ఆ చిరుబొజ్జను కట్టటం ఎవరి తరం? ఆప్పుడు ఆ వింతను, పిల్లాణ్ణి చూసి యశోదా, గోపికలూ నివ్వెరపోయారు. పిమ్మటపడుతున్న శ్రమకు యశోద శరీరమంతా చమటలు పట్టాయి. కొప్పు వదులైపోయి పువ్వులు రాలిపోయాయి. అలా కట్టటానికి శక్యంకాని తనను కట్టాలనే పట్టుదలతో తల్లి పడుతున్న తంటాలు చూసి నల్లనయ్య జాలి పడి......ఓ పరీక్షిన్మహారాజా! భగవంతుడు, భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు అయిన కృష్ణబాలుడు కన్నతల్లి కష్టం చూడలేక అలా త్రాడుకి కట్టుపడిపోయాడు; అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు గదా! ఆయనతో ప్రియమిత్రుడై మెలగే శంకరుడు గానీ, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకొని ఉండే లక్ష్మీదేవి గానీ, ఆయన కొడుకును అని ఉప్పొంగిపోయే బ్రహ్మదేవుడు గానీ శ్రీకృష్ణుని వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయారు.
భక్తులకు పట్టుబడినట్లు భగవంతుడు జ్ఞానులకు గానీ, మునులకు గానీ, దాతలకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! తల్లి యశోదాదేవి కొడుకు కృష్ణుని అలా రోటికి కట్టివేసి, ఇంట్లో పనులు చేసుకోవటంలో మునిగిపోయింది. నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు నారదుని శాపం వలన చాలాకాలంనుంచి రెండు పెద్దపెద్ద మద్దిచెట్లుగా పడి ఉన్నారు. కృష్ణబాలుడు ఆ మద్దిచెట్ల జంటను చూసాడు. రోలును ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరకు వెళ్ళాడు" ఇలా
శుకబ్రహ్మ చెప్పగా విన్న మహారాజు ఇలా అడిగాడు.

గుహ్యకుల నారద శాపం

"ఓ యోగివరేణ్యా! శుకా! లోకంలోని యోగులందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు. ఆ యక్షులను నారదుడు ఎందుకు శపించాడు; వారికి అలా చెట్లుగా పడిఉండే శాపం రావటానికి వారు చేసిన అపచారం ఏమిటి? ఆ వివరం తెలియజెప్పు వింటాను." అలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పసాగాడు "పూర్వం కుబేరుడి కుమారులు ఇద్దరు నలకూబరుడు, మణిగ్రీవుడు అనేవారు శంకరునికి సేవకులుగా ఉండేవారు, యక్షుల రాకుమారులము, పైగా పరమశివుని అనుచరులము గదా అని అహంకారంతో వారు సంచరిస్తూ ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ వెండికొండమీద ఉద్యానవనాలలో తమ ప్రియురాళ్ళతో కలిసి విహరిస్తున్నారు. ఆ గంధర్వకన్యలు చాలా మనోహరంగా పాటలు పాడుతున్నారు. ఇలా ఆడ ఏనుగులతో కూడిన మదపుటేనుగులులాగా తమ కాంతలతో అందమైన ఆకాశగంగా తరంగాలలో జలక్రీడలు సాగిస్తున్నారు. ఇంతలో ఆ మార్గాన నారదమహర్షి వచ్చాడు. ఆయనను చూసి గంధర్వ కాంతలు గబగబా బట్టలు ధరించారు. మద్యం కైపులో మునిగి ఉన్న నలకూబర మణిగ్రీవులు మాత్రం దిగంబరులుగానే తిరుగుతున్నారు. వారిని చూసిన నారదుడు శపించబోతూ ఒక ప్రసిద్ధమైన గీతాన్ని పాడాడు. దానిని విను; ధనవంతుడు ఎవరినీ లెక్కచేయడు; తన ధనాన్నీ, శరీరాన్నీ, సంసారాన్నీ నమ్ముకుని ఇతరులను హింసించాలని చూస్తాడు; దరిద్రుడు దారిద్ర్యదేవతకు చిక్కి కష్టాలతో బక్కచిక్కినా ఇతరులను హింసించడు; వాళ్ళు కూడా తనలాంటివారే కదా అని భావిస్తాడు; ఇది లోకరీతి; విను, కనుక ధనమదాంధులైన వారికి దరిద్రమే చక్కని కళ్ళు తెరిపించే మందు అవుతుంది;"ఇలా గీతం పాడిన నారదుడు తన మనసులో . ."ఈ యక్షరాజు కుమారులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు; పైగా ప్రేయసులతో కూడి ఉన్నారు. ఇక చెప్పేదేమి ఉంది. వీరికి కొవ్వు అణచి మళ్ళీ సత్పురుషులనుగా మార్చటం సముచితమైన పని." అని తన మనసులో ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం కల నారదమహర్షి నలకూబర, మణికూబరులతో ఇలా అన్నాడు "మీరు స్త్రీఐశ్వర్యమదంతో కొట్టుకుంటున్నారు; కనుక భూమ్మీద వంద దివ్యసంవత్సరాల పాటు మద్దిచెట్లుగా పడి ఉండండి. ఆ తరువాత గోవిందుని పాదారవిందాల స్పర్శ లభించుటచేత; ఈ నా శాప విమోచన అనుగ్రహం వలన, ఆ యశోదానందనుని పాదారవిందస్పర్శతో విముక్తులు అవుతారు; ఆ విధంగా ముక్తులై, శ్రీమన్నారాయణుని భక్తులై సత్ప్రవర్తన యందు ఆసక్తి కలవారై మళ్ళీ దేవలోకంలో ప్రవేశిస్తారు."


శ్రీ కృష్ణుడు మద్దిగవ్వని కూల్చుట

ఇలా శాపమూ విమోచనమూ చెప్పి, నారదుడు నారయణాశ్రమానికి వెళ్ళిపోయాడు: వాళ్ళిద్దరు జంట మద్ది చెట్లుగా భూలోకంలో పక్కపక్కన పడిఉన్నారు, నారదమహర్షి పరమభాగవతోత్తముడు కనుక శ్రీకృష్ణపరమాత్మ ఆయన మాటలను పాటించదలచాడు.ఆ టక్కులమారి ముద్దుకృష్టుడు ఆ రెండు మద్దిచెట్లను కూల్చాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మద్దిచెట్ల జంట దగ్గరకు అమాతంగా ఱోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. దృఢమైన బలము కల ఆ కృష్ణబాలకుడు, తన పొట్టకు కట్టిన త్రాటిని బలంగా ఊపాడు, ఱోలు అడ్డంతిరిగిపోయింది. అతడు చెరచెరా మద్దిచెట్లు రెంటి మధ్యనుండి దూరి ఱోలును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
ఆ కృష్ణబాలుడు అడ్డం పడిన ఱోలుని లాగాడు. దాంతో ఆ జంట మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకలించుంకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి.

గుహక్యలు కృష్ణుని పొగడుట

అలా మొదలంటా కూలిన ఆ జంట మద్ది చెట్లలోనుండి, అగ్నిజ్వాలలు వెలువడినట్లు ఇద్దరు యక్షులు నిద్రమేల్కొన్నట్లు లేచి, దిక్కులు నిండిన తేజస్సులతో ప్రత్యక్ష మయ్యారు. భక్తులందరినీ రక్షించే కృష్ణబాలకునికి వికసించిన జ్ఞానంతో తలవంచి నమస్కారాలు చేసారు. చేతులు జోడించి అతనితో ఇలా అన్నారు. "శ్రీకృష్ణా! నీవు సామాన్య మానవ బాలుడవా? కాదు కాదు. పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేని వాడవు. మహాయోగివి. అన్నిటికీ మొదటివాడవు. అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకూ ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకులు అంటారు.
సకల జీవరాశులకు, పంచభూతములు, చతుర్దశదశ ఇంద్రియములు, అహంకారము, పంచప్రాణములు సమస్తమునకు అధిపతివి; ప్రకృతీ నీవే, దానినుండి పుట్టిన మహత్తూ నీవే; అయినా వీటికి వేటికినీ అందకుండా అన్నిటిపైన ఉండే అధిపతివి నీవే; ప్రకృతి గుణాలు, నీలో ఏమార్పును కలిగించలేవు. నీలోంచే అవి పుట్టుకు వస్తాయి. సృష్టికి పూర్వంనుండి స్వయం ప్రకాశము కలవాడవు. ఇక గుణాలతో ఆవరింపబడినవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలూ లేవు; నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి; వాటిచేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు; శరీరం ధరించిన వీరెవ్వరూ నీ అవతార వైభవాలకి సాటిరారు; నీ రూపాలు వేరు, వీళ్ళరూపాలు వేరు; ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు; కనుక వీళ్ళకి అంతుపట్టవు. అటువంటి పరమపురుష! నీకు నమస్కారం చేస్తున్నాము. ఓ వాసుదేవా! శ్రీకృష్ణా! ఈ లోకాలను అన్నింటినీ సృష్టించడానికీ, రక్షించడానికీ అవతరించావు గదా! నీవు ఈ సమస్తానికి ఈశ్వరుడవు. యోగులు అందరూ నిన్ను దైవంగా వరించారు. నీవు ఈ సృష్టికి శుభాలు చేకూర్చుతావు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నాయి. ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు. ఓ కృష్ణపరమాత్మా! నారదమునీంద్రుల వారు మహాతపస్వి. వారి మాటలు వట్టిపోకుండా అలాగే జరిగింది. వారి శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్నేళ్ళ నుండీ నిన్ను చూడాలనే తపించాము. ఇప్పటికి ఫలించింది. నీవు భక్తులకు పరమ మిత్రుడవు. మమ్ములను నీ శరణాగత భక్తులుగా మన్నించి అనుగ్రహించు. ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు. ఇలా స్తుతిస్తున్న యక్షులు నలకూబర, మణిగ్రీవులతో రోటికి కట్టబడి ఉన్న కృష్ణమూర్తి చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు.
తమతమ ధర్మాలను తప్పకుండా అందరి ఎడల సమత్వంతో ప్రవర్తిస్తూ, నన్ను నమ్మి మెలగుతుండే వారు సజ్జనులు. సూర్యుడు ఉదయించటంతోనే దట్టమైన చీకట్లు తొలగినట్లు; అలాంటివారికి నన్ను చూడగానే బంధాలు విడిపోయి, మోక్షం లభిస్తుంది.
నారదమహర్షి దయాస్వభావి. వారు ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు. మీరు సుజ్ఞానులు అయ్యారు. ఈనాటి నుండీ మీకు నామీద భక్తి చేకూరుతుంది.” ఇలా చెప్పి, “ఇక మీరు మీ లోకాలకు పోవచ్చును” అని కృష్ణుడు అనుజ్ఞ ఇచ్చాడు. యక్షులు “మహాప్రసాదం” అంటూ ప్రదక్షిణలు చేసి, అనేక విధాలుగా మ్రొక్కి, సెలవు తీసుకొని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. ఇంతలో నందుడు మొదలైన గోపకులు చప్పుడు విని, పిడుగు పడిందేమో అని భయపడి వచ్చి కృష్ణబాలునీ, పడిన మద్దిచెట్లనూ చూసారు. “అయ్యో! ఇంత పెద్ద చెట్లు ఇలా కూలిపోతే, ఇలా రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చంటిపిల్లాడు ఎలా బ్రతికి ఉన్నాడో? చూశారా! ఏడవనూ లేదు, భయపడనూ లేదు. ఏం పిల్లాడురా బాబూ వీడు? అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?" అలా పదిమందీ పదిరకాలుగా అపశకునమేమో అనుకుంటూ ఉండగా, అక్కడ ఆడుకుంటున్న గోపకుల అబ్బాయిలు ఇలా అన్నారు.“నందుని కొడుకు అయినట్టి కృష్ణుడు ఈ చెట్ల సందులలోనుంచి ముందు తాను దూరాడు. వెనుక నున్న ఱోలు ఏమో అడ్డంతిరిగింది. గట్టిగా లాగాడు. అంతే! మద్ది చెట్లు ఫెళఫెళ మంటూ కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు.” ఇట్లా యాదవ బాలురు చెప్పగా, కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరి కొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కుమారుడు బ్రతికి బయటపడి నందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన త్రాళ్ళు విప్పాడు. ఆ సమయంలో ఈ విషయం నుండి గోపకుల మనస్సులు మళ్ళించటానికి, లీలా వినోది, కపట మానవ బాలకుడు అయిన కృష్ణుడు. అమాయకపు పిల్లాడిలా పాటలు పాడుతాడు, గోపికాస్త్రీలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే, పరవశుడై కీలుబొమ్మలా చేతులు తిప్పుతూ నాట్యాలు చేస్తాడు. చూడటం తెలియవానిలా జనుల వంక పలకరింపుగా చూస్తాడు. నవ్వుతాడు, తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెప్తే బుద్ధిమంతునిలా చేస్తాడు. తలుపుచాటున దాక్కుంటాడు. మట్టిలో ఆడతాడు.
నందాదుల మనసులు మళ్ళించటానికి ఇలా ప్రవర్తించాడు చిన్నికన్నయ్య.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.