శ్రీ కృష్ణావతారం 14

శ్రీ కృష్ణావతారం 14

చిలుకుతున్న కవ్వం పట్టుట

ఒక రోజు యశేదాదేవి ఇంటివద్ద ఉన్న యువతులు అందరూ వారి పనులమీద వెళ్ళిపోయారు. యశోదాదేవి పెరుగు చిలకడానికి చిలుకు స్తంభం వద్ద కుదురు పెట్టి, దానిమీద పెరుగు కుండను పెట్టింది. తరిత్రాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలు పెట్టింది. అలా యశోదాదేవి పెరుగు చిలుకుతుండగా, ఆమె చేతుల అరుణకాంతులు కవ్వం తాటిపై పడి అది పగడపుతీగలాగ మెరుస్తోంది. తాడును క్రమపద్దతిలో ఒకదాని తరువాత ఒకటి లాగుతుంటే, ఆమె పాలిండ్లు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాలపై ఉన్న కొంగు జారుతోంది. మెడలోని హారాలు చిక్కు పడుతూ కనబడుతూ ఉన్నాయి. పట్టిన చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచుబిందువులు చెందిన తామరపూవు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. చేతుల గాజులు గలగలలాడుతూ ఉన్నాయి. కొప్పుముడి బిగింపు సడలుతూ ఉంది. చెవుల కమ్మల కాంతులు తళుక్కుమంటూ ఉన్నాయి. ముద్దు కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడేపాటకు చెట్లు చిగురుస్తూ ఉన్నాయి. ఇలా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది. యశోద పెరుగు చిలుకుతూ ఉండగా. కృష్ణబాలకుడు ఆమె చుట్టూ తిరుగుతూ, మీద పడుతూ, పైటలాగతూ అల్లరి చేయసాగాడు. “అమ్మా! రావే! నాకు పాలియ్యవే!” అంటూ గంతులు వేస్తూ దగ్గరకొచ్చి, చిన్నారి కన్నయ్య కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు. యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు. కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు..యశోదాదేవి పొయ్యిమీది పాలు దించి వచ్చింది. పగిలిపోయిన పెరుగుకుండ ముక్కలను చూసింది. తుంటరి కొడుకు వెన్న మీగడలు తిన్నాడని గ్రహించి నవ్వుకుంటూ చూస్తే, కొంటె కృష్ణుడు కనిపించలేదు. అతణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది యశోద. ఇంట్లో పెరుగుకుండ పగలగొట్టిన కృష్ణుడు, అక్కడ మరొక ఇంటిలో ఒక రోలుని తిరగేసి, చక్కగా దానిమీద ఎక్కాడు. ఉట్టిమీద ఉన్న వెన్నతీసి బెదురుతూనే ఒక కోతికి పెడుతున్నాడు. యశోదమ్మ వచ్చి అతడు చేస్తున్న ఆ అల్లరి పని చూసింది.


యశోదకృష్ణుని అదిలించుట

కృష్ణుడు కోతికి వెన్న పెడుతూ అల్లరిచేస్తుండటం చూసిన యశోద బెత్తం చేతిలో పట్టుకొని “కన్నయ్యా! నువ్వు ఇప్పటివరకూ ఎవరి చేతికీ చిక్కలేదనీ, నిన్ను ఎవరూ శిక్షించలేరని, ఎవరూ అడ్డుకోలేరని, నిన్ను భయపెట్టరనీ, నీకు అదురూ బెదురూ లేకుండా పోయింది. అందుకే గదా నా మాట బొత్తిగా వినటంలేదు! సరే కానియ్యి! ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను”. అంటూ యశోద కృష్ణున్ని అదలిస్తూ, తన కొడుకు దుడుకుతనం తలచుకుంటూ ఇలా అనుకుంటోంది.. కన్నయ్యని పోనీ పసిపిల్లాడులే అనుకుందామంటే, ఇలాంటి నడవడి పెద్దలకు ఎవరికి తెలియదు; పోనీ ఇతడికి కొద్దిగా భయం చెబ్దాం అనుకుందామంటే, లేకలేక పుట్టినవాడు వీడొక్కడే మరోడు లేడాయె; బెదిరించి బుద్ధులు నేర్పుదాం అంటే, తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడాయె; అలాగనీ ఏమి తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే, వీడు వెళ్ళని చోటు, చూడని చోటు ఏదీ లేనే లేదాయె; తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచనే కూడా వీడికి రాదు; అసలు భయం అన్నదే తెలియదు; మళ్ళీ ఊరికే ఉండడు, ఎకసెక్కాలాడుతూనే ఉంటాడు; వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయటం ఎలా?కన్నయ్యకు బుద్ధి చెప్పటం ఎలా అని ఆలోచించుకుంటోంది. గారాబం మరీ ఎక్కువ చేస్తే పిల్లలు చివరికి చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తుంటే మంచి గుణాలు అలవడతాయి. పిల్లల మితిమీరే అల్లరికి చక్కటి ఔషధం దండోపాయం.
“దండం దశగుణ భవేత్” అంటారు కదా.
“శ్లో.| లాలనాద్బహవో దోషాన్తాడనాద్బహవో గుణాః|
తస్మాత్పుత్రం చ శిష్యం చ తాడయేన్నతులాలయేత్ఛ||”
అని ఒక నీతిశాస్త్ర బోధ.
అల్లరి కృష్ణుని ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన తల్లి యశోద. .
దండించాలి అని నిర్ణయించుకొంది. చేతిలో బెత్తం పట్టుకొని కోపంతో ఝళిపిస్తూ “ఒరేయ్ పిల్లాడా! ఆగక్కడ” అని అరుస్తూ యశోద దగ్గరకు వచ్చింది . కృష్ణ బాలుడు భయపడినట్లు ముఖం పెట్టి, అల్లరి ఆపేసాడు. గభాలున రోలుమీంచి కిందకి దూకాడు.
చిలిపి కృష్ణుడు చిందులు తొక్కటాలు మానేసి, చాలా వేగంగా పరుగు లంకించుకున్నాడు. కాలి గజ్జలు గల్లు గల్లు మని మ్రోగుతున్నాయి. తల్లి యశోదాదేవి వెంట పరుగెట్టుకుంటూ వస్తోంది. గోపికా స్త్రీలు నవ్వుతూ చూస్తున్నారు. అప్పుడు
యశోదామాత “ఆగు, ఆగు” అంటూ ఇంటి ముంగిలిలో పరుగెడుతున్న బాలకృష్ణుడి వెంట పరుగెడుతున్నది. పెద్ద వక్షోజాల బరువుతో అలసిపోతూ, వంగిపోతూ ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. పరుగెట్టే వేగానికి కొప్పు కదిలి జారిపోతూ ఉంది. చమటలు కారిపోతూ ఉన్నాయి. పైట జారిపోతూ ఉంది. మహామహా యోగీంద్రుల మనస్సులు కూడా పట్టుకోలేని ఆ లీలాగోపాల బాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరుముతూ ఉన్నది. ఎంత అదృష్టం యశోదాదేవిది.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.