శ్రీ కృష్ణావతారం 13
శ్రీ కృష్ణావతారం 13
యశోద గోపికల నొడంబరచుట
మరికా ఆ కపట శైశవమూర్తి కొంటె కృష్ణమూర్తి దొంగజాడల ఇలా రకరకాల బాల్యచేష్టలను లీలలుగా ప్రదర్శిస్తూ క్రీడిస్తుంటే. తమకు అందిస్తున్న ఆ మహాప్రసాదాలను తెలుసుకోలేక, ఓపికలు నశించిన గోపికలు తిడుతుంటే. యశోదాదేవి వారికి ఇలా చెప్పుతున్నారు. "మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకు తగినపని కాదు. తల్లులల్లారా! మనోజ్ఞమైన మగువల్లారా! ముల్లోకాలకు మోదం కలిగించే ముదితల్లారా! నామాట వినండి. ఇతను ఇతరమైనదేది ఎరుగడు. తనంతట తనే క్రీడిస్తు ఉంటాడు. మా కన్నయ్య ఎంతో మంచివాడు అమ్మలార! సకల సద్గుణవతీ లలామల్లారా! ఇతనిపై అపనిందలు వేయకండమ్మా." తల్లి యశోదాదేవి తన వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి చెప్పే గోపికలను సమాధాన పరుస్తోంది. ఇలా ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను చెప్పుకుంటున్న ఓపికలు లేని గోపికలకు యశోదాదేవి నచ్చచెప్పి పంపిది, కాని కొడుకుమీద ఉన్న ప్రేమ వలన కోప్పడలేకపోయింది. ఇలా గోపికలు తన తల్లి యశోదకు తను చేసే అల్లరిల పనులు అన్ని ఎంచి మరీ చెప్తుంటే, ఈ కొంటె కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఎంతో భయపడిపోయిన వాడిలాగ, ఎంతో నెమ్మదైన వానిలాగ, పరమ సాధు బుద్ధి వానిలాగ, అమాయకపు పిల్లవానిలాగ, నివ్వెరపోయినవానిలాగ, మందుడి లాగ ఊరికే ఉన్నాడు. అసలు ఏమి జరగనట్లు తల్లి ఒడిలో చేరి తల్లి రొమ్ములపై తలాన్చి ఆడుకుంటున్నాడు.
కృష్ణుడుమన్నుదినెననుట
ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కృష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. అంత ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది. "ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా ఏమిటి పాపం." ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు. " అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెఱ్ఱివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు" అని చిన్నికృష్ణుడు.
మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.
నోటిలో విశ్వరూపప్రదర్శన
అలా కృష్ణుడు తల్లిని మెత్తని మాటలతో శాంతింపజేసాడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి అయిన శైశవకృష్ణుడు తన నోరు తెరిచి తల్లి యశోదాదేవికి చూపించాడు.
యశోదామాత ఆ పసివాని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు మొదలగు వాటితో భూగోళము; అగ్ని; సూర్యుడు; చంద్రుడు; అష్టదిక్పాలకులు 1తూర్పుకి ఇంద్రుడు, 2ఆగ్నేయానికి అగ్ని, 3దక్షిణానికి యముడు, 4నైఋతికి నిరృతి, 5పడమరకి వరుణుడు, 6వాయవ్యానికి వాయువు, 7ఉత్తరానికి కుబేరుడు, 8ఈశాన్యానికి శివుడు మొదలగు సమస్తముతో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసింది.
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి.
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో! తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పరస్థలమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
“నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.
యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసిన విభ్రాంతిలో ఇంకా ఇలా అనుకుంటోంది.
ఇంత చిన్న పిల్లవాడి నోటిలో, ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడిపోయింది పసివాడిలాగ కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆదిమూలాధారమైన సర్వవ్యాపకుడు అయిన శ్రీమహావిష్ణువే. ఇదే ముమ్మాటికీ నిజం.” ఇలా యశోదాదేవి ఈ కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొని . ఇలా ఈ నోటిలో విశ్వదర్శనం ఇచ్చిన కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. .
“విష్ణుమూర్తి అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న ఆ మహాత్ముడైన విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడింది. నా బుద్ధి చలించిపోయింది. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ మహా విష్ణువునే శరణు కోరుతాను. ఇలా ఈ నోట విశ్వదర్శనం చూపిన కృష్ణబాలుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని నిశ్చయించుకొనిన యశోదాదేవి ఇలా స్తోత్రం చేస్తోంది. . “ఈ బాలకుని నిండు ముఖాన్ని చూసి నేను, నా భర్త, ఈ వ్రేపల్లెలోని గోపగోపికా జనాలు అందరం, చివరకు గోవులుకూడ ఇతడు బాలుడే అని భ్రాంతి పడ్డాం కాని, ఇతడు మా కందరికి ప్రభువైన ఈశ్వరుడు అని గుర్తించలేకపోయాం.’
బాలకృష్ణుడు ఇలా తనను భగవంతుడైన శ్రీమహావిష్ణువుగా భావిస్తూ ఉన్న యశోదకు మళ్ళీ వైష్ణవమాయను ఆవరింపజేశాడు. పరీక్షిన్మహారాజా! ఆ మాయా ప్రభావంవలన యశోద మోహం చెంది, బాలకృష్ణుడు సర్వాత్ముడే అనే విషయం మరచిపోయింది. అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దులాడింది”
నందయశోదలపూర్వజన్మ
ఇలా శుకమహర్షి యశోద బాలకృష్ణుని ముద్దు చేస్తోంది అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
శుకమహర్షీ! నీవు ఆత్మానందం పొందిన వాడవు. ఈ లోకాలన్నిటికీ ప్రభువూ భగవంతుడూ అయిన శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి పూర్వజన్మలలో ఏమి నోములు నోచిందో? శ్రీ హరిని పొషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏమి తపస్సులు చేసాడో? కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరుతారో?”
అని రాజయోగి అయిన పరీక్షిన్మహారాజు అడుగగా, యోగిబ్రహ్మ శుకుడు ఇలా అన్నాడు. ⇠
నందయశోదలపూర్వజన్మ
"ఓ పరీక్షిత్తు మహారాజా! చెప్తాను విను! వసువులు అనే దేవతలలో "ద్రోణుడు" అనేవాడు ముఖ్యుడు; అతని భార్య "ధర"; బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూలోకంలో జన్మించమని ఆదేశించాడు; "విశ్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవించే భాగ్యం ప్రసాదించినట్లు అయితే అలాగే భూమిపై జన్మిస్తాము" అన్నారు ఆ దంపతులు; బ్రహ్మదేవుడు "అలాగే" అని అనుగ్రహించాడు; ఆ ద్రోణుడు అనే వసువే ఈ నందుడుగా జన్మించాడు, ధరాదేవి అనే వసువే యశోద; శ్రీమన్నారాయణుడు కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించాడు; ఎంతో భక్తితో, సంతోషంతో గౌరవించాడు;
సశేషం
కామెంట్లు