శ్రీ కృష్ణావతారం 12

శ్రీ కృష్ణావతారం 12

గోపికలు కృష్ణ యల్లరి చెప్పుట

ఇంకను ఆ మాయామానవ బాలకుడు శ్రీకృష్ణుడు మాయా శైశవ లీలలలో క్రీడిస్తుంటే, గోకులంలోని గోపికలు ఓపికలు లేక, తల్లి యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుని అల్లరి చెప్పుకోసాగారు . కలువలవంటి కన్నులున్న తల్లీ! అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోవటం లే దని పసిపిల్లల తల్లులు గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ లేగదూడనుల తాళ్ళువిప్పి ఆవులకు వదిలేస్తున్నాడు చూడవమ్మ. ఓ యశోదమ్మా! నువ్వు గొప్ప పడచుదానివే కాని, నీ పిల్లాడు చూడు; మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే, ఆ పాలను తోటిపిల్లలకు పోసేశాడు, ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో, లేదో మరి. ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.
ఓ సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలు పెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు. లత వలె సున్నితమైన దేహం గల సుందంరాంగీ యశోదా! నీ కొడుకు అలా వెళ్ళి, వీళ్ళ ఇంట్లోని పెరుగు శుభ్రంగా తాగాడు. పోతూపోతూ నిద్రపోతున్న వాళ్ళ కోడలి మూతికి కొద్దిగా పెరుగు పులిమాడు. లేచాక అత్తగారు చూసి దొంగతిండి తిందని కోడలిని కొట్టింది. ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?” అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా. ఈ ఇల్లాలు వాకిట్లోంచి వెళ్తున్న నీ పిల్లాడ్ని పిలిచి నిలబెట్టి పేరు అడిగింది. మీ వాడు చటుక్కున ఆమె పెదవి కొరికి పారిపోయాడు. ఓ యమ్మో! మీ ముద్దుల కొడుకు తక్కువ వాడేం కాదు తెలుసా. ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా! ఈ చక్కటామెను “దొంగతనంగా లేవదీసుకుపోతాను, నాతో వచ్చేస్తావా” అని అడిగాడట మీ చిన్నాడు. విన్నావా యశోదమ్మ తల్లీ! ఇలాంటి విచిత్రం ఎక్కడైనా చూసామా చెప్పు..ఓ యమ్మా యశోదా! ఈ విచిత్రం విను. ఓ యిల్లాలు తనకు కొడుకులు లేరే “అపుత్రస్య గతిర్నాస్తిః” అని శాస్త్రం కదా మరి మా గతేంటి అని బాధపడుతుంటే, “నన్ను మొగుడుగా చేసుకో కొడుకులు పుడతారు” అని మీదమీదకి వచ్చాడుట మీ వాడు. ఇవేమైనా పసివాడి పనులా చెప్పు.
అవును అతనేమైనా పసివాడా కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే కదా. పరబ్రహ్మస్వరూపు డైన తన్ను భర్తగా స్వీకరించ మని సద్గతులు కలుగుతాయి అని నొక్కి చెప్పే, ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల బాల్యచేష్టలను చేస్తున్నాడు.
చక్కని లేడికన్నులవంటి కళ్ళు నీ కున్నాయిలే కాని ఓ యశోదమ్మ! ఇటు చూడు. ఈ అమ్మాయి “బహిష్ఠు అయ్యాను దూరంగా ఉండు” అంటే, నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ “బహిష్ఠు అయిన చోటేది” అని అడిగాడుట. ఈ అమ్మాయేమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బావుందా చెప్పు.
ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది”. “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు” అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా. ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?
గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.) ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా.పూతీగెలాంటి చక్కదనాల సుందరాంగీ ఓ యశోదమ్మా! నీ కొడుకు నా కొడుకును పట్టుకొని వాడి పొట్ట నిండిపోయినా వదలకుండా బలవంతంగా బానెడు వెన్న పట్టించేసాడు. వాడికి ఊపిరి ఆడటం లేదు. మా వాడిని తీసుకు వచ్చి చూపిస్తా. ఇదిగో వాడి కేమైనా అయిందంటే నీదే బాధ్యత సుమా. ఒకామె నిద్రపోతుంటే బట్టలు విప్పేసి, నీ కొడుకు ఇంత పెద్ద తేలు తెచ్చి కరిపించాడు. ఆమె బెదిరిపోయి పెద్ద నోరు పెట్టుకొని అరుస్తూ గంతులు వేస్తుంటే మీ అబ్బాయి పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా తల్లీ! ఎంతో సాధు స్వభావివి కదా నువ్వు చెప్పు మరి. నా కొడుకు కోడలు ఏకాంతంలో ఉంటే, నీ కొడుకు వెళ్ళి పాము నొకదానిని వారిమీద పడేసాడు. వంటిమీద బట్టలు లేవని తెలియనంతగా భయపడిపోయి, వాళ్ళు పరుగులు పెడుతుంటే, చూసి హేళనగా కేకలు పెట్టాడు. ఓ యశోదమ్మా! నీవేమో సుగుణాల రాశివి కదా. మరి మీ వాడి గుణ మేమైనా బావుందా చెప్పు.ఓ యమ్మా! ఒక యువతి పెరుగు చిలుకుతోంది. చివరకి వెన్న తీయడానికి వంగింది. నీ కొడుకు వెనక చేరి పోకిరీ పనులు చేయసాగాడు. కొంచం బుద్ధి చెప్పరాదా?
స్త్రీ బాలాంధజడోపమా అంటారు కదా అలా ఉండి, పెరుగు అనే జ్ఞానం పేరుకున్న వేదాలు చిలికిచిలికి, వెన్న అనే సారం తీయడానికి ప్రయత్నిస్తే సరిపోదు అని. ఏకాంతిక భక్తి లేనిచో వ్యర్థమని పరమాత్మ వెనుతగిలి మగపోడుమ లనే సరైన పురుషయత్నం చూపుతున్నాడట.



ఓ యశోదమ్మా! మంజులవాణి! మీ వాడు వస్తాడని ఊహించాము. మా వీథిలోని గొల్ల భామలము అందరము తలుపులు అన్ని వేసేసి, గడియలకు తాళాలు బిగించాము. అతను వచ్చే దారిని కాపాలాగా చూస్తునే ఉన్నాం. తలుపులకు వేసిన గొళ్లేలు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. కాని ఇలా చూసేసరికి ఎలా వచ్చాడో ఎలా దూరాడో మరి ఒకరి ఇంట్లో పాటలు పాడుతున్నాడు. ఇంకొక ఇంటిలో గెంతుతున్నాడు. ఇంకో ఇంట్లో నవ్వుతున్నాడు. మరింకొక ఇంట్లోనేమో తిడుతున్నాడు. ఇంకొక చోటేమో ఎక్కిరిస్తున్నాడు. కొన్ని ఇళ్ళల్లో అయితే పక్షులలా కూతలు జంతువులలా కూతలు కూస్తున్నాడు.. ఇంతట్లోనే ఎలా వెళ్ళిపోతాడో చటుక్కున వెళ్ళిపొతాడు. చూస్తే ఖాళీ కడవలు ఉంటాయి తల్లీ. నిర్మలమైన మోము గల ఓ యశోదాదేవి! ఎంత భాగ్యవంతులు అయితే మాత్రం. గొప్ప తిండి తింటారు, గొప్ప బట్టలు కట్టుకుంటారు. అంతేకాని రాజవంశపు స్త్రీలు ఎక్కడ అయినా ఇలా పిల్లలను ఊళ్ళోని పేదల మీద పడి పేదలను వేపుకు తిన మని చిరునవ్వులు నవ్వుతూ పంపుతారా? చెప్పు. ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు."

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.