శ్రీ కృష్ణావతారం 11
శ్రీ కృష్ణావతారం 11
కృష్ణబలరాముల క్రీడాభివర్ణన
బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పసితనంలో క్రమంగా బాల్యక్రీడలతో గోకులంలో అందరకు సంతోషం కలిగిస్తున్నారు. మోకాళ్ళపై చేతులు వూని పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. తూలుతారు మళ్ళా నిలబడతారు. అటునిటు నడుస్తారు. లేగ ఆవుదూడల తోకలు పట్టుకొంటారు, అవి పరుగెడుతుంటే, ఆ తోకలు వదలిపెట్టలేక వాటి వెనుక జరుగుతు ఉంటారు. తల్లులు పాలు ఇస్తుంటే రెండు చేతులతోను పాలిండ్లు రెండు తడుముతు గుక్కగుక్కకు చేపుకు వచ్చేలా పాలు త్రాగుతుంటారు. వచ్చీరాని ముద్దుమాటలు పలుకుతారు. చేతులు కాళ్ళు కదుపుతు పసిక్రీడలలో నాట్యాలు ఆడేవారు.బాల్యక్రీడలలో బలరామ కృష్ణులు ఆలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి, రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచి దనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు. అలా బలభద్ర కృష్ణులు బాల్యక్రీడలలో నేలపై ప్రాకుతు మెల్లగా తలలెత్తి ఆడుకుంటు ఉంటే, ఆదిశేషుడు వంటి సర్పరాజులు పడగెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తారు. ఆటల్లో ఒంటినిండ మట్టి అంటినప్పుడు ఏనుగు గున్నలలా గోచరిస్తారు. కుప్పిగంతులు వేసేటప్పుడు సాటేలేని జవసత్వాలతో సింహం పిల్లలులా కనిపిస్తారు. రోజు రోజుకి వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతు ఉదయిస్తున్న సూర్య చంద్రులు లాగ కనబడతారు. తల్లుల చనుబాలన్నీ త్రాగి నిద్ర కూరుకు వస్తుంటే, చక్కటి యోగసాధనతో కలిగిన అనుభవం అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న యోగీశ్వరుల వలె గోచరిస్తున్నారు, వారి లీలలు వీక్షిస్తున్న వ్రేపల్లెవాసులకు తన్మయత్వం కలుగుతోంది. ఊర్థ్వ, అధో, భూలోకాలు మూటిని తన కనుసన్నలలో నడుపే ఆ శ్రీహరి, భక్తిలేక తనని లెక్కచేయని వారి ఎడల దయచూపడు. అట్టి శ్రీహరి శైశవశ్రేష్ఠు డైన కృష్ణుడుగా కళ్ళు తిప్పుతు చుట్టుపక్కలవారిని చూసి గుర్తుపట్ట నారంభించాడు. ఓ పరీక్షిన్మహారాజా! మహావిష్ణువు చిరునవ్వు నవ్వితే ఆత్మజ్ఞానము కాని లౌకిక విద్యలను దట్టమైన అజ్ఞానం నవ్వులపాలై, జ్ఞానం పుట్టుకు వస్తుంది. అంతటి పరదైవము మానవ బాలకృష్ణునిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులగు త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే శ్రీమన్నారాయణుడు జన్మలు లేని వాడు గనుక తనకు అమ్మ అంటు ఎవరు లేరు. జగత్తు అంతటికి తనే అమ్మ. అంతటి పరమపురుషుడు యశోదమ్మ కొడుకై గోపెమ్మలు అందరికి ఆనందం కలిగేలా అమ్మా అమ్మా అనటం నేర్చాడు.
సర్వకారణమై నిష్కారణమై వెలుగు పరబ్రహ్మము ఆత్మావైపుత్రానామాసీత్ అని శ్రుతి కనుక జగత్తునకు మాతృస్థానమైన తానే పుత్రరూపమై జన్మించి అమ్మా అమ్మా అనసాగాడు. అవ్వ అవ్వ అని వేసిన పంచకంచే మాతృత్వ విలువ చెప్పబడుతోందా? ఆదిపరాశక్తితో అబేధం చెప్పబడుతోందా? "సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్” అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు. అలా వేయి అడుగులు కలిగిన వాడు. ఇక్కడ వేయి, సహస్రం అంటే అనంతమని గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి మూడడుగుల భూమి యాచించి, రెండు అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణబాలకుడై తప్పటడుగులు వేయ నారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్ళు జారిపోయి అధమ బుద్ధులు, సణుగుళ్ళు వదిలేసి క్రింద నేలపై పడి అణగిపోయారు.
హరిహరాభేదము చూపుట
అంతే కాకుండా ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే. దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది, మెళ్ళోవేసిన హారాలు సర్పహారాలుగా కనబడుతున్నాయి. అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు. ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.బలభద్ర కృష్ణుల బాల్యక్రీడలు ఆ మందలోని గోపికలకు మధుర మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి, అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తు ఉండిపోయారు. బలరామకృష్ణులు శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో, వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతు వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు ఉన్న జంతువులనుండి; నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండ జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల యెడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతు ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు. బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటు ఉంటే, తన యీడు గల గొల్లపిల్లవాళ్ళు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది.
ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు. తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే, కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసి “నా కన్నతండ్రి! రా ప్రియ చెలికాళ్ళు వచ్చారు” అంటు చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటు తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే, మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లుఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది.
గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా తల్లి పక్కకి చేరతాడు. "అమ్మా బువ్వ పెట్టు" అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు. మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు. “నేను ఆబోతును, మీరందరు ఆవులు” అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజును, “మీరు అందరు నా భటులు” అంటు, అధికారం చూపుతు వాళ్ళతో ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. “నేను దొంగను మీరు గృహస్థులు” అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. “మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వం చేసే సూత్రధారుడను” “నేను తోలుబొమ్మ లాడించే వాడిని, మీరు రకరకాల పాత్రల ధరించే తోలు బొమ్మలు” అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. తిరుగుబోతులా, దొంగలా రకరకాల పోకిళ్ళు పోతాడు.
సశేషం
కామెంట్‌లు