శ్రీ కృష్ణావతారం 10

శ్రీ కృష్ణావతారం 10

యశోద కృష్ణుని తొట్లనిడుట

యశోద ఒకనాడు బాలకృష్ణుడు ప్రక్కకు ఒత్తిగిల్లి, బోర్లపడడం నేర్చుకున్నాడు అని వేడుక చేసింది. ఆవేళ బాలకుని జన్మనక్షత్రం. ముచ్చటతో గోపికలను అందరినీ పేరంటానికి పిలిచింది. మంగళవాద్యాలు మ్రోగుతుండగా బ్రాహ్మణులచేత వేదమంత్రాలతో అభిషేకం చేయించింది. బ్రాహ్మణుల దీవెనలు గ్రహించి, వారికి ఆహార ధాన్యాలు గోవులు క్రొత్త బట్టలు అడిగినవి అడిగినట్లు దానం చేసి, తరువాత బాలకృష్ణుణ్ణి పాన్పుపై పడుకోబెట్టి నిదురపుచ్చింది. వృద్ధు లైన గోపికలకు గోపకులకు గౌరవాలు చేస్తూ, ఆ సందడిలో పిల్లవాడి విషయం మరచిపోయింది.

కృష్ణుడు శకటము దన్నుట

శైశవ కృష్ణుడు బోర్లా పడ్డాడు. యశోదాదేవి పండుగ జేస్తున్నది. గోపకులను గౌరవించే హడావిడిలో, చంటిపిల్లడిని ప్రీతిగా పాన్పు మీద నిద్రపోగొట్టింది. పనులలో మునిగిపోయింది. అప్పుడు. .
అలా నిద్రనటిస్తున్న చంటిపిల్లాడుగా ఉన్న శ్రీకృష్ణునికి ఆకలి వేసింది. పాలకోసం ఒళ్ళు విరుచుకుంటు కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. ఆ పాదాలు మామూలువా, కాదు చక్రం చాపం మున్నగు శుభరేఖలతో అలరారేవి. అట్టి పాదంతో ఒక బండిని గట్టిగా తన్నాడు. కృష్ణుడు షడ్భావ శూన్యుడు, షడూర్మి శూన్యుడు. అయినను నిద్ర నటిస్తున్నాడు. లోకవిడంబనార్థం తల్లిపాలు తాగాలని చూస్తున్నట్లు నటిస్తున్నాడు. స్తన్యం ఇచ్చేవారు లేరని కోపం వచ్చి, కాలుతో శకటాన్ని తన్నాడు. శకటం అంటే మానవ శరీరం. అసురుడు అంటే అమానుష తత్త్వము ధరించి నిద్రా సంగమాదులలో మునిగితేలు మూర్ఖుడు. భోగవాంఛలు బండిలోని వస్తువులు. వాని వలన సంసారసాగరంలో పడుతున్నాడు. వాటిని పరిత్యజించాలని బండిని తన్నటం. ఆ తన్నిన పాదం విశ్వాన్ని నడిపే చక్రం శాసించే చాపం తానైన పరమాత్మ. పరిత్యజించటానికైనా భగవానుని అనుగ్రహం కావాలి కనుక భక్తి ముఖ్యం అని అనుకోవచ్చు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి శ్రీమదాంధ్రభాగవత గ్రంథం. ఆ పండితోత్తమునికి కృతజ్ఞతా పూర్వక ప్రణామ శతాలు]
అలా బాలకృష్ణుడు బండిని తన్నగా, అది ఆకాశం అంత ఎత్తు ఎగిరింది. ఇరుసు బరువుకి చక్రాల కండ్లు నేలమీద ముక్కలుముక్కలై పడ్డాయి. అక్కడున్న గోపకులు ఆశ్చర్యపోయారు.
శకటము మానవ దేహానికి గుర్తు. హరి బ్రహ్మజ్ఞానం తన్నటం తాకటం అంటే స్పర్శ కలిగింది. నడిపిన నడిపించిన పుణ్యాల ఫలంతో స్వర్గ ప్రాప్తి కలిగింది (ఆకాశాని కెగసింది). ఇరుసు (సంచితాది కర్మలు) బరువుకి కండ్లు అంటే (కర్మ వాసనలు) తో ఛిన్నాభిన్నము అయ్యి నేలమీద పడెను. అంటే పుణ్యకర్మ ఫలము కరిగిపోయి మర్త్యలోకంలో పడి పునర్జన్మ పొందును. గోపకులు జ్ఞానపేక్షకులు /ముముక్షువులు.
[ఆధారం శ్రీ పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు గారి శ్రీమదాంధ్రభాగవత గ్రంథం. వారికి వందనాలు]
బాలకృష్ణుని తన్నుకు బండి ఎగిసి పడింది. దానిలోని రసవంతమైన పదార్థాలు వ్యర్థాలు అయ్యి నేలపాలయ్యాయి. అప్పుడది చూసి, యశోద, నందుడు మున్నగు గోపీ గోపకులు సంభ్రమంతో చేస్తున్న పనులు మరచారు. వేడుకలు మానారు. ఉత్సాహాలు నశించి మిక్కిలి బెదరసాగారు.
“ఉత్తినే కారణం లేకుండా బండి ఎగరదు కదా. మరి ఈ చంటి పిల్లాడు కృష్ణుడు అంతటి పనికి చాలినవాడు కాదు. పక్కమీంచి లేవనైన లేవలేడు. మరి బండి ఎలా ఎగిరిపడింది” అనుకుంటు గోపగోపికాజనాలు విచారించసాగారు. బండి ఎలా ఎగిరి పడిందని గోపగోపికలు యోచించుకుంటున్నారు. అప్పుడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఇలా చెప్పారు. “పక్కమీద పడుకున్న చంటిపిల్లాడు హరి ఆకలేసి ఏడుస్తూ కాలు జాడించాడు. కాలు తగిలి బండి ఎగిరిపడింది. అంతే గాని మరో కారణం కాదు.” ఇలా కృష్ణుని కాలు తాకిడికి బండి ఎగిరిందని చెప్పిన పిల్లల మాటలు విని. అప్పుడు గోపికాగోపజనులు ఎంతో ఆశ్చర్యపోతూ ఇలా అనుకోసాగారు “ఇంత చంటిపిల్లా డేమిటి? ఇంత పెద్ద బండిని కాలుతో తన్నటం ఏమిటి? అది వెళ్ళి ఆకాశం అంత ఎత్తు ఎగరటం ఏమిటి? కుఱ్ఱాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారో, ఏమిటో కాని. స్వర్గ మర్త్య పాతాళాలనే ముల్లోకాలలో ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి అసంబద్ధాలు మాట్లాడారా? లేదు లేదు, దీనికి వేరే హేతువేదో ఉండవచ్చు” ఇలా శకటాసుర సంహారం చేసిన లీలా బాలకుడు కృష్ణుని ఏడుపు విని యశోద పరుగెట్టుకొని వచ్చింది. ఓ నా చిన్ని కన్నా! అలసిపోయావా నాయనా! ఆకలేస్తోందా కన్నా! మంచి వాడివి కదా కన్నా! ఏడుపు ఇక ఆపు నాయనా! దా పాలు తాగి చిరునవ్వులు చిందించు కన్నా! అంటు లాలిస్తూ యశోదాదేవి పాలిచ్చింది బిడ్డడికి. బాల కృష్ణుడు శకటాసుర సంహారం చేసిన తరువాత, అనేకమంది గోపకులు పిల్లాడికి బాలగ్రహం సోకిందేమో అని అనేక రకాల శాంతులు బలులు చేసారు. బ్రాహ్మణులు పెరుగు, దర్భలు, అక్షంతలు దిష్టి తీసి హోమంలో వేసారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. పుణ్యాహవచనాలు చదివారు. నందుడు కుమారుని అభ్యుదయం కోసం అలంకరించిన పాడి ఆవులను పండితులకు దానం చేసాడు. వారి ఆశీర్వాదములు తీసుకుని ఆనందించాడు. అంటు శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు. ఓ మహారాజా! పరీక్షిత్తు! తల్లి యశోదాదేవి, ఒకరోజు పాపడిని ఒళ్ళో కూర్చుండబెట్టుకొంది. ముద్దులు పెట్టి లాలించి ఒడలు నిమురుతోంది. ఇంతలో ఆ యశోదా కృష్ణుడు చటుక్కున పెద్ద కొండరాయి అంత బరువెక్కి పోసాగాడు. అలా యశోద తొడలమీది కొడుకు బరువెక్కిపోతుంటే, ఇంత బరువుగా ఉన్న కొడుకును మోయలేక నేలమీద పడుకోబెట్టింది. బెదిరిపోతు తల్లి యశోద మనసులో ఇతగాడు లోకాన్ని కాపాడటానికి వచ్చిన కారణజన్ముడేమో అనుకుంది.
అవును మరి సాధారణ పిల్లాడు కాదు కదా, లీలామాణవబాలకుడు కదా. అది గ్రహింపు అయినప్పటికి, వెంటనే మాయ కమ్మేసిందేమో. లేకపోతే నేలమీద పెడుతుందా కారణజన్ముని అని సందేహం.

తృణావర్తుడు కొనిపోవుట

అప్పుడు అలా బరువెక్కిన చంటిపిల్లవానిని తల్లి కింద పెట్టి వెళ్ళినప్పుడు. కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు అకస్మాత్తు నేల మీదకి వచ్చాడు. ఆ రావటం రావటం సుడిగాలి రూపంలో “రయ్” “రయ్” మంటు అందరు ఆశ్చర్యపోయేలా మిక్కిలి వడితో కమ్ముకుంటు వచ్చి, ఒక్క విసురుతో కృష్ణబాలకుని పైకి ఎత్తుకుపోయాడు.

సుడి యెఱుఁగని హరి సుడివడ
సుడిగాలి తెఱంగు రక్కసుఁడు విసరెడి యా
సుడిగాలి ధూళి గన్నుల
సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా!

కష్టం అంటే తెలియని చంటిపిల్లాడు కృష్ణుడుని చిక్కుపడేయాలని తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రేపాడు. ఆ విసురుకి లేస్తున్న దుమ్ముకు కళ్ళు కమ్ముకోగా గోపకులు బెదిరి గాబరా పడ్డారు.
సుడి సుడి అని ఏడుసార్లు ప్రయోగించి. ఎంతో చమత్కారం చూపారు పొతన్న గారు.
ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వలె విజృంభించి రివ్వురివ్వున విసిరికొట్టాడు. ఆ గాలినుండి పుట్టిన దుమ్ము ధూళి ఉవ్వెత్తుగా లేచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుని కిరణాలకు అడ్డుపడింది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టంగా ఆవరించింది. గోపకులు దిక్కు తెలియక అల్లాడిపోయారు, 
ఎవరెక్కడ ఉన్నారో తెలియకుండ పోయింది. దానితో నిశ్చేష్టులైన వారి కందరికి గొప్పభయం పుట్టి మనస్సుల నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగానికి ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. జగమంత గిఱ్ఱున తిరుగుతున్నట్లు తోచింది. అలా ఒక్క ముహూర్తం పాటు లోకా లన్నిటికి భయంకరమైన స్థితి ఏర్పడింది.
(కసిమసగు, ముసురు, మసరుకవియు, చెవుడుపడు వంటి జాతీయాలు ప్రయోగం వచనానికి ఎంతో అందాన్నిచ్చాయి.) తన చంటిబిడ్డ కృష్ణుడు కనబడకపోడం అనే విపత్తులో పడి కొట్టుకుంటున్న యశోదాదేవి ఎంతో కలత చెందింది. “ఓ నా చిట్టితండ్రీ! ఉదయించే సూర్యుని లాంటి ప్రకాశం కలవాడవు కదా నువ్వు. బాలలలో వరేణ్యుడవు కదా. ఇదేమిటయ్యా, ఇలా సుడిగాలి బారిన పడిపోయావు” అని పిలుస్తూ విలపించింది. ఇలాటి విపద్దశ కలిగించిన దేవుణ్ణి అనేక రకాలుగా నిందించింది. ఎఁతో బాధ పడింది. బాధతో కుంగిపోతు విలపించసాగింది. “ఓ నా ముద్దుల కొడుకా! అయ్యో సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయిందా కొడుకా! ఆకాశంలో సుళ్ళు తిప్పేస్తుంటే ఎంతలా ఏడుస్తున్నావో ఏమిటో. ఎంతగా బెదిరి పోయావో ఏమిటో. మరీ ఇంత ఘోరమా” అంటు యశోద వాపోతోంది. “పిల్లాడ్ని ఇక్కడే ఇలా పడుకో బెట్టా. నా చిన్ని కన్నయ్య ఇక్కడే ఆడుతు ఉన్నాడు. ఇంతలో ఈ పాడు గాలి ఎక్కనుండి వచ్చిందో. నా పిల్లాడ్ని ఎక్కడకి ఎగరేసుకు పోతోందో. నా కొడుకు ఏమైపోతున్నాడో. అయ్యో నా కింకేం సాయం దొరుకుతుంది.” అంటూ ఆ కలువ కన్నుల కాంతామణి యశోద, లేగదూడ దూరమైన దుఃఖంతో అరుస్తు కూలే పాడి ఆవులా, భరించరాని దుఃఖంతో నేలమీద కుప్పకూలి పోయింది. సుడిగాలి ఎత్తుకుపోయిన తన కొడుకు కృష్ణుని కోసం ఇలా విలపిస్తున్న తల్లి యశోదాదేవిని చూసి, గోపికలు ఆరాటంతో కళ్ళనీళ్ళు పెట్టుకుని దుఃఖించసాగారు.
ఈలోగా, ఆ సుడిగాలిరాక్షసుడు, తృణావర్తుడు మిక్కిలి అహంకారంతో బాలకృష్ణుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి తీసుకుపోసాగాడు. అయితే కృష్ణుడు క్రమేపీ బరువెక్కి పోసాగాడు. క్రమేణా రాక్షసుడికి బాలుని బరువు భరించే శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు. వాడి తిరిగే వేగం తగ్గిపోతోంది. కడకు కదలటం కూడ కష్టసాధ్యం అయిపోయింది. “ఇంతకు ముందు ఇలాంటి పిల్లాణ్ణి ఎక్కడా చూడలేదే, ఇంకెలా బతకను బాబోయ్” అని విచారించసాగాడు. అలా తృణావర్తుడు బాలుని బరువు మోయలేక ఆరాటపడుతున్నాడు. అప్పుడు.
ఓ పరీక్షిన్మహారాజా! కృష్ణుడు గున్న ఏనుగు తొండాల్లాంటి తన రెండు చేతులు తృణావర్తుని కంఠానికి, శిక్షగావేసే బొండకొయ్యలా, మెలేసి బిగించాడు. పెద్ద కొండంత బరువై వాడి మెడగట్టిగా పట్టుకొని వేళ్ళాడసాగాడు.
రాజు శిక్షవేస్తేనే ఇక్కడ బాధపెట్టినా, పాప పరిహారం జరిగి నరకబాధలు తగ్గుతాయి. అలాగే భగవంతుడు వేసే శిక్షైనా అనుగ్రహమే. అందుకే అధిపా అని ప్రయోగించారేమో అనుకుంటాను. తన కంఠం బిగించి పట్టుకున్న పర్వతమంత బరువైన కృష్ణబాలకుని బరువు దిగలాగుతుంటే, ఆ పట్టు తప్పించుకోలేక తృణావర్తుడు ఉరిలో చిక్కుకొని కొట్టుకొనే పక్షిలాగ గిలగిలా కొట్టుకోసాగాడు. అలా పాపాలు హరించేవాడైన శ్రీకృష్ణుడు చేతులుతో నొక్కుతున్న నొక్కుడుకి, స్వాధీనం తప్పి తృణావర్తుడు రాళ్ళమీద పడ్డాడు. అలా త్రిపురసంహారి శంకరుని బాణం దెబ్బకి పురము కూలినట్లు కూలి పడ్డ ఆ దేవతల శత్రువు అవయవాలు అన్నీ తుక్కు తుక్కుగా చితికిపోయాయి. అలా తృణాసురుడు నేలకూలటం అంతా చూసిన గొల్లభామలు సంతోషంతో ఆ రాక్షసుడి గుండెల మీద బరువుగా ఉండటం మాని విలాసంగా ఆడుకుంటున్న కృష్ణబాలకుని తీసుకొని వచ్చి, తల్లి యశోదకు ఇచ్చారు. వాళ్ళు ఆశ్చర్యంతో ఇలా అనుకోసాగారు. మంచి వాడు తన మంచి బుద్ధి వలన, ఏ విధమైన రక్షణలు లేకపోయినా కాపాడబడుతూ ఉంటాడు. చెడ్డవాడు తన పాపాల ఫలితంగా, సంకటాలు కలిగినప్పుడు వేలకొద్దీ భటుల రక్షణలు ఏర్పాటు చేసినా శిక్షింపబడతాడు అంటారు ఇదే కాబోలు? పూర్వ జన్మలలో ఏమి పుణ్య చేశామో? ఏమి నోములు నోచామో? ఎంతటి దానాలు చేశామో? ఎంత గొప్ప తత్వ విచారాలు చేశామో? ఎంతటి సత్యాలు పలికామో? ఎలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించామో కానీ? ఇవాళ ఈ చిన్ని కన్నయ్యన కృష్ణయ్యను మళ్ళా చూడగలిగాము. ఇదేం విచిత్రమూ ఈ చిన్ని పాపడికి భయం అన్నదే లేదు.


 పాలుతాగి విశ్వరూప ప్రదర్శన

ఇలా గొల్లభామలు తమలో అనుకుంటూ ఉంటే, నందుడు ఇంతకు ముందు వసుదేవుడు తనకు చెప్పిన మాటలు గుర్తుచేసుకుని ఆశ్చర్యపోసాగాడు.
ఓ జనాధిప! పరీక్షిన్మహారాజా! యశోదకు ఒకనాడు పాలిండ్లు చేపుకు వచ్చాయి. తన ముద్దుల కృష్ణుని ఎత్తుకొని, ఒడిలో పడుకోబెట్టుకొని ముద్దాడింది. చిన్న కృష్ణునికి చక్కగా పాలు తాగించింది. ప్రేమగా ముఖం నిమురసాగింది. ఆ అల్లరి పిల్లాడు తన మాయలమారి చిరునవ్వులు నవ్వుతు నిద్రవస్తున్నట్లు ఆవులించాడు. అతని నోరు పెద్ద కొండగుహవలె యశోదకు కనబడింది. ఆ లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు చరచారాలైన అన్ని జీవరాశుల తోసహా కనబడ్డాయి. ఆమె కన్నులు అరమోడ్పులు అయ్యాయి. ఆమె నివ్వెరపోయింది.
వదన గహ్వరము అంటే వాక్ స్థానమైనది. మరి ఈ చరాచరజగత్తు సమస్తం వాగధిష్టానం. . అంటే శబ్దనిష్ఠం కదా. “సర్వంశబ్దనిష్ఠంజగత్” అని ప్రమాణం. అంటే శబ్దం లేకపోతే ఏమి లేదని. ఆహా ఏమి చోద్యం. చూపుతున్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మ. చూపుతున్నది తల్లి జీవజాలం సమస్తం అనుకోవచ్చా. జననాథుడు అంటే జీవజాలంలో జ్ఞానం గల మానవు లందరి నాథుడు కదా. ఆ రోజుల్లో ఒకరోజు వసుదేవుడు యాదవుల పురోహితుడు అయిన గర్గుడిని, నందుడి మందకు వెళ్ళమని పురమాయించేడు. అలా గర్గుడు రాగానే నందుడు తన ఆసనం గబుక్కున దిగి, చేతులు జోడించి నిలబడి. . .ఆ గర్గమహాముని ఎంతో మంచి గుణాలూ నడవడికలూ కలవాడు; గొప్ప శివ భక్తుడు; ఎల్లప్పుడూ సత్సాంగత్యంతో ఉండేవాడు, దుర్జన సాంగత్యం వర్జించి మెలగేవాడు; కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలు విడిచిన వాడు; పైగా పురోహితుడు. అంతటివాని రాకతో సంతోషించినవాడై, మిక్కిలి ప్రీతితో ఆ గర్గుని సేవించాడు. అలా సేవించి, తగిన అతిథి సత్కారాలు చేసి, నందుడు గర్గమునితో ఇలా అన్నాడు."ఓ మహాత్ముడవైన గర్గమహాముని! మీవంటి పెద్దలు, మా వంటి సామాన్యుల ఇళ్ళకు ఉత్తినే రారు. వచ్చారంటే తప్పకుండా ఏదో గొప్ప మేలు సిద్ధించడానికి మాత్రమే. అందుకే "ఊరక రారు మహాత్ములు" అన్న నానుడి ప్రసిద్ధమైంది కదా. కాబట్టి, తమ రాక వలన మాకు తప్పకుండా శుభాలు కలుగుతాయి. ఇది సత్యం. మానవులకు తమ కుల పురోహితుడే సర్వోత్తమమైన విప్రుడు అంటారు. పైగా మీరు గొప్ప జ్యోతిష్కులలో శ్రేష్ఠులు, మిక్కిలి తేజోవంతులు. నలుదిక్కులా పాకిన కీర్తి కలవారు. బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు. కాబట్టి. దయచేసి నా అభ్యర్థన మన్నించి, ఈ పిల్లలకు నామకరణము మొదలైన సంస్కారాలు చేయించి వీరిని పరిశుద్ధులను చెయ్యి."

 రామకృష్ణుల నామకరణం

అలా నందుడు నామకరణం చేయమని గర్గుని అడిగి, బలరాముడు, కృష్ణుడు ఇద్దరిని చూపించాడు. అంతట గర్గుడు కంసుడు బాలిక అయితేనేం అష్టమ గర్భం అనుకుంటూ చంపబోతే ఆకాశంలోకి ఎగిరిపోయిన ఆ యోగమాయ చెప్పిన మాటలు వివరించి చెప్పి; ఈ కృష్ణుడే ఆ దేవకీదేవి కొడుకు అని అనుకునే అవకాశం ఉంది కనుక; నామకరణాది సంస్కారాలు గోప్యంగా చేయటం మేలని చెప్పాడు. దానికి నందుడు అంగీకరించిన పిమ్మట రోహిణి కొడుకుని గురించి. . .ఓ రాజా1 ఈ రోహిణీ కుమారుడుకి లోకులు అందరు సంతోషించేలా ప్రవర్తించేవాడు కనుక రాముడు అనీ. యాదవులలో ఐకమత్యం పెంచి కలిసి మెలిసి ఉండేలా చూసేవాడు కనుక సంకర్షణుడు అనీ. గొప్ప బలవంతుడు కనుక బలుడు అనీ గర్గుడు నామకరణం చేసాడు. ఆ తరువాత, యశోదా కుమారుడు కృష్ణునికి “ఈ బిడ్డడు పూర్వం కృతయుగంలో తెల్లగానూ, త్రేతాయుగంలో ఎఱ్ఱగానూ, ద్వాపర యుగంలో పచ్చగానూ ఉండేవాడు కానీ. ప్రస్తుతం నల్లని దేహం కలవాడు అయ్యాడు కనుక కృష్ణుడు అని పేరు పెట్టాడు, వసుదేవుడికి పుట్టుటచేత వాసుదేవుడు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడు అని చెప్పి, ఈ పిల్లవాడికి అనేకమైన గుణాలు, రూపాలు, సాధించిన కార్యాలు లెక్కలేనన్ని ఉంటాయి కనుక అనంతమైన పేర్లు ఉంటాయి. ఇతని వలన మీ కష్టాలు అన్నీ నష్టాలు అవుతాయి అంటే నశించిపోతాయి. ఇతను దుర్జనులను శిక్షిస్తాడు, సజ్జనులను రక్షిస్తాడు. ఈ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానుడు.” అని చెప్పి, నందుడు దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. నందుడు పరమానంద భరితుడు అయ్యాడు.

సశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.